పల్నాడు కలెక్టరుగా లాట్కర్‌, ఎస్పీగా మల్లికాగార్గ్‌

నియమిస్తూ ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు
ప్రశాంత వాతావరణానికి చర్యలు

నరసరావుపేట, మహానాడు : పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేష్‌ లాట్కర్‌, ఎస్పీగా మల్లికా గార్గ్‌ను నియమిస్తూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్‌ లాట్కర్‌ 2011 బ్యాచ్‌కు చెందిన వారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ ఆగ్రోస్‌ సంస్థకు, అగ్రికల్చర్‌ కోఆపరేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఉపాధ్యక్షులుగా, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం మునిసిపల్‌ అడ్మిని స్ట్రేషన్‌ కమిషనర్‌ పనిచేస్తున్న ఆయనను బదిలీపై కలెక్టర్‌గా నియమించారు. అలాగే ఎస్పీగా నియమితులైన మల్లికాగార్డ్‌ గతంలో కృష్ణా జిల్లా అడిషనల్‌ ఎస్పీగా పనిచేశారు. తర్వాత ప్రకాశం జిల్లా ఎస్పీ, తిరుపతి ఎస్పీగా కూడా పని చేశారు. ఆమె పశ్చిమబెంగాల్‌కు చెందిన పోలీస్‌ అధికారి. పల్నాడు జిల్లాకు వచ్చిన తొలి మహిళా ఎస్పీ. కాగా ఎన్నికల ముందు, తర్వాత జరిగిన ఘటన లపై జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేయగా, ఎస్పీ బిందుమాధవ్‌ను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ఎన్నికల కమిషన్‌ చర్యలు చేపట్టింది.