-డబ్బు తీసుకున్నారు..ప్రశ్నించే హక్కులేదని మండిపాటు
-అభివృద్ధి చేసినా బీజేపీ అభ్యర్థికి సహకరించారని ఆగ్రహం
-ఊరికి ఉపకారం..శవానికి సింగారం కూడదని వ్యాఖ్యలు
ఆదోని, మహానాడు: ఆదోని ఇలవేల్పు మహాయోగి లక్ష్మమ్మ అమ్మ వారిని ఆదోని వైసీపీ అభ్యర్థి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో సంచలన వాఖ్యలు చేశారు. ఆదోని ప్రజలు పథకాలు తీసుకుని బీజేపీ అభ్యర్థికి సహకరించారని, తనపై ఆయన అసత్య ఆరోపణలు చేసినా ప్రజలు ఎవరూ ప్రశ్నించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోనిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసినా తనకు సహకరించలేదని అసహనం వ్యక్తం చేశారు.
ఓటు వేయడానికి డబ్బులు తీసుకున్నారని..అలాంటి వారికి ప్రశ్నించే హక్కు లేదని మండిపడ్డారు. ఆదోని ప్రజలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించినా మార్పు కావాలని కోరుకోవడం చాలా బాధాకరమని, ఊరికి ఉపకారం..శవానికి సింగారం చేయకూడదని తెలుసుకున్నానని వ్యాఖ్యానించారు. మహిళలు, మైనారిటీల సహకారంతో ఈసారి కూడా గెలిచేది నేనే, గెలిచాక ఏమి చేస్తాననేది అప్పుడు చెబుతానని అసహనంగా మాట్లాడారు.