ఎట్టకేలకు దొరికాడు..!

-మాజీ ప్రధాని దేవెగౌడ మనవడ్ని ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసిన పోలీసులు

మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను ఎట్టకేలకు బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే అర్ధరాత్రి వేళ రేవణ్ణను అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద ఉన్న రెండు సూట్ కేసులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భారీ భద్రత మధ్య ఆయన్ను విచారణ నిమిత్తం సీఐడీ కార్యాలయానికి తరలించారు.

ప్రజ్వల్ రేవణ్ణ ఎన్డీయే కూటమి తరపున హాసన నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. పలువురు మహిళలపై లైంగిక దౌర్జన్యానికి రేవణ్ణ పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వీడియోలు సోషల్ మీడియాలో సైతం చక్కర్లు కొట్టడంతో ఏప్రిల్ నెలలో రేవణ్ణ దేశం విడిచి జర్మనీ పరారయ్యాడు. రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ తో పాటు, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు సైతం జారీ అయ్యాయి. దౌత్య పాస్ పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ సిద్ధమైంది. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని మాజీ ప్రధాని దేవెగౌడతో పాటు రేవణ్ణ తండ్రి హెచ్డీ రేవణ్ణ, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి బహిరంగంగానే ప్రజ్వల్ కు సూచించారు. దీంతో మే31న పోలీసుల విచారణకు హాజరవుతానని రేవణ్ణ ప్రకటించారు.