-ఇష్టమొచ్చిన కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారు
-రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది
-ఆస్తులు, అప్పులు, చెల్లింపుల వివరాలు బయటపెట్టండి
-అందుకు అనుగుణంగా ఆదేశాలు ఇవ్వండి
-రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన పురంధేశ్వరి
విజయవాడ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, పార్టీ నాయకులు శుక్రవారం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ బీఐ, ఎఫ్ ఆర్ బీఎం నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం ఆస్తులను తనఖా పెట్టి వివిధ సంస్థల నుంచి అప్పులు చేశారు. కార్పొరేషన్లను సృష్టించి అవి ప్రభుత్వ అప్పులు కాదని కార్పొరేషన్ పేరు మీద రుణాలు సేకరించి వాటిని మళ్లిస్తూ వచ్చిందని వివరించారు. ప్రజలు తాగే మద్యం… కార్పొరేషన్ ద్వారా ఆదాయం చూపించి రాబోయే కాలంలో దానిని చూపించి అప్పులు చేయడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ ఇతర ఫండ్స్ ను కూడా తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.
ఇష్టారీతిన చెల్లింపులు చేస్తున్నారు
రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన బకాయిలు ఇవ్వనందువల్ల ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. తెచ్చిన అప్పులకు వడ్డీలు, అసలు తడిపి మోపడై చివరకు ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. సార్వత్రిక ఎన్నికల తరువాత అంతకుముందు కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన మొత్తాలను సీఎం ఎఫ్ ఎస్ లకు అప్లోడ్ చేస్తూ వాటిని క్రమంలో చెల్లించకుండా ఇష్టమైన రీతిలో ఇష్టమైన వాళ్లకు మాత్రమే పేమెంట్ చేస్తూ ఉండటం అందరి దృష్టికి వచ్చింది. ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉన్నప్రభుత్వం ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేయడం సమంజసం కాదు. ఈ కింది వివరాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా తెప్పించి మాకు అవగాహన కల్పించాలని గవర్నర్‌ను కోరారు.
ఆస్తులు, అప్పులు, చెల్లింపుల వివరాలివ్వండి
మొత్తం అవుట్ స్టాండిరగ్ ఆర్ బీఐ లిస్టు ప్రకారం తెచ్చిన అప్పులు. కార్పొరేషన్ల వారీగా తెచ్చిన అప్పుల మొత్తం, కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బకాయిలు, రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు మొత్తం, రాష్ట్ర ప్రభుత్వం సావనీర్ గ్యారంటీ ఇచ్చి తెచ్చిన అప్పులు, ఎన్నికల అనంతరం కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లుల వివరాలు, ప్రభుత్వ ఉద్యోగులు ఇతర ప్రావిడెంట్ ఫండ్స్ నుంచి, ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన అప్పుల వివరాలు, ప్రభుత్వ ఉద్యోగులకు టీఏ, డీఏ బకాయిల వివరాలు, ప్రతి సంవత్సరం రీపేమెంట్‌కు అసలు ప్లస్ వడ్డీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఎంత కట్టాల్సి ఉంది, సివిల్ సప్లయర్స్ కార్పొరేషన్, డిస్కం లకు, పవర్ సప్లయర్స్‌లకు చెల్లించవలసిన బకాయిల వివరాలు ఇప్పించేలా ఆదేశించాలని కోరారు. ఈ సంవత్సరంలో వివిధ సంక్షేమ పథకాలకు నిధులు రిలీజ్ చేయాల్సి ఉన్నా అతికొద్ది మాత్రమే ఇచ్చి మొత్తం ఇచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారు. ఈ విధంగా ఈ సంవత్సరం సంక్షేమ పథకాలకు ఎంత నిధులు చెల్లించాల్సి ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వంపై కేసుల వివరాలు, కోర్టులు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం అమలుపరచకుండా కంటెప్ట్ కేసులు ఉన్న వివరాలు ఇవ్వాలని విన్నవించారు. ఆమె వెంట బీజేపీ నాయకులు ఉన్నారు.