హైదరాబాద్, జూన్ 21 మహానాడు : రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న పరిణామాలను గమనించిన పిమ్మట నేను వారిని మా ఇంటికి మనఃస్పూర్తిగా ఆహ్వానించాననీ పోచారం అన్నారు.
రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి, రైతు సంక్షేమంతో పాటుగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం వారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా ఆమోదయోగ్యమైననీ అని అన్నారు.
తాను స్వయంగా రైతుననీ,రైతుల కష్టసుఖాలు తనకు తెలుసనీ, అందుకే రేవంత్ రెడ్డి రైతాంగానికి చేస్తున్న మంచి కార్యక్రమాలకు అండగా ఉండాలని ఆలోచించి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ఆరు నెలలుగా చేస్తున్న పనులను గమనిస్తూ, చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు.కొత్త ప్రభుత్వంలో సమస్యలు సహజం, అయినప్పటికీ చిన్న వయసులోనే రేవంత్ రెడ్డి దైర్యంతో వాటిని అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళుతున్నారు.
వారిని, రాష్ట్ర మంత్రి వర్గాన్ని అభినందిస్తున్నానన్నారు.
మంచి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీలోకి రావాలనే నిర్ణయం తాను తీసుకున్నానన్నారు. తన జీవితంలో రాజకీయంగా ఆశించడానికి ఏమి లేదనీ, ఆశించేది రైతుల సంక్షేమం ఆశిస్తున్నానని అన్నారు.
నా రాజకీయ జీవితంలో ఎక్కువగా రైతులతో సంబంధం ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి, సహకార వ్యవసాయ బ్యాంకు చైర్మన్ గా చేశాను.
నా రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతోనే మొదలైంది. తరువాత టిడిపి, టిఆర్ యస్ లలో పనిచేశాను. ఇప్పుడు చివరకు మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చాను.
రేవంత్ రెడ్డికి ఇంకా ఇరవై ఏళ్ళు రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉన్నదన్నారు.
రేవంత్ రెడ్డి చేస్తున్న మంచి పనులకు మెచ్చి నాకు వ్యక్తిగతంగా నచ్చి వారి నాయకత్వాన్ని బలపరచాలని, వారి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామంటూ రాష్ట్ర ప్రగతికి చేదోడు వాదోడుగా ఉంటూ రైతుల సంక్షేమం కోసం అందరం సమిష్టిగా కృషి చేస్తాం అని ఆయన అన్నారు.