హైదారాబాద్ జూన్21:మహానాడు : మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై స్పందించిన మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి . 2012లో ఆయన రాజీనామా చేసి తెలంగాణ కోసం పోటీచేస్తే అందరం కలిసి గెలిపించుకున్నామని,2014లో గెలిచిన ఆయనను తెలంగాణ మొదటి వ్యవసాయ శాఖా మంత్రిగా గౌరవించుకున్నాం అన్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత స్పీకర్ గా చేసే ఆయనకు అవకాశం ఇచ్చాం.
ఆయన అడిగిందే తడవు అన్ని పనులను ప్రభుత్వం ఆమోదించింది
రాష్ట్రంలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కట్టనన్ని ఇళ్లు బాన్స్ వాడ నియోజకవర్గంలో కట్టడానికి కేసీఆర్ అనుమతులు ఇచ్చారు. మొన్న ఎన్నికల్లో ఆయన ఆరోగ్యం బాలేదని పోటీ చేయను అన్నారు. చివరకు ఆయనే పోటీ చేశారు. దానికి పార్టీ అవకాశం ఇచ్చింది,ఇప్పుడు ఏ నైతికతతో పోచారం పార్టీ మారుతున్నాడో అర్దం కావడం లేదు,ఇలాంటి వారిని చూసి తెలంగాణ సమాజం గందరగోళంలో పడుతుంది అన్నారు.
స్పీకర్ గా, వ్యవసాయ శాఖా మంత్రి గా ఆయనకు కేసీఆర్ అత్యున్నత గౌరవం ఇచ్చారు.కుమారుడికి డీసీసీబీ చైర్మన్ గా అవకాశం కల్పించారు . లక్ష్మీపుత్రుడు అని ఆయనను కేసీఆర్ బహిరంగ సభలు, అంతర్గత సమావేశాల్లో వేనోళ్ల పొగిడారు . ఇంతచేసినా ఇంత కఠినంగా, నిర్దాక్షిణ్యంగా పోచారం ఎందుకు వ్యవహరించారో అర్దం కావడం లేదు . పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పోచారం ఇలా చేయడం బాధాకరం అన్నారు.