– జగన్.. ఆ యప్ప ఇక మారడప్పా!
– తలపట్టుకుంటున్న వైసీపీ సీనియర్లు
– ఓటమి కారణాలపై విశ్లేషించే చాన్సివ్వని జగన్
– ఈవీఎంలే ఓడించారని చెబితేనే వింటున్న జగన్
– వాస్తవ విశ్లేషణలు వినేందుకు ఇష్టపడని వైనం
– ఓడినా ఇంకా సీఎం అన్న భ్రమలు
– సీనియర్ల గంటలపాటు వెయిటింగ్
– జగన్‌ను ఆయన ఎదుటే దులిపేసిన కడప సీనియర్ నేత
– అవినాష్, సురేష్‌కుమార్ వ ల్లే జిల్లాలో పార్టీ నాశనమంటూ ఫైర్
– ఆ ఎమ్మెల్సీని బుజ్జగించి పంపేసిన జగన్
– అధినేతలు మారరా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏ పార్టీ అయినా ఎన్నికల్లో ఎందుకు ఓడిందో సమీక్షించుకుంటుంది. తమ తప్పులు తెలుసుకునేపనిలో ఉంటుంది. ఏ అంశాలు తమను దెబ్బతీశాయో ఆరా తీస్తుంది. ఏ వర్గం ఓటరు తమకు ఎందుకు ఓటువే యలేదో అన్వేషిస్తుంది. ఆ క్రమంలో సీనియర్ల వాదనలకు అవకాశం ఇస్తుంది. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి మాత్రం అందుకు భిన్నం. ఆయన తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు! ఆయన ఏది చెబితే నేతలు ఆయన వాదనను అనుసరించాలి. దానితో ‘‘ఇక ఆ యప్ప ఇంక మారడప్పా’’ అని వైకాపేయులు ఫిక్సవుతున్న పరిస్థితి.
ఓటమి తర్వాత జిల్లా నేతలను కలుస్తున్న జగన్.. ఓటమి కారణాలు వినేందుకు ఇష్టపడకపోవడంపై వైకాపా నేతల్లో నిరాశ వ్యక్తమవుతోంది. మనం ఎక్కడ దెబ్బతిన్నామన్నా అని అడుగుతున్న జగన్.. ‘ప్రతి ఒక్కరికీ ఎంతో మేలుచేసినా మనం ఓడిపోవడం ఏంటో నమ్మబుద్ధికావడం లేదు. ఈవీఎంలో మోసం జరిగిందనుకుంటున్నా. అట్లాగని మనం గట్టిగా మాట్లాడేందుకు మన దగ్గర ఆధారాలేమీలేవు’ అని వ్యాఖ్యానిస్తున్నారట.
దానితో జగన్ మనస్తత్వం గ్రహించిన నేతలు.. ‘‘అవునన్నా.. పోలింగ్ తర్వాత మనం ఎవరిని అడిగినా మీకే ఓటేశామంటున్నారు. కానీ ఎందుకు ఓడిపోయామో మాకూ అర్థం కావడం లేదు. టీడీపీ,జనసేనతో బీజేపీ కుమ్మక్కయి ఈవీఎంలు మార్చింది. లేకపోతే పేదలకు ఇంతచేసిన మనం ఎట్లా ఓడిపోతాం’’ అని కోరస్ ఇచ్చి, జగన్‌ను మెప్పించేలా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ భజనగానం సీనియర్లకు ఏమాత్రం రుచించడం లేదట. ఆ ప్రకారంగా రెండురోజుల క్రితం.. కడప జిల్లా బద్వేలు సీనియర్ నేత ఒకరు, జగన్ తీరుపై ఆయన ఎదుటే విమర్శనాస్త్రాలు సంధించిన నేపథ్యంలో, అక్కడి నేతలు ఆయనను బుజ్జగించి బయటకు తీసుకువచ్చారట.
‘నేను ఈ పార్టీకి సీనియర్ లీడర్‌ను. గంటసేపటి నుంచి బయట వెయిట్ చేస్తున్నా. నాతో ఎమ్మెల్యే కూడా వచ్చింది. అపాయింట్మెంట్ తీసుకునే మీ వద్దకు వచ్చాం. ఓడినా జగన్ ఇక మారడా’ అని జగన్ సిబ్బందిపై విరుచుకుపడినట్లు సమాచారం. దానితో లోపల అవినాష్‌రెడ్డి-సురేష్‌కుమార్ ఉన్నారని, వారందరితో కలసి మీటింగ్ పెడాదమనుకున్నట్లు చెప్పడంతో ఆ నేత అగ్గిరాముడయ్యారట. ‘అసలు జిల్లాలో పార్టీని నాశనం చేసిందే వాళ్లు. వాళ్ల వల్లే పార్టీ నాశనం అయింది. మేం వాళ్లతో కలసి కూర్చోవాలా’’ అని ప్రశ్నించినట్లు తెలిసింది. సదరు నేతను బుజ్జగించిన జగన్ సిబ్బంది, తర్వాత లోపలకు పంపించారట.
అక్కడ కూడా ఆయన జగన్ తీరుపై బాహాటంగానే అసంతృప్తి వ్కక్తం చేసినట్లు సమాచారం. ఓటమి కారణాలు విశ్లేషించకుండా.. అందరూ ఈవీఎంలపై నెపం వేయడంతో, సదరు నేత సీరియర్ అయ్యారట. ‘‘మీరు ఇంకా మారకపోతే నష్టంపోతాం సార్. నేను, ఎమ్మెల్యే గంటసేపు నుంచి బయట వెయిట్ చేస్తుంటే ఇక్కడ మీరు పార్టీని నాశనం చేసినవాళ్లతో మాట్లాడటం ఏం బాగోలేదు. ఓటమికి కారణాలపై కిందిస్థాయి కార్యకర్తలతో మాట్లాడితే రిజల్టు వస్తాయి. ముందు మనం నేతలను గౌరవించడం నేర్చుకోవాల’ని ఊగిపోవడంతో, జగన్ హతాశుడయి.. అది కాదన్నా అని సర్దిచెప్పే ప్రయత్నం చేశారట. ఈలోగా అక్కడున్న వారు, ఆయనను బుజ్జగించి బయటకు పంపించినట్లు తెలుస్తోంది.
ఓడిపోయినప్పటికీ జగన్ అపాయింట్మెంట్ తీరు, ఇంకా అవమానకరంగానే ఉందని సీనియర్లు చెబుతున్నారు. ఒకవైపు జగన్ సిబ్బందేమో సార్ దగ్గరకు ఎవరైనా రావచ్చని చెబుతుంటే, తీరా అక్కడికి వెళ్లిన తర్వాత మాత్రం, ఇంకా ఆయన పాత అవమానించే విధానమే అమలుచేస్తున్నారని మండిపడుతున్నారు.
‘‘ఓటమికి కారణాలను ముందే ఈవీఎంలపై నె ట్టేస్తే, ఇక నేతలు క్షేత్రస్థాయి వాస్తవాలు ఎలా చెబుతారు? వాటిని వినడం ఇష్టం లేన్నట్లు జగన్ కూడా వ్యవహరిస్తున్నారు. ముఖమంతా అదోలా పెడుతున్నారు. అదే తప్పంతా ఈవీఎంలదే అని చెబితేనే సంతృప్తి చెందుతున్నారు. ఇక అలాంటప్పుడు మాలాంటి వాళ్లు అంతదూరం వెళ్లి నిజాలు చెప్పడం దండగనే కదా’’ అని సీనియర్లు వాపోతున్నారు.
సో.. ఇప్పుడు ఏ పార్టీ అధినేత కూడా మారేందుకు సిద్ధంగా లేరు. తమకు అనుగుణంగా అందరూ మారాలనుకుంటున్నారే తప్ప.. క్యాడర్-లీడర్ల మనోభావాల ప్రకారం నడుచుకోవాలని ఆలోచించడం లేదని స్పష్టమవుతుంది.
‘‘ఒకసారి వారిమాట వినడం మొదలుపెడితే, తమ ఆలోచనలు ఎక్కడ దెబ్బతింటాయోనన్న భయమే దానికి కారణం. ఇక అందరూ సలహాలివ్వడం మొదలుపెడితే తాము వినేవాళ్లుగా-వాళ్లు చెప్పేవారిగా మిగిలిపోతామన్న మరో భయం కూడా లేకపోలేదు. అధికారం రాకపోయినా ఫర్వాలేదనుకుంటారే తప్ప, ఏ పార్టీ అధినేత కూడా మారరు’’ అని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడొకరు వివరించారు.
‘‘జగన్ జగమొండి అని అందరికీ తెలుసు. అసలు ఆయనకు చెప్పడమే సాహసం. కానీ చంద్రబాబు అలాకాదు. ప్రజాస్వామ్యవాదిగా కనిపిస్తారు. అందరు చెప్పేది వింటారు. అందులో బాగున్న వాటిని అమలు చేస్తారు.ఎన్నికల ముందు అభ్యర్ధుల ఎంపిక, క్యాబినెట్ కూర్పునకు ముందు బాబు, సీనియర్లు-పొలిట్‌బ్యూరో సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకునేవారు. పదవులు రాని వారిని పిలిచి మాట్లాడి, ఏ కారణంతో పదవి ఇవ్వలేకపోయామన్నది వారికి నచ్చచెప్పేవారు. దానితో అసంతృప్తితో వచ్చిన వారు సంతృప్తితో వె ళ్లేవారు. ఇది ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ఆయన కూడా మారినట్లు కనిపిస్తోంది. మంత్రి పదవులు ఆశించి నిరాశకు గురైన వారిని ఈసారి పిలిచి మాట్లాడినట్లు లేదు. అభ్యర్ధుల ఎంపిక ముందు కూడా పొలిట్బ్యూరోల చర్చించినట్లు లేదు. బహుశా ఇకపై ఇదే పంథా టీడీపీలో కొనసాగే అవకాశం కనిపిస్తోంది. తరం మారటం కూడా దానికో కారణం’’ అని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడొకరు వివరించారు.