(భోగాది వేంకట రాయుడు)
“ఏడ్చే దాని మొగుడు వస్తే, నా మొగుడూ వస్తాడు…” అనే సామెత చందం గా, చంద్రబాబు నాయుడు అడక్కుండానే ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా/ ప్రత్యేక ప్యాకేజి త్వరలోనే రావడానికి అవకాశాలు పుష్కలం గా కనపడుతున్నాయి.
2018 నుంచి దాదాపు ఓ ఏడాది పాటు, ఈ ప్రత్యేక హోదా కోసం అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎంత యాగీ చేశారో తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం లో ఉన్న టీడీపీ మంత్రుల చేత రాజీనామా కూడా చేయించారు. ధర్మాగ్రహం అంటూ సభలూ – సమావేశాలు నిర్వహించారు. మోడీ పై దుమ్మెత్తి పోశారు.చివరకు ఢిల్లీ లోనూ నల్ల దుస్తులతో ధర్నాలు చేశారు.
ప్రధాని మోడీ చలించలేదు. ఉలక లేదు. పలక లేదు.పైపెచ్చు, 2019 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీని, రాష్ట్రాన్ని కూడా ఓడించడానికి ప్రధాని హోదాలో చేయగలిగినంతా చేశారు. చేయగూడనివీ చేశారు.అయిదేళ్లపాటు చంద్రబాబు మీద, తెలుగు ప్రజలమీద తన కక్షను నరేంద్ర మోడీ అలా తీర్చుకున్నారు.
2024 ఎన్నికల సమయం వచ్చేసరికి, మోడీ కి జ్ఞానోదయం అయింది. దత్తపుత్రుళ్ల ను పక్కనబెట్టి, చంద్రబాబు తో జతకట్టక తప్పని పరిస్థితి ఎదురైంది.
మూడోసారి అధికారం లోకి మోడీ వచ్చినప్పటికీ ; ఛాతి మాత్రం… గతం లో మాదిరిగా 56 అంగుళాలు లేదు. బాగా కుంచించుకు పోయింది.
గతం లో అనేక అవమానాల పాల్జేసిన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ల మద్దతు లేకపోతే ; కేంద్రం లో బీజేపీ(మోడీ) ప్రభుత్వానికి మనుగడ లేదు.
కీలెరిగి వాత పెట్టడం లో సిద్ధహస్తుడైన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ; మెల్లగా కత్తి బయటకు తీశారు. బీహార్ కు ప్రత్యేక హోదా సంగతి ఏం చేశారు అంటూ కేంద్రాన్ని సున్నితంగా ప్రశ్నించారు. ఆ మేరకు, వారి పార్టీ కార్యవర్గ సమావేశం లో ఓ తీర్మానం ఆమోదించారు. ప్రత్యేక హోదా లేకపోతే, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఏదో ఒకటి ఇవ్వక పోతే ; నితీష్ కుమార్ జెండా ఎత్తేయ వచ్చు. అవతల, ‘ఇండియా’ కూటమి రెడీ గా ఉంది. వాళ్లకు ఇంకో నలభై మంది మద్దతు ఉంటే చాలు, కేంద్రం లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. అందువల్ల, బీహార్ నితీష్ కుమార్ డిమాండ్ ను ఆమోదించడం గానీ, తిరస్కరించడం గానీమోడీ కి అంత సులభం కాదు.
బీహార్ విషయం లో కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ; ఆంధ్ర ప్రదేశ్ విషయం లో కూడా అదే తరహా నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి లో కేంద్రం పడిపోతుంది.
ఎందుకంటె, ఆంధ్ర కు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రమే పార్లమెంట్ లో ప్రకటించింది. బీహార్ కు ఇస్తామని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదు. బీహార్ ముఖ్యమంత్రే అడుగుతున్నారు.
అటువంటిది, బీహార్ కు ఏది ఇస్తే, ఆంధ్రప్రదేశ్ కూ అదే తరహా ప్రయోజనాన్ని కేంద్రం కల్పించాల్సి ఉంటుంది.
లేకపోతే ; ‘ఇండియా’ కూటమి కాచుకుని కూర్చునే ఉంది కదా!
అదీ గాక, బీహార్ అసెంబ్లీ కి ఎన్నికలు వచ్చే ఏడాది అక్టోబర్ / నవంబర్ లోపు జరగాల్సి ఉంది.
అందువల్ల బీహార్ కు ప్రత్యేక హోదా నో, ఆర్ధిక ప్రత్యేక ప్యాకేజీ నో ఈ లోగా సాధించాల్సిన అనివార్యత నితీష్ కుమార్ పై ఉంది. లేకపోతే, ఎన్నికల తరువాత, ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఆయనకు ఉండకపోవచ్చు.
అందువల్ల, తమకు ప్రత్యేక హోదా నో, ప్రత్యేక ప్యాకేజి నో ఇవ్వాలంటూ ఆయన కేంద్రం పై ఒత్తిడి తేవడం ఖాయం.
బీహార్ కి కేంద్రం ఏది ఇస్తే, అటువంటి వెసులుబాటు నే అదే చేత్తో ఆంధ్ర కు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
అందువల్ల, చంద్రబాబు నాయుడు నోరు తెరిచి అడగనవసరం లేదు. దానిబదులు ; రాష్ట్రం లోని వివిధ పథకాలు, ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు రాబట్టగలిగితే చాలు.
ఇక, ప్రత్యేక హోదా వచ్చినా, ప్యాకేజి వచ్చినా….;ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస్తారు అనడం లో సందేహం లేదు.