బి.ఆర్.ఎస్ పార్టీ అధికార ప్రతినిధి డా. ఎర్రోళ్ల శ్రీనివాస్
హైదరాబాద్, మహానాడు : నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టు హేయమైన చర్య అని బి.ఆర్.ఎస్ పార్టీ అధికార ప్రతినిధి డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. వారి సమస్యలను వినకుండా నిర్బంధించడాన్ని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ గత ఏడు నెలలుగా నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదు.
వారి సమస్యలను వినడానికి ఒక్క మంత్రి, అధికారి అందుబాటులో లేరు. వారితో చర్చలు జరపకపోవడం సిగ్గుచేటు. ఇది ప్రజా పాలన కాదు నిర్బంధ పాలన. అమ్మాయిలని కూడా చూడకుండా రాత్రి పూట అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు అనేక ఆశలు కల్పించి ఎన్నికల్లో వారిని వాడుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని రొడ్డుకీడ్చింది.
ఇప్పటికైనా వారితో చర్చలు జరిపి వారి న్యాయపరమైన డిమాండ్లను, హామీలను నెరవేర్చాలన్నారు. విద్యార్థుల, నిరుద్యోగుల తరుపున గొంతెత్తుతామన్నారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగుల అరెస్టులను తక్షణం నిలిపివేసి, అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.