* అమరావతిలో రంగా పేరిట స్మృతి వనం
* మంత్రి నారా లోకేష్ కు విన్నవించిన కాపు జాగృతి నాయకులు
మంగళగిరి, మహానాడు : ఉండవల్లిలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని పునర్నిర్మించాలని, రాజధాని అమరావతిలో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించి రంగా పేరిట స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని కాపు జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్ధన్, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్న రాజేష్ మంత్రి లోకేష్ ను కొరారు. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ఒక జిల్లాకు రంగా పేరును నామకరణం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జొన్న రాజేష్ శుక్రవారం ఉండవల్లి ప్రజా దర్బార్ లో గ్రామీణాభివృద్ధి, ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, మంగళగిరి శాసనసభ్యులు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర విభజన అనంతరం రాజధాని నిర్మాణంలో భాగంగా 2016 లో అమరావతిని రాజధానిగా నిర్ణయించారన్నారు. రోడ్ల విస్తరణ దృష్ట్యా ఉండవల్లిలో ప్రభుత్వం రంగా విగ్రహాన్ని తొలగించిందని గుర్తు చేశారు. అప్పటి నుంచి రంగా విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలంటూ పలుమార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేసినప్పటికీ ఫలితం లేదని తెలిపారు. తాడేపల్లి, ఉండవల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో రంగాకు కులమతాలకు అతీతంగా అభిమానులు ఉన్నారని తెలిపారు. ఉండవల్లి సెంటర్లో రంగా విగ్రహ ఏర్పాటుకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని కోరారు. రాజధాని మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఉండవల్లి సెంటర్ లో ఏర్పడనున్న నాలుగు రోడ్ల కూడలి మధ్యలో రింగ్ ను నిర్మించి, రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కూడలికి రంగా సెంటర్ గా నామకరణం చేయాలని కోరారు. ఈ విజ్ఞప్తికి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారని జొన్న రాజేష్ తెలిపారు.
కమిషనర్ కు వినతి పత్రం అందజేత
ఉండవల్లి సెంటర్లో రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ, కాపు జాగృతి నాయకులు కమిషనర్ నిర్మల్ కుమార్ ను శుక్రవారం మధ్యాహ్నం కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా రంగా కృషి చేశారని ఈ నేపథ్యంలో ఆయన సేవలకు గుర్తింపు నిస్తూ రంగా విగ్రహం ఏర్పాటు చేయాలని నాయకులు కమిషనర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో కాపు జాగృతి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్న రాజేష్,దుర్గా మల్లేశ్వర రావు, జనసేన నాయకులు చిట్టెం అవినాష్, కాపు జాగృతి నాయకులు సందు రామకృష్ణ (ఆర్కే నాయుడు), సందీప్ తదితరులు పాల్గొన్నారు.