గ్రామాల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ

త్వరలో నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ సమీక్షకు వచ్చే అవకాశం
గ్రామాల వారి నివేదికలు సిద్ధం చేయండి
మండల పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

అవనిగడ్డ : పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం సాయంత్రం అవనిగడ్డ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తుంగల సుమతి అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది.

ముఖ్య అతిధిగా విచ్చేసిన బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర నిధులు సాధించి గ్రామాల్లో త్రాగునీరు, రహదారుల సమస్యలు ప్రణాళికతో పరిష్కారం చేసేందుకు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో జల జీవన్ మిషన్ పనులు అస్థవ్యస్తంగా జరిగాయని ఫలితంగా గ్రామాల్లో తాగునీటి సమస్యలు తగ్గకపోగా పెరిగాయన్నారు. ప్రతి గ్రామ పరిధిలోని సమస్యలు నివేదిక రూపంలో అందిస్తే పవన్ కళ్యాణ్ సహకారంతో నిధులు సాధిస్తామన్నారు.

త్వరలో అవనిగడ్డ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ సమీక్షకు వచ్చే అవకాశం ఉందని, అధికారులు, సర్పంచులు అందుకు అనుగుణంగా నివేదికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమిష్టితత్వం సమన్వయంతో పని చేసి ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులతో డ్రైనేజీల సమస్య, తాగునీటి సమస్యలు పరిష్కారం చేసుకోవాలని కోరారు.

ముందుగా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి నాలుగోసారి అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన సందర్బంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాదును ఎంపీపీ తుంగల సుమతి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ మరియాదేవి, తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు, వైస్ ఎంపీపీలు దిడ్ల కిరణ్, పులిగడ్డ పిచ్చెశ్వరరావు, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.