చంద్రబాబుతో ఎమ్మెల్యే చదలవాడ
నరసరావుపేట, మహానాడు: అభివృద్ధిలో నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపాలనే కసితో పరుగులు పెడుతున్నానని, ప్రభుత్వం తరఫున తోడ్పాటు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నరసరావుపేట ఎమ్మల్యే డా౹౹చదలవాడ అరవిందబాబు విన్నవించారు. ఈ మేరకు సచివాలయంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు.అభివృద్ధికి మీరు రోల్ మోడల్, అదే స్ఫూర్తితో నరసరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.ఎన్నో వనరులున్న నరసరావుపేట నియోజకవర్గం గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబాటుకు గురైందన్నారు. అభివృద్ధికి పెద్దపీట వేసే మీ నాయకత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధికి దిక్సూచిగా మార్చాలని కోరారు.
అనంతరం మంత్రులు డోలా బాలవీరాంజనేయస్వామి,నిమ్మల రామానాయుడిని కలిశారు. నియోజకవర్గంలో సాగనీటి కాల్వల్లో సిల్టు పేరుకుపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందుల్ని తెలిపారు. తక్షణమే సాగునీటి కాలువల్లో పూడిక తొలగించే పనులు చేపట్టాలని, అందుకు అవసరమైన అంచనాలు రూపొందించాలని నిమ్మల రామానాయుడుకి కోరారు. వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలంటే, ముందు సాగునీటి రంగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ పేర్కొన్నారు.