-ప్రజాదర్బార్ లో వినతిపత్రం అందించిన అధ్యాపకులు
-24గంటల్లో సమస్యను పరిష్కరించిన మంత్రి నారా లోకేష్
అమరావతి: జగన్ అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గమూ ప్రశాంతంగా నిద్రపోలేదు. ఆ కోవలో వందేళ్లకుపైగా చారిత్రక నేపథ్యం కలిగిన మదనపల్లి బిటి డిగ్రీ కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది కూడా ఉన్నారు. వారంతా గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్న గురువులు. 23నెలలుగా వారికి న్యాయబద్ధంగా అందాల్సిన నియామక ఉత్తర్వులు, జీతాలు ఇవ్వకుండా గత వైసిపి ప్రభుత్వం మానసికవేదనకు గురిచేసింది.
మంత్రి లోకేష్ చేపట్టిన ప్రజాదర్బార్ దృష్టికి తీసుకెళ్లిన 24 గంటల్లో సమస్య పరిష్కారం కావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రాష్ట్రంలోనే పేరెన్నిగన్న మదనపల్లి బిటి డిగ్రీ కళాశాల ఆస్తులను కొట్టేయాలన్న దుర్భుద్ధితో అక్కడి ప్రజలు, విద్యార్థులు, అధ్యాపకుల మనోభీష్టానికి విరుద్దంగా గత వైసిపి ప్రభుత్వం 16-8-2022న స్వాధీనం చేసుకుంది.
ఈ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అటు విద్యార్థులు, ఇటు సిబ్బందికి కష్టాలు మొదలయ్యాయి. స్వాధీనం చేసుకున్న సమయంలో 18మంది అధ్యాపకులు, 14మంది అధ్యాపకేతర సిబ్బందిని ఉద్యోగులుగా గుర్తిస్తూ లిస్టు విడుదల చేశారు. ఈ మేరకు ఆనాటి ప్రభుత్వం జి.ఓ.29ని కూడా విడుదల చేసింది.
అయితే గత 23నెలలుగా బిటి కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి నియామక ఉత్తర్వులు, జీతాలు ఇవ్వకుండా వైసిపి సర్కారు వారిని వేధింపులకు గురిచేసింది. ప్రిన్సిపాల్ ఆనంద్ రెడ్డి వైసిపి పెద్దలతో అంటకాగుతూ 32మంది అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని అవస్థల పాల్జేశారు. నాలుగునెలలుగా వారికి అటెండన్స్ కూడా నిలిపివేశారు.
ఈ విషయాన్ని సంబంధిత అధ్యాపకులు గురువారం (11-7-2024)న ప్రజాదర్బార్ లో మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్న తమకు రెండేళ్లుగా అపాయింట్ మెంట్ ఆర్డర్స్, జీతాలు లేకపోవడంతో తమ బతుకు దుర్బరంగా మారిందని వారు ఆవేదన చెందారు. వెంటనే స్పందించిన మంత్రి లోకేష్ బిటి కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది సమస్యను పరిష్కరించాల్సిందిగా కళాశాల విద్య ఉన్నతాధికారులను ఆదేశించారు.
వెనువెంటనే స్పందించిన కళాశాల విద్య కమిషనర్ పోలా భాస్కర్… తక్షణమే సంబంధిత అధ్యాపకులకు నియామక ఉత్తర్వులు ఇవ్వకపోతే ప్రిన్సిపాల్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ఉత్తర్వుల జారీచేశారు. దీంతో శుక్రవారం రాత్రి బిటి కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి ప్రిన్సిపాల్ ఆగమేఘాలపై నియామక ఉత్తర్వులు అందజేశారు.
రెండేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న తమ సమస్యకు నారా లోకేష్ ను కలిసిన 24గంటల్లో పరిష్కారం లభించడంతో బిటి కళాశాల అధ్యాపకులు ఆనందంలో మునిగిపోయారు. తమ సమస్య పరిష్కరించిన మంత్రి లోకేష్ కు వారు మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నారు.