తెలంగాణకు కేంద్రం మొండిచేయి

-బాబుపై ఆధారపడింది కాబట్టే పెట్రో, కెమికల్ హబ్
-మోడీకి సీట్లు వస్తే ఏపీకి ఇచ్చే వాళ్లే కాదు
-ఏపీలో ప్రాంతీయ పార్టీ గెలవబట్టే చంద్రబాబు అడిగినవన్నీ ఇస్తున్నారు
-ఏపీలో పెట్రో కెమికల్స్ రిఫైనరీకి మేం వ్యతిరేకం కాదు
-మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు

హైదరాబాద్, మహానాడు: బీజేపీకి కేంద్రంలో సొంతంగా మెజారిటీ రాలేదు కాబట్టే టీడీపీ, జెడీయూ తదితర పార్టీల మద్దతుతో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బాబుపై కేంద్రం ఆధారపడింది కాబట్టే పెట్రో, కెమికల్ హబ్ ఏర్పాటు చేస్తున్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ , మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ , మాజీ ఎమ్మెల్సీ ఎం .శ్రీనివాస్ రెడ్డి లు తెలంగాణ భవన్ వద్ద మీడియా సమావేశంలో అన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఏపీ విభజన చట్టంలో ఉన్న అంశాలపై చంద్రబాబు మోడీతో ఇటీవల ఢిల్లీ వెళ్ళినపుడు మాట్లాడారు. విభజన చట్టం షెడ్యూల్ 13 లో ఉన్న పెట్రో,కెమికల్, ఆయిల్ రిఫైనరీ హబ్ ఏపీకి కేంద్రం ఇస్తున్నట్లు గా ప్రముఖ పత్రిక లో వార్త వచ్చింది. ఇదే షెడ్యూల్ 13 లో తెలంగాణకు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఉంది. పదేళ్లుగా అడుగుతున్నా తెలంగాణ కు ఏమీ ఇవ్వడం లేదు. ఏపీ లో పెట్రో కెమికల్స్ రిఫైనరీ ఏర్పాటు కు మేము వ్యతిరేకం కాదు. మాకు రావాల్సినవి కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నాం.

తెలంగాణ నుంచి బీజేపీ తరపున ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు. తెలంగాణకు కేంద్ర క్యాబినెట్ మంత్రి, సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చంద్రబాబుపై కేంద్రం ఆధారపడింది కాబట్టే పెట్రో,కెమికల్ హబ్ ఇస్తున్నారు. తెలంగాణపై ఆధారపడలేదు కాబట్టే ఏమీ ఇవ్వడం లేదు. 30 ఏళ్లుగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాటం జరుగుతోంది.

మోడీకి సొంతంగా సీట్లు వచ్చి వుంటే ఏపీకి ఏమి ఇచ్చే వాళ్ళు కాదు. ఏపీలో ప్రాంతీయ పార్టీ గెలవబట్టే చంద్రబాబు అడిగినవి అన్నీ ఇస్తున్నారు. ఎనిమిది ఎంపీలను గెలిపించినా బీజేపీ తెలంగాణ ప్రజలకు మొండి చేయి చూపిస్తోంది. తెలంగాణకు కేంద్రం ఐ.టి.ఐ.ఆర్ కూడా ఇవ్వలేదు. కేసీఆర్ కొత్త గా జిల్లాలు ఏర్పాటు చేస్తే ఒక్క నవోదయ విద్యాలయం కూడా ఇవ్వలేదు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాజకీయాల గురించి తప్ప రాష్ట్ర అభివృద్ధిపై ఒక్క చర్చ లేదు. ఏపీకి ఆయిల్ రిఫైనరీ ఇచ్చినట్టుగా తెలంగాణకు విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాలి.

తెలంగాణ తెస్తామన్నాం తెచ్చి చూపాం. అభివృద్ధి చేస్తామన్నాం చేసి చూపాం. కొన్ని సార్లు కొన్ని కారణాలతో ఓడిపోతుండవచ్చు. రాజకీయాల్లో గెలుపు,ఓటములు ఉంటాయి. ఐదేళ్ల తర్వాత బీఆర్ఎస్ బ్రహ్మాండమైన మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అభివృద్ధి కోసమే బీ ఆర్ ఎస్ లో చేరుతున్నామని పార్టీ మారిన వారు అపుడు చెప్పారు. ఇపుడు వాళ్ళు మళ్ళీ అదే చెబుతున్నారు. అలాంటి వాళ్ళు వేరే పార్టీ కి పోయినా భాధ పడాల్సిన పని లేదు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగి వస్తామంటే ప్రజలే రానివ్వరు. పార్టీలు మారే వారి పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. త్వరలోనే సమావేశాలు నిర్వహించి కొత్తతరం నేతలను కేసీఆర్ ప్రోత్సహిస్తారని పేర్కొన్నారు.