-నా మాటే వినాలంటే కుదరదని చెప్పండి.. మీరూ తెలుసుకోండి
-అప్పుడు కాపులను కరివేపాకులా తీసేశారు
-ఇప్పుడయినా వినమని చెప్పండి
-మంచిమాటలు చెప్పి చూడండి
-మళ్లీ మీ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నాం
-ముద్రగడ పద్మనాభరెడ్డికి కాపు ఐక్యవేదిక బహిరంగ లేఖ
అమరావతి: అధికారంలో ఉన్న ఐదేళ్లు కాపులను కరివేపాకులా తీసేసి, తమ జాతిని పట్టించుకోని వైసీపీ అధినేత జగన్‌రెడ్డిని ఇకనయినా మారమని సలహా ఇవ్వాలంటూ.. కాపు ఐక్యవేదిక కులం మార్చుకున్న వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డికి ఒక బహిరంగ లేఖ రాసింది. నా మాటే వినాలి. నేను చెప్పిందే జరగాలనే మొండివైఖరి ఇప్పుడు మీతో సహా ఎవరికీ వర్తించదని వారు స్పష్టం చేశారు. కులం మారినప్పటికీ ఇంకా మీ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నట్లు వారు తమ లేఖలో వెల్లడించారు.
కాపు ఐక్యవేదిక బహిరంగలేఖ పూర్తి పాఠం ఇదీ..
అమరావతి
ది.13-07-2024.
శ్రీ ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి కాపు ఐక్యవేదిక బహిరంగ లేఖ
గౌరవనీయులు శ్రీ ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి కాపు ఐక్యవేదికపక్షాన నమస్కరించివ్రాయు బహిరంగ లేఖ.
అయ్యా,
తమరు ఇటీవల మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.ఎస్.జగన్మోహనరెడ్డి గారిని కలసి మీ యొక్క సంఫీుభావాన్ని వారికి తెలిపి, వారు మరింత ధైర్యంగా ముందుకువెళ్ళే విధంగా మీ యొక్క అండదండలను వారికి తెలియజేసియున్నారు.
మీ యొక్క అండదండలతోటే వారు 2019 ఎన్నికలలో 151 సీట్లతో గెలుపొంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. టి.డి.పి.ని బంగాళాఖాతంలో కలిపేయండి అన్న తమరి పిలుపు మేరకు, అమాయక కాపులు మిమ్మల్ని నమ్మి జగన్ గారిని ముఖ్యమంత్రిగా చేసారు. ఆ సందర్భంలో మీరు మీ సమీప గ్రామంలో వేంకటేశ్వరస్వామివారికి పూజలు కూడా నిర్వహించారు. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా అప్పుడు అంతా బాగానే జరిగింది.
కానీ తరువాత నెమ్మదిగా కథ అడ్డం తిరిగింది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాస్తవాలను మీరు అంగీకరించాలి. మీరు నిజంగా జగన్‌గారి శ్రేయోభిలాషి అయితే వారికి ఇప్పటికైనా వారు చేసిన పాలనా పరమైన పొరపాట్లు ఏమిటో చెప్పండి. మీరు చెప్పలేకపోతే మాకు అవకాశం ఇప్పించండి. మేము చెబుతాం. పాలకుల తప్పులు ఎవ్వరూ చెప్పకపోతే వారు మేము ఏమీ తప్పులు చెయ్యలేదనే భ్రమలోనే ఉంటారు.
వారి భ్రమలు తొలగిపోవాలంటే నిజం నిర్భయంగా చెప్పాలి. చెప్పడం మన ధర్మం. వినడం వినక పోవటమనేది వారి విజ్ఞత. ఎవ్వరూ చెప్పకపోతే వారి తప్పులు వారికి తెలియవు. దయచేసి మీరైనా చెప్పండి.
తమరిని నమ్మి వై.సి.పి.కి ఓట్లు వేసిన కాపులు క్రమేణా మీకు, వై.సి.పి.కి దూరంగా జరిగి పోవడానికి ప్రధానకారణం కాపులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని మీరే బలంగా పోగొట్టేసుకున్నారు. మీరు ఏ స్థాయివరకూ పోగొట్టేసుకున్నారంటే మీ పేరును మీరే మార్చుకునే స్థాయివరకూ మీరే పోగొట్టేసుకున్నారు. కాపులు మీకు క్రమేణా దూరమైపోవడానికి ప్రధానకారణం ‘‘నేను కాపు ఉద్యమం నుండి వైదొలుగుతున్నాను’’ అని మీరు బహిరంగంగా ప్రకటించడమే.
మీరు వై.సి.పి. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకూడదని, ఒక పథకం ప్రకారమే కాపు ఉద్యమం నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారనేది నగ్నసత్యం. అదే అతి పెద్దతప్పు. కాపులు మరీ అంత అమాయకులు కాదుసార్. ఎంత ఎత్తుకు ఎత్తుతారో, అంతే మట్టానికి తొక్కేస్తారు. అదే ప్రస్తుతం జరిగింది. అది ఇప్పటికైనా మీరు గ్రహించి జగన్ గారికి చెప్పండి.
రహస్య స్నేహం, రహస్య అవగాహన రాజకీయాల్లో ఎల్లకాలం మంచిది కాదుసార్. 2019-2024 మధ్యకాలంలో మీరు జగన్ గారితో రహస్య అవగాహనతో కూడిన స్నేహం చేశారు. మీరు ఇప్పుడు కలిసినట్టే 2019లోనే జగన్ గారిని కలిసుండాలి. మాకు టి.డి.పి. న్యాయం చేయలేదు కాబట్టే, మా వాళ్ళంతా మీకు అండగా నిలబడ్డారు. మా కాపుల ప్రయోజనాలను కాపాడండని మీరు నాడు జగన్ గారికి చెప్పివుంటే మీ ఇద్దరికీ నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదు.
కాపుల ప్రయోజనాలను కాపాడమని అడగాల్సి వస్తుందని, మీరు కాపు ఉద్యమం నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించారు. మీరు ఉద్యమం నుండి వైదొలుగు తున్నట్లుగా ప్రకటించినప్పుడు కూడా, మీకు మేము ఒక ఆంతరంగిక లేఖను స్వయంగా ఇవ్వడం జరిగింది. శిలాఫలకంపై మీ పేరును మీరే చెరిపేసుకుంటున్నారు.
మీ నిర్ణయం తప్పు అని బలంగా వ్రాతపూర్వకంగా మీకు మేము తెలియచేశాం. మీ వైఖరిలో మార్పు లేకపోవడంతో బహిరంగ లేఖను కూడా విడుదల చేసాం. తదుపరి శ్రీ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిగారిని మీరు సమర్ధించిన సందర్భంలో కూడా మీ చర్యలను ఖండిస్తూ మరొక బహిరంగ లేఖ కూడా విడుదల చేసాం.
కాపు ఐక్యవేదిక పక్షాన కాపుల యొక్క ప్రయోజనాలను పరిరక్షించడం కోసం మాత్రమే మేము పనిచేస్తున్నాం. మా పోరాటంలో నిజాయితీ వుంది. కానీ మీ పోరాటంలో నిజాయితీ లేదు. కాపుల ప్రయోజనాలను కాపాడడానికి మీరు ఏనాడూ ఉద్యమం చేయలేదు. మీ రాజకీయ కక్షలకోసం కులాన్ని రెచ్చగొట్టి, భావోద్వేగాలను వాడుకొని గాలికొదిలేసారు.
జగన్ గారితో కాపులకు న్యాయం చేయించమని మేము స్వయంగా తమరిని ప్రాధేయపడ్డాం. జగన్ గారు హామీ ఇవ్వలేదుకదా అని మీరు శెలవిచ్చారు. వ్యూహాత్మకంగా జగన్ గారితో కాపు రిజర్వేషన్లు నా పరిధికాదు, నేను చెయ్యలేనని చెప్పించడంలో కూడా మీ పాత్ర ఉందేమోనని మా అనుమానం. ఎందుచేతనంటే ఏనాడూ కూడా మీరు కాపు రిజర్వేషన్ల కోసం మాత్రం ఉద్యమం చేయలేదు. గత 30 సం.ల నుండి తమరిని అతి దగ్గరగా పరిశీలించిన మేరకు ఆ అభిప్రాయానికి మేము రావడం జరిగింది.
కనీసం EWS 10% రిజర్వేషన్లను యధావిధిగా అయినా అమలు చేయించండి అని తమరిని ప్రాధేయపడ్డాం. EWS రిజర్వేషన్ నా ఎజెండా కాదు అని తమరు అన్నారు. కానీ 1994 వ సం॥లో ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయభాస్కరరెడ్డి గారిని కాపులకు రిజర్వేన్లు కల్పిస్తున్నారు. చాలా సంతోషం అని ఘన సన్మానం చేసి, ఇతర ఓ.సి.లకు కూడా ఇ.బి.సి. రిజర్వేషన్లు ఇవ్వమని తమరు సభాముఖంగా కోరారు. కానీ మేము కోరిన సందర్భంలో EWS నా ఎజెండా కాదు అన్నారు.
సమయానుకూలంగా ఉద్యమాన్ని మీ ఇష్టానుసారంగా మార్చుకుంటూ 30 సం॥ల పాటు కాపులనూ, కాపు ఉద్యమాన్నీ మీ ఇంటిచుట్టూ తిప్పుకున్నారు. ముప్పుతిప్పలు పెట్టి 30 చెరువుల నీళ్ళు త్రాగించారు. కానీ ఆ జి.ఓ.30ని అమలు చేయించలేదు.
గౌరవ హైకోర్టు వారు సమర్ధించిన జి.ఓ.30 ని 30 సం॥లుగా ఈ రాష్ట్రంలో పాలకులు అమలు చేయలేదంటే కాపులు అమాయకులు కాక మరేమిటి?
మన జి.ఓ.30లో ఉన్న ముస్లింలను వేరుచేసి కుట్రపూరితంగా ఆనాటి గౌరవ ముఖ్యమంత్రివర్యులు రాజశేఖర్‌రెడ్డి గారు ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేస్తున్నా కూడా మీరు కనీసం స్పందించలేదు. ముస్లిం రిజర్వేషన్లను గౌరవ హైకోర్టువారు రెండు పర్యాయాలు కొట్టేసినా పాలక పక్షాల వారు కాంగ్రెస్, టి.డి.పి., వై.సి.పి. మూడు పార్టీలు కూడా గౌరవ సుప్రీంకోర్టువారి స్టేతో గత 18 సం॥ల నుండి బి.సి.(ఇ) గ్రూపు ద్వారా వారికి 4% రిజర్వేషన్లను నిరాటంకంగా అమలు చేసేస్తున్నారు.
కానీ గౌరవ హైకోర్టువారు సమర్ధించిన మా జి.ఓ.నెం.30 ని ఎందుకు అమలు చేయరు? అని అడిగే గౌరవ కాపు ఎం.ఎల్.ఏ.లు గాని, ఎమ్.ఎల్.సి.లు గాని, ఎం.పి.లు గాని, మంత్రులు గాని మచ్చుకుకూడా లేరు. ఉద్యమం కాపులది, జి.ఓ.30 కాపులది, ఆ జి.ఓ.లో ఉన్న 14 కులాలకు గాను కాపులను మాత్రమే వదిలేసి మిగిలిన అన్ని కులాల వారికి బి.సి. రిజర్వేషన్ ఇచ్చేసినా కాపు ప్రజాప్రతినిధులు కనీసం స్పందించలేదు. కుల ప్రాతిపదికగా సీట్లు కావాలి. మంత్రిపదవులు కావాలి. కానీ కాపు కుల ప్రయోజనాలు ఏ ఒక్కరికీ కూడా పట్టవు.
కనీసం కాపు కౌలు రైతులకు రైతు భరోసా పథకాన్ని కూడా మీరు వై.సి.పి.వారిచేత అమలు చేయించలేకపోయారు. కనీసం ఒక్క జిల్లాకైనా కాపు ప్రముఖుల పేరు గాని, కాపు మహనీయుల పేరు గాని, కాపు స్వాతంత్య్ర సమరయోధుల పేరు గాని పెట్టించలేకపోయారు.
మీరు వై.సి.పి.తో రహస్య అవగాహనతో కూడిన స్నేహం చేయడం దేనికి? ఆనాడే మీరు వై.సి.పి.లో అధికారికంగా చేరిపోయి కాపుల ప్రయోజనాలను కాపాడాలికదా! మీరు కాపాడలేనప్పుడు టి.డి.పి.ని బంగాళాఖాతంలో కలిపేయండి అనడంలో అర్థం ఏముంది?
రాష్ట్రంలో అతి పెద్దకులాన్ని వదిలేసి మీరు రాజకీయంగా ముందుకు వెళ్ళాలనుకోవడం కరెక్టుకాదు. మీరు తప్పుమీద తప్పు అనేక తప్పులు కాపులపట్ల చేస్తున్నారని మేము అనేక లేఖలను వై.సి.పి. వారికి వ్రాశాం. స్వయంగా శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చాం. వై.సి.పి. ప్లీనరీ సమావేశాల ముందు వారితో ఆరోగ్యకరమైన వాడి వేడి చర్చలు జరిపాం. వారితో బాహాటంగా విభేదించాం.
2023 కాపు వనభోజనాల సందర్భంగా ‘‘కాపులు వై.సి.పి.కి ఎందుకు ఓటు వేయాలి?’’ ‘‘కాపులు వై.సి.పి.కి ఎందుకు ఓటు వేయకూడదు?’’ అనే విశ్లేషణతో కూడిన కరపత్రాన్ని కోటిమంది కాపుల ముందు ఉంచాం. అంతరాత్మ ప్రభోదానుసారంగా మీరే నిర్ణయించుకోండి అని వారి అంతరాత్మకే వదిలేసాం. ఆ కరపత్రాలను జగన్ గారితో సహా మంత్రులందరికీ వై.సి.పి. ముఖ్యులందరికీ రిజిష్టర్డ్ పోస్టులలో పంపాం. అయినా ఎవరూ స్పందించలేదు.
కాపులు గమనించరు అని అనుకుంటే అది పెద్దపొరపాటు. కనీసం ఒక్క రాజ్యసభ సీటైనా జగన్ గారు కాపులకు ఇచ్చారా? కనీసం మీకైనా ఇచ్చారా? ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీరు జగన్ గారిని వదిలేసి, చివరలో మునిగిపోయే పడవ ఎక్కారు. కాని కాపులు మాత్రం తమరిని నమ్మి 30 సం॥లుగా మునిగిపోయాం, ఈసారి మునగకూడదని చాలా తెలివిగా, సైలెంటుగా ఇచ్ఛాపురం నుండి తడ వరకూ ఒకే మాటగా ముందుకు వెళ్ళారు.
ఇప్పటికైనా తమరు వాస్తవాలను, మీ తప్పిదాలను, మీ పొరపాట్లను గ్రహించుకోవాలని మనవి చేసుకొనుచున్నాం. జగన్ గారికి చెప్పండి సార్, ‘‘పాలకుడు ఎవరైనా అందరివాడుగా ఉండాలి’’, ‘‘కొందరివాడుగా ఎన్నడూ ఉండకూడదు’’, కొందరికోసం మాత్రమే ఈ ప్రభుత్వం ఉంది అనే సంకేతాన్ని ప్రజలకిస్తే ఇతరులు జరుగుచున్న అన్యాయాన్ని గమనించరా? రాజ్యాంగబద్ధమైన EWS 10% రిజర్వేషన్లను కనీసం యధావిధిగానైనా అమలు చేయకుండా ఉద్దేశ్యపూర్వకంగా 30 వేల మంది నిరుద్యోగుల జీవితాలను బలిచేసేస్తే ఊరుకుంటారా?
మీరు నిజంగా జగన్‌గారి శ్రేయోభిలాషి అయితే ‘‘సామాజిక అన్యాయంతో ఎ.పి.లో అమలు జరుగుచున్న రిజర్వేషన్లు’’ అనే ఎస్.జె.ఎఫ్. వినతిపత్రాన్ని మీరు చదివి వారితో చదివించండి. ఎ.పి.లో ఏ వర్గాలవారికి నిజంగా సామాజిక అన్యాయం జరుగుతోందో వారికి మేము సామాజిక న్యాయం చేస్తాం, గతంలో చేసిన పొరపాట్లు మరల చేయమని వారితో ప్రకటన ఇప్పించండి. ఎస్.జె.ఎఫ్. సామాజిక న్యాయ పోరాటానికి జగన్ గారితో మద్దతు ఇప్పించి, వారు చేసిన పొరపాట్లను సరిదిద్దుకోమని చెప్పండి.
బ్రిటన్ ప్రధానిగారే వారి పార్టీ ఓటమిని బాహాటంగా అంగీకరించి ప్రజలను క్షమాపణలు కోరారు. ప్రజా జీవితంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటాం అని చెప్పడం కనీస ధర్మం. అంతేగాని ప్రజలే తప్పు చేశారని నిందించడం ఎంత మాత్రం సమంజసం కాదు. కొన్ని పొరపాట్లు చేసామని తెలంగాణ కె.టి.ఆర్. గారు ఒప్పుకోవడాన్ని జగన్ గారు స్ఫూర్తిగా తీసుకోవాలని మీరు సూచించండి.
పాలకులు ప్రజల నుండి, ప్రజా సంఘాల నుండి వచ్చే వినతి పత్రాలను, కరపత్రాలను, మెయిల్స్‌ను, రిజిష్టర్ పోస్టులను, వాట్సాప్‌లను గమనించుకోవాలి. అధికారానికి భయపడి చెక్కభజన చేసేవారి మాటలు నమ్మితే ఫలితాలు ఈవిధంగానే తల్లక్రిందులైపోతాయని వారికి తమరు చెప్పాలని మనవి.
కాపుల ప్రయోజనాలను కాపాడే విధంగా వై.సి.పి. మేనిఫెస్టోలో కాపులకు సంబంధించిన అంశాలు పొందుపరచమని కోరడం కోసం, చివరి వరకూ మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం.
అధికార పక్షం వారు మేనిఫెస్టోలో పెడితే ప్రతిపక్ష కూటమివారు కూడా పెడతారు కదా, తద్వారా మన ప్రయోజనాలు పరిరక్షింపబడతాయి కదా అనే ఆశతో చాలా ప్రయత్నాలు చేసాం. కానీ వై.సి.పి.వారు ఏమాత్రం స్పందించలేదు. మేనిఫెస్టో విడుదలచేసే రెండు రోజుల ముందు కూడా సజ్జల రామకృష్ణారెడ్డిగారిని, మిధునరెడ్డిగారిని, వై.వి. సుబ్బారెడ్డిగారిని కలిసాను. అనేక వినతి పత్రాలు సమర్పించాం. కానీ ఏమాత్రం స్పందించలేదు.
రాష్ట్ర వ్యాప్తంగా వై.సి.పి.కి చాలా బలమైన వ్యతిరేకత ఉంది, రాష్ట్రంలో బలమైన కాపు కులాన్ని వదిలేసి మీరు ముందుకు వెళుతున్నారు, ఎన్నికల ఫలితాలు వచ్చాక మరలా తప్పక కలుస్తామని చెప్పి మరీ వచ్చేసాం. కాపులను వై.సి.పి.వారు కరివేపాకు మాదిరిగా తీసిపారేసారు. తత్ఫలితాన్ని చవిచూసారు. అప్పుడు వినకపోతే వినకపోయారు. కనీసం ఇప్పుడైనా వినమనండి. రాజకీయ పొరపాట్లపై ఎవరికైనా సరే సమీక్ష అవసరమని చెప్పండి.
రాజకీయాల్లో ఎవరిమాటా మేము వినం. మా మాటే అందరూ వినాలి అనే ధోరణికి కాలం చెల్లిందని ఇప్పటికైనా వై.సి.పి. వారు, మీరు కూడా గమనించాలని మనవిచేసుకొనుచూ . . . ఇకనుండైనా తమరు ఇప్పటికీ మిమ్మల్ని అభిమానించే వారి హృదయాలను గాయపరచకుండా సరియైన మార్గంలో ముందుకువెళ్ళాలని, మీ కుటుంబ సభ్యులనూ, ఇంకనూ మిగిలిన మీ అనుచరులనూ సరియైన మార్గంలో ముందుకు నడిపించి మీ పూర్వపు కీర్తిని తిరిగి పొందాలని, పొందుతారని ఆశిస్తూ . . .
ఇప్పటికీ తమరిని అభిమానించే మీ కాపు ఐక్యవేదిక.
రావి శ్రీనివాస్
రాష్ట్ర ఛైర్మన్
సెల్: 9949249170
కోటిపల్లి అయ్యప్ప
రాష్ట్ర వర్కింగ్ ఛైర్మన్
సెల్ : 7989133228
పెద్దిరెడ్డి మహేష్
రాష్ట్ర కన్వీనర్
సెల్ : 9949039777
బోడపాటి పెదబాబు
రాష్ట్ర కన్వీనర్
సెల్ : 9494122866
పంచాది రంగారావు
రాష్ట్ర కన్వీనర్
సెల్ : 7036537388
నల్లజర్ల వెంకట రామారావు
రాష్ట్ర కో-కన్వీనర్
సెల్ : 9912509421
కాకిలేటి హరనాథ్
రాష్ట్ర కో-కన్వీనర్
సెల్ : 934672137