శరవేగంగా అమరావతి పనులు

పెద్ద మొత్తంలో కేంద్రం నిధులు
తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు 
ఎమ్మెల్యే గద్దె రామమోహన్

విజయవాడ, మహానాడు:  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని శాసనసభ్యులు గద్దె రామమోహన్ అన్నారు. శనివారం ఉదయం 4వ డివిజన్ ఫిల్మ్ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావుతో కలిసి పర్యటించారు. స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్మ్ కాలనీ మెయిన్ రోడ్డు, 1, 2 క్రాస్ రోడ్ల నిర్మాణానికి రూ. 19.99 లక్షలతో శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులు ఏమీ లేవని, అవన్నీ వైకాపా చేసే తప్పుడు ప్రచారాలన్నారు. కేంద్రంలో కూడా నరేంద్రమోడీ సహకారంతో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. సుమారు లక్ష కోట్ల రూపాయలు ఎటువంటి వడ్డీలేని నిధులు రాష్ట్ర ఖజానాకు రాబోతున్నాయని ఈ నిధులతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారన్నారు.

పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం చంద్రబాబు ప్రభుత్వంలో త్వరితగతిన పూర్తవుతాయన్నారు. 2014-19 సంవత్సరంలో నిధులు లేకపోయినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారన్నారు. అందువల్లే 2014-19 కాలంలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.

ఆత్మీయ సమావేశం

ఫిల్మ్ కాలనీలో స్థానికులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ ఎన్నడూ జరగని విధంగా 2024 ఎన్నికలు జరిగాయని, కూటమి అభ్యర్ధులను ప్రజలు అత్యధిక మెజార్టీలతో గెలిపించారన్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా తీర్పు ఇచ్చారన్నారు. తనకు అత్యధిక మోజార్టీ ఇచ్చినందుకు స్థానిక ప్రజలకు గద్దె రామమోహన్ కృతజ్ఞతలు తెలిపారు.

కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో వైకాపా నాయకులు ఈ ప్రాంతంలోని ఓటర్లను పక్క డివిజన్ కు మార్చి గందరగోళం సృష్టించారన్నారు. దీనిపై తాము అధికారులను పలుమార్లు కోరినా అధికార పార్టీ ఒత్తిడిలకు తలొగ్గారన్నారు. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. డివిజన్లో ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చొరవతో త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ ఎస్.వెంకటేశ్వరెడ్డి, నర్రా శ్రీనివాసరావు, సాయిరామ్, చెన్నుపాటి ప్రసాద్, బత్తిన కిషోర్, గద్దె రమేష్ తదితరులు పాల్గొన్నారు.