కళ్లు చెదిరే భవనాలు.. ముద్దొచ్చే రోడ్లు
అమెరికా.. దుబాయ్.. అన్నీ అమరావతిలోనే
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఊహలకు రెక్కలు వస్తే ఎలా ఉంటుంది? అందమైన కల నిజమైతే ఎంత బాగుంటుంది? జరగదనుకున్నది కళ్లెదుటే ఆవిష్కృతమైతే ఎంత అద్భుతంగా ఉంటుంది? అసలు అసాధ్యమనుకున్నది సుసాధ్యమైతే మనసెంత ఉల్లాసంగా ఉంటుంది? ప్రపంచంలోని అన్ని అద్భుతాలన్నీ మన పక్కనే.. మన ఎదుటే.. మన ముందే ప్రత్యక్షమైతే ఎంత ఆనందంగా ఉంటుంది? మన ఊహలకు రెక్కలు కాదు. విమానాలే వస్తే ఎలా ఎంటుంది? ఎలా ఉంటుందంటే… అమరావతిలో ఆకాశంతో పోటీ పడే అద్భుత నిర్మాణాలు సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీలా ఉంటుంది.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ.. ఇప్పుడు ప్రపంచంలో కొత్త ట్రెండ్. ఒక స్వప్నం భ్రమగా మారి.. అదే కాసేపు వాస్తవమై కళ్లెదుట సాక్షాత్కరించే సాంకేతిక వైచిత్రి. మన ఊహకు ప్రాణం పోస్తున్న సాంకేతిక అస్త్రం. ఇది మీడియా రంగంలోనూ కాలుపెట్టింది.
ఒక అందమైన యాంకర్ విభిన్న దుస్తులు, విభిన్న మేకప్‌తో న్యూస్‌రూంలో కూర్చుని ఎంచక్కా వార్తలు చదువుతుంది. మామూలుగా చూస్తే ఎవరో యాంకరమ్మ అప్పుడే మేకప్‌రూంలోకి వెళ్లి వచ్చినట్లే కనిపిస్తుంటుంది. చదువుకున్న వాళ్లకు తప్ప.. అది కృత్రిమ యాంకర్ అనే నిజం తెలియదు. అంతగా మోసం చేస్తుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజన్సీ ఆర్ట్.
ఇది ఇప్పుడు అమరావతి ఊహాప్రపంచంలోకి వచ్చేసింది. భవిష్యత్తు అమరావతి ముఖచిత్రాన్ని ఇది ముందస్తుగా ఆవిష్కరించింది. అంటే కొన్నేళ్ల తర్వాత అమరావతి రాజధాని నగరం ఎలా ఉండబోతోంది? అన్న ఊహా చిత్రానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజన్సీ ప్రాణప్రతిష్ఠ చేసింది. ఈ ఊహా చిత్రాలు ఇప్పుడు సోషల్‌మీడియాలో అందరినీ ఆకర్షిస్తున్నాయి.
అమరావతిలో రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందన్న ఊహకు అద్భుతమైన చిత్రం ఆవిష్కరించింది. అది అచ్చం ఢిల్లీ ఎర్రకోట మాదిరిగానే కనిపించింది. 2047 నాటికి భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు నిండనున్న సందర్భంగా.. అప్పటికి అమరావతి రోడ్లు ఎలా ఉంటాయన్న ఊహాచిత్రం, అమెరికా-దుబాయ్ రోడ్లను తలపించింది.
అప్పటికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఏపీ, ఎలా ఉంటుందోనన్న ఊహాచిత్రం ఒకటి అద్భుతంగా ఆవిష్కరించింది. ఇక విజయవాడ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని, అద్భుతమైన ఆలయాలు కూడా దర్శనమిస్తాయంటూ ఒక ఊహాచిత్రం విడుదల చేసింది. అందుకే.. ఊహల్లో కూడా దరిద్రం ఎందుకన్నాడు ఓ కవి.