తిరునాళ్ల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జీవీ
వినుకొండ, మహానాడు: ఈనెల 17వ తేదీన వినుకొండ కొండపై వేంచేసిన శ్రీ రామలింగేశ్వర స్వామి తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చిన్న కొండపై జరుగుతున్న పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినుకొండ మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి, డి వెంకయ్య ఆధ్వర్యంలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. కొండ మెట్ల వద్ద వేంచేసియున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాల వద్ద నుండి మెట్ల మార్గంలో చిన్న కొండ వరకు భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని, త్రాగునీరు, అన్న ప్రసాదాలు, మజ్జిగ తదితర స్టాల్స్ ఏర్పాటుకు స్థలాలు కేటాయించాల్సిందిగా ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణంలో ఉండటం వలన, ఉత్సవ విగ్రహాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఘాట్ రోడ్డులో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, ఆర్టీసీ వారు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తిరునాళ్ల మహోత్సవాన్ని వినుకొండ పట్టణంలో వైభవంగా జరిపేందుకు వివిధ శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
కుల మతాలకతీతంగా జరిగే తొలి ఏకాదశి కొండ పండుగను ప్రజలందరూ కలిసి విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు, టిడిపి నాయకులు పీవీ సురేష్ బాబు, ఆయుబ్ ఖాన్ తదితరులు ఉన్నారు.