– ఆఫ్రాన్ నిర్మాణం, రక్షణ గోడ, ఆలయ మరమ్మతులపై చర్చ
– సోమేశ్వరాలయ స్వామిని దర్శించుకున్న నేతలు
నెల్లూరు, మహానాడు: నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారు.. నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం మండలంలో ఉన్న సోమశిల జలాశయాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్, కావ్య కృష్ణారెడ్డి, నెలవల విజయశ్రీ, కాకర్ల సురేష్, కురుగొండ్ల రామకృష్ణ, ఇంటూరి నాగేశ్వరరావు కలెక్టర్ ఓ.ఆనంద్ తో కలసి ఆదివారం సందర్శించారు.
సోమశిలలో ఉన్న స్థానిక ఆర్అండ్‌బీ అతిధి గృహానికి చేరుకున్న అనంతరం ఆనం సంజీవ రెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం సోమశిల డ్యాం ముందు ఆఫ్రాన్ నిర్మాణం, రక్షణ గోడ, నిర్మాణ పనులు, మరమ్మతులు తదితర ముఖ్య అంశాలను వారు స్వయంగా పరిశీలించి సుదీర్ఘంగా చర్చించారు. సోమశిల జలాశయంలోని అఫ్రాన్, రక్షణ గోడ, నిర్మాణ పనులను, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు.
స్థానికంగా పెండింగ్ పనులను మంత్రులకు అధికారులు వివరించారు. అనంతరం స్థానికంగా ఉన్న సోమేశ్వరాలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలకి ఆలయ అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత వరదల కారణంగా దెబ్బతిన్న ఆలయ ప్రాంతాన్ని పరిశీలించి, పునః నిర్మాణానికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. అనంతరం అక్కడి నుంచి కండలేరు జలాశయం పరిశీలనకు బయలుదేరారు.