రూ. 2 కోట్ల వాచీ గిఫ్ట్‌గా ఇచ్చిన అనంత్ అంబానీ
షారూఖ్, రణ్వీర్ తదితరులకు గిఫ్ట్‌గా ఇచ్చిన అనంత్ అంబానీ
లగ్జరీ వాచీలకు పేరెన్నికగన్న అడమోర్స్ పిగ్యుట్
వాచీలతో ఫొటోలు,
వీడియోలకు పోజులు
(శివ శంకర్ చలువాది)
గొప్పోళ్ల లగ్గాలు గొప్పగనే ఉంటాయి. వారికి ఇచ్చే గిఫ్టులు.. వారు ఇచ్చే రిటర్ను గిఫ్టులూ గొప్పగానే ఉంటాయి. ఎంత గొప్పగా అంటే.. 2 కోట్ల విలువైన వాచీలు రిటర్ను గిఫ్టులు ఇచ్చేంత గొప్పగా! అంబానీ వారింట జరిగిన లగ్గంలో అదే జరిగింది. ఇక చదవండి.
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం ఈ నెల 12 ఘనంగా జరిగింది. గతేడాది డిసెంబర్లో ఎంగేజ్మెంట్ తర్వాత దాదాపు ఏడు నెలలపాటు అంబానీ ఇంట వేడుకలు జరిగాయి. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్‌లో వివాహంతో అనంత్-రాధిక ఒక్కటయ్యారు.
ఆశీర్వాద వేడుకకు భారత ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, టీమిండియా క్రికెటర్లు సహా ప్రపంచం నలుమూలల నుంచి వేలాదిమంది అతిథులు హాజరయ్యారు.
తాజాగా ఇప్పుడు ఈ వేడుకకు సంబంధించిన మరో వార్త వైరల్ అవుతోంది. తనకు స్నేహితులైన బాలీవుడ్ నటులు షారూఖ్‌ఖాన్, రణవీర్‌సింగ్, షికర్ పహారియా, వీర్ పహారియా, మీజాన్ జాఫరి తదితరులకు వరుడు అనంత్ అంబానీ ఒక్కొక్కరికీ రూ. 2 కోట్ల విలువైన రిస్ట్ వాచ్‌లు గిఫ్ట్‌గా ఇచ్చారట. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లగ్జరీ వాచీలకు పేరెన్నికగన్న అడమోర్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ క్యాలెండర్ లిమిటెడ్ ఎడిషన్ వాచీలను వీరు బహుమతిగా అందుకున్నారు. అనంతరం అందరూ కలిసి చేతికి ధరించిన వాచీలు చూపిస్తూ ఫొటోలు, వీడియోలకు పోజిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.