-రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్
-గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగించాలి
-కలెక్టర్ కు విన్నవించిన రైతు సంఘం నాయకులు
గుంటూరు, మహానాడు: ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయేగాని అమల్లోకి రావడం లేదని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రాంతం వరకు గుంటూరు ఛానల్ ను పొడిగించాలని రైతు సంఘాల ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయేగాని అమల్లోకి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు, 50 వేల ఎకరాలకు సాగునీరు, 50 గ్రామాలకు త్రాగునీరు లభించే ఈ కీలకమైన ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదన్నారు.
గత ఏడాది ఈ ప్రాంతంలో ప్రజలకు సాగు, తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. రైతులు సకాలంలో నీరు అందక సాగు చేసే పరిస్థితులు తగ్గిపోతున్నాయన్నారు. 2018లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఛానల్ పొడిగింపునకు జీవో జారీ చేసిందని, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వివిధ సందర్భాల్లో పొడిగిస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదన్నారు.
ఇప్పటికైనా తెదేపా ప్రభుత్వం రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఛానల్ పొడిగింపునకు నిధులు కేటాయించి త్వరితగతన పనులు పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొత్త వెంకట శివరావు, నాయకులు జంపని రామారావు, పోపూరి సుధీర్, నల్లమోతు రాజేంద్ర, ఇంటూరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.