పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు.
నరసరావుపేట, మహానాడు: తొలి ఏకాదశి సందర్భంగా కోటప్పకొండకు వేలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబులు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని ఎస్.ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ లో కోటప్పకొండలో తొలి ఏకాదశి వేడుకల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు మాట్లాడుతూ ఏకాదశి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తుల కోసం ప్రదక్షిణ మార్గం చదును చేయాలన్నారు. అలానే మార్గం ఆద్యంతం మంచినీరు అందుబాటులో ఉంచాలన్నారు. వన్య మృగాల నుంచి భక్తులకు, ఆకతాయిల నుండి వన్య మృగాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అదేవిధంగా కొండ పైనా, కిందా అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని, అవసరమైన చోట మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.
ముఖ్యంగా పాము కాటు మందులు మెడికల్ క్యాంపులు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ట్రాఫిక్ నిర్వహణ చేపట్టాలని, ట్రాక్టర్లు, ఆటోలలో పరిమితికి లోబడి ప్రయాణీకులను మాత్రమే కొండ మీదకి అనుమతించాలన్నారు అదేవిధంగా వేడుకల నిర్వహణలో భాగస్వాములయ్యే అధికారులకు, భక్తులకు భోజన వసతి ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక వ్యాపారస్తులతో మాట్లాడి పూజా సామాగ్రి ధరలు అదుపులో ఉండేలా చూడాలన్నారు. భక్తుల అవసరాన్ని బట్టి బస్సులు నడపాలని, బస్సులు నడిచే వేళలపై ప్రచారం కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. అదే రోజున మొహర్రం వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఎక్కడా మతసామరస్యం దెబ్బతినకుండా పోలీసు శాఖ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ ఆలయ ప్రసాదంలో నాణ్యత పాటించాలని, భక్తులకు వీలైనంత త్వరగా, ప్రశాంత వాతావరణంలో త్రికోటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి రామచంద్ర రావు, ఆర్డీవో శ్రీదేవి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి విజయ భాస్కర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ సురేష్, పంచాయతీ రాజ్ ఎస్.ఈ సుబ్బారాయుడు, డీఎంహెచ్ఓ రవిబాబు, తహశీల్దార్ హరిబాబు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.