-ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
-డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
వినుకొండ, మహానాడు: వినుకొండ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, దీనిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని 32వ వార్డు విష్ణుకుండి నగర్లో డ్రైనేజీ నిర్మాణం పనులకు మంగళవారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 32వ వార్డు ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు వార్డ్ కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక వార్డు ప్రజలు పడుతున్న అవస్థలపై కౌన్సిల్లో చర్చించి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో కౌన్సిలర్ లింగమూర్తి చూపిన చొరవను ఆయన కొనియాడారు.
పట్టణంలోని ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, మునిసిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, కమిషనర్ తోట కృష్ణవేణి, డీఈ వెంకయ్య, టీడీపీ నాయకులు పీవీ సురేష్ బాబు, ఆయుబ్ ఖాన్, విష్ణు కుండి నగర్ పార్టీ అధ్యక్షులు చిరుమామిళ్ల కోటేశ్వరరావు, 32వ వార్డు ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.