దిక్కుమాలిన, దోపిడీకోరు పాలన వైకాపా పాలన

-1.75 లక్షల ఎకరాలకుపైగా భూ ఆక్రమణలు: ఎమ్మెల్యే జీవీ  

వినుకొండ, మహానాడు: అయిదేళ్లు ఏకంగా 1.75 లక్షల ఎకరాలకు పైగా భూములు ఆక్రమించుకున్న దిక్కుమా లిన, దోపిడీకోరు పాలన సాగించిన ఘనత వైకాపా ప్రభుత్వానికే చెల్లుతుందని ధ్వజమెత్తారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. పట్టపగ్గాలు లేకుండా సాగిన వారి అవినీతి, అక్రమాలు ఆధారాలతో బయటపెట్టేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారని, వాటితోనైనా వైకాపా అనకొండలు, మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిజస్వరూపం ప్రజలకు తెలుస్తోందని ఎద్దేవా చేశారు.

కూటమి ప్రభుత్వం వరసగా విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు, ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోన్న వైకాపా ప్రభుత్వం దారుణాలపై పత్రికా ప్రకటన విడుదల చేశారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకున్న పేదలకు సెంటు ఇళ్ల స్థలాల పేరిటే 10 వేల ఎకరాల వరకు ఆక్రమాలు జరిగాయంటే వైకాపా పాలన ఎలా సాగిందో అర్థం చేసుకోవ్చని మండిపడ్డారు. అందుకే వైకాపా నేతలు ఎవరెవరు ఎక్కడెక్కడ, ఎంతెంత దోచుకున్నారో శ్వేతపత్రాల ద్వారా బయట పెడుతున్నామన్నారు.

అయిదేళ్లలో వైకాపా నేతలు సాగించిన లక్షా 75 వేల ఎకరాల భూ ఆక్రమణల విలువ రూ. 35,576 కోట్లు పైమాటేనని తెలిపారు. అలా అడ్డదారుల్లో దోచుకుని, సొంతం చేసుకోవాలని అనుకున్న భూ దోపిడీకి ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దుతో అడ్డుకట్ట పడినట్లయిందని ప్రజలంతా ఊపిరి పీల్చుకుంటున్నారని, ఆ సాహసోపేత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారన్నారు. భూములన్నీ కొట్టేయాలనే దుర్బుద్ధితోనే దేశంలో ఏ రాష్ట్రంలో చేయని నిరంకుశ చట్టాన్ని రాష్ట్రం నెత్తిన రుద్దాలని చూసిన నియంత జగన్ అని  ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇసుకదందాల రూపంలో వైకాపా నేతలు రూ. 9,750 కోట్లు దోచుకున్నారని, ప్యాలెస్‌లు, విలాసాలు, సలహాదారుల పేరిట వేల కోట్లు ప్రజాధనం ఖర్చు చేశారనీ మండిపడ్డారు. వైకాపా నిర్వాకాలన్నింటి నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ఆలోచించి తీసుకునిరానున్న యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టంతో కబ్జాకోరుల గుండెల్లో రైళ్లు పరిగెట్టడం ఖాయమని, భూ యాజమాన్య హక్కులను నిరూపించుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుందన్నారు. త్వరలో రానున్న మిగిలిన శ్వేతపత్రాల్లో వైకాపా నేతల పూర్తి స్వాహా పర్వాలను ఆధారాలతో సహా ప్రజల ముందు పెడతామని, జరిగిన అక్రమాలపై చట్టం తన పని తాను చేసుకుని పోతుందని అయన అన్నారు.