ప్రజాప్రతినిధుల సమన్వయంతో నగర అభివృద్ధి 

అధికారులతో సమీక్షా సమావేశంలో నగర కమిషనర్ 

గుంటూరు, మహానాడు:  గుంటూరు నగరంలో ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులు చేపట్టాలని, ప్రజా ప్రతినిధులు క్షేత్ర స్థాయి పర్యటనల్లో సంబంధిత అధికారులు కూడా పాల్గొని, పర్యటనలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గుంటూరు తూర్పు ఎంఎల్ఏ మహ్మద్ నసీర్ తో కలిసి, నియోజకవర్గంలో జరుగుతున్న, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మెరుగైన పారిశుద్ధ్యం కోసం చేపట్టాల్సిన చర్యలపై ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ, వారు గుర్తించిన అభివృద్ధి పనుల్లో ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ గా విభజన చేసుకొని, నాన్ ఫైనాన్షియల్ లేదా తక్కువ మొత్తంలో ఖర్చు అయ్యే ప్యాచ్ వర్క్స్, త్రాగునీటి సరఫరా సమస్యలు, కల్వర్ట్స్ నిర్మాణం వంటి వాటిని రోజుల వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. ప్రధానంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులు, ప్రస్తుతం చేపట్టాల్సిన పనులపై ప్రజా ప్రతినిధులకు వివరించాలన్నారు.

నగరంలోని ప్రతి రిజర్వాయర్ పరిధిలో ఎన్ని ట్యాప్ కనెక్షన్ లు, వాటిలో కమర్షియల్, డొమెస్టిక్ కనెక్షన్ల వివరాలు, రిజర్వాయర్ నుండి ప్రైవేట్ ట్యాంకర్లకు ఇస్తున్న నీటి వివరాలను వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఎస్.ఈ.ని ఆదేశించారు. డ్రైన్ల వెంబడి, క్రాస్ చేస్తున్న తాగునీటి పైప్ లైన్లు గుర్తిస్తే వాటిని యుద్ధప్రాతిపదికన షిఫ్ట్ చేయాలన్నారు. ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, లేకుంటే వ్యర్ధాలు రోడ్ల మీద కాల్వల్లో వేస్తారన్నారు. ప్రతి రోజు చెత్త సేకరణ సమయం కూడా ఆయా ప్రాంత ప్రజలకు తెలియచేయాలన్నారు.

ప్రజలకు అవగాహన కల్పించండి: ఎమ్మెల్యే

ఎంఎల్ఏ నసీర్ మాట్లాడుతూ తమ క్షేత్ర స్థాయి పర్యటనల్లో ప్రజల స్థానిక సమస్యలు పరిష్కరించడానికి ప్రతిపాదించిన పనులను వెనువెంటనే చేపట్టాలన్నారు. వాటిలో తక్షణం చేయలేని పనులు ఉంటే వాటిని వివరాలతో తెలియజేయాలన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లేకుంటే పనులు చేసినా ప్రజల నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. తూర్పు నియోజకవర్గంలో తాగునీటి సరఫరా వ్యవస్థ పై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ప్రతి కాలనీకి త్రాగునీరు అందించడానికి కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలోని జిఎంసి ఖాళీ స్థలాలను గుర్తించి, వాటిలో పార్క్ లు అభివృద్ధి చేయడానికి, ఇప్పటికే ఉన్న పార్కుల్లో మౌలిక వసతుల కల్పనకు  చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పారిశుధ్య పనుల్లో మెరుగుదల ఉండాలని, రోడ్ల మీద వ్యర్ధాలు ఉంటే అధికారులు ఎంత పని చేసిన ప్రజల దృష్టిలో సదాభిప్రాయం కలుగదన్నారు. ప్రజలు రోడ్ల మీద వ్యర్థాలు వేయకుండా వారికి అవగాహన కల్గించడంతో పాటు, డంపర్ బిన్ల వద్ద చెత్త నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

సమావేశంలో ఎస్ఈ శ్యాం ప్రసాద్, ఏంహెచ్ఓ మధుసూదన్, ఏడీహెచ్ రామారావు, ఈఈలు కోటేశ్వరరావు, కొండారెడ్డి, డిఈఈలు రాము, శ్రీధర్, ఎస్ఎస్ లు రాంబాబు, ఆయుబ్ ఖాన్, ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.