– జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి
తాడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ
గుంటూరు, మహానాడు: వైద్య చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు అన్ని విధాలా అవసరమైన వైద్య సేవలు అందించి వారి ఆరోగ్య పరిరక్షణకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ వైద్యాధికారులకు సూచించారు. గురువారం తాడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖార్ జైన్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలోని జనరల్ వార్డు, లేబర్ వార్డు , ల్యాబ్ పరీక్షలు నిర్వహించే గదులను పరిశీలించారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ కు సంబంధించిన అన్ని రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. వ్యాక్సిన్ రూమ్ లో ఐఎల్ ఆర్ డీప్ ఫ్రీజర్ ను పరిశీలించారు. అన్ని విభాగాలకు సంబంధించిన వివరాలతో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను నిర్వహించేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో ఆరోగ్య పరీక్షలు అన్ని కూడా రోగులకు ఉచితంగా అందించాలన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రోగులకు బయట పరీక్షలు చేయించరాదని హెచ్చరించారు.
శిశు మరణాలకు తావివ్వొద్దు
పీహెచ్ సీ పరిధిలో గల గర్భిణీలను గుర్తించి వంద శాతం నమోదు చేయాలన్నారు. వారికి ఐరన్ బిళ్ళలు , కాల్షియం బిళ్ళలు అందించి వాటిని వారు తప్పకుండా తీసుకునేటట్లు పర్యవేక్షించాలన్నారు. గర్భిణీ లకు సంబంధించిన హైరిస్క్ కేసులను ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి సజావుగా కాన్పులు జరిగేటట్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మెటర్నల్ డెత్స్ జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో గుర్తించిన 54 మంది గర్భిణీలలో 26 మంది హై రిస్క్ కేసులు ఉన్నాయని డాక్టర్లు తెలిపినందున ఎప్పటికప్పుడు వారిని ప్రత్యేకంగా పరీక్షిస్తూ వారి సుఖ ప్రసవానికి అవసరమైన అన్ని చర్యలు పకడ్బంధీగా చేపట్టాలన్నారు.
ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు తప్పనిసరి
ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని పకడ్బంధీగా చేపట్టాలన్నారు. ఎన్ సి డి లో గుర్తించిన రక్తపోటు, మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతి నెల మందులు తీసుకునేలా పర్యవేక్షించాలన్నారు. ప్రత్యేక ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు నందు ఓ పి కు వచ్చిన వారిని ల్యాబ్ లో చేసిన పరీక్షలను ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు , కాన్పులు ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఎక్కువగా చేపట్టాలని సూచించారు.
బయో మెడికల్ వేస్టేజీ ఎంఓయు ప్రకారం తీసుకువెళుతున్నారా లేదా అని ఆరా తీసి వాటి రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పనికి రానటువంటి మిగిలి పోయిన ఏదైనా వేస్టేజ్ ఎక్కువగా వుంటే మండల్ కండామినేషన్ కమిటీ తీర్మానం ద్వారా వేలం వేసి అమ్మకం ద్వారా వచ్చిన నగదును హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఫండ్ కు జమ చేయాలని సూచించారు.
ప్రైమరీ హెల్త్ సెంటర్ కు చికిత్స నిమిత్తం వచ్చిన రోగులతో ఇక్కడ అందుతున్న వైద్య సేవలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. రాత్రి పూట తప్పనిసరిగా నర్స్, హెడ్ నర్స్ ఆరోగ్య కేంద్రంలో తప్పక అందుబాటులో ఉండాలని తెలుపుతూ అవసరమైన పక్షంలో మెడికల్ డాక్టర్ కు వాకబు చేసి వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎన్ సి డి ప్రాజెక్ట్ అధికారి డా. శ్రావణ్ బాబు , ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ అధికారులు డా. అనుషా , డా.శాంతి , తాడేపల్లి మండల తహశీల్దార్, టి.విజయ్ కుమార్ , డిప్యూటీ తహశీల్దార్ సతీష్ తదితర అధికారులు పాల్గొన్నారు.