వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిన హత్య

పులివెందుల సంస్కృతిని తీసుకొచ్చిన జగన్ 
– మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎండీ  ఫరూక్ 

వినుకొండ, మహానాడు:  వినుకొండ పట్టణంలో ఇరు వ్యక్తుల వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిన హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎండీ ఫరూక్  అన్నారు. గురువారం వినకొండకు వచ్చిన ఆయన స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వినుకొండకు చెందిన షేక్ రషీద్, జిలానీలు ఇద్దరూ వైసీపీ వారేనని, గతంలో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణల పట్ల గత వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం, ఒక వర్గాన్ని ప్రోత్సహించడం వల్ల ఇటువంటి ఘటన జరిగిందన్నారు.

చిలకలూరిపేట, కర్నూలు, మాచర్ల తదితర ప్రాంతాల్లో కూడా ఇలాంటి దాడులు  జరిగాయి.  నియంత్రణ లేకపోవడం వలన అనేక మంది నష్టపోయారన్నారు. ఇప్పటికీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా మారలేదని, గత వైసీపీ పాలకులతో అంటకాగిన వారే ఉండటం వలన ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. వినుకొండలో రషీద్ హత్య కేవలం గత పాలకులే కారణమని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మైనారిటీలను ఆర్థికంగా ఆదుకోకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు.

ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 70 శాతం ల్యాండ్ మాఫియా సాగిందని దుయ్యబట్టారు. గురువారం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వినుకొండకు ఎందుకు  వస్తున్నారు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పులివెందుల సంస్కృతి తీసుకువచ్చారని, ఇలాంటి సంఘటనలకు జగన్ రెడ్డి కారణమన్నారు. ఏ దేశోద్ధారకుడు చనిపోతే జగన్మోహన్ రెడ్డి  పరామర్శకు వస్తున్నాడో ప్రజలకు అర్థమవుతుందన్నారు. సమావేశంలో న్యాయవాది నలబోతు రామ కోటేశ్వరరావు, షేక్ జానీ, సుభాని, పీవీ సురేష్ బాబు, చికెన్ బాబు తదితరులు పాల్గొన్నారు.