– బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్
బీజెవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ మహాధర్నా
హైదరాబాద్, మహానాడు: నిరుద్యోగుల భవిష్యత్తును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్ అన్నారు. ఇందిరా పార్క్ వద్ద బీజెవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ మహాధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా మహేందర్ మాట్లాడుతూ…
నిరుద్యోగుల పక్షాన బీజేపీ పోరాటాలు చేస్తోంది. బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాన్ని నీరుగార్చేలా కార్యకర్తలను, నిరుద్యోగులను ప్రభుత్వం అరెస్టు చేసింది. నిరుద్యోగులకు న్యాయం చేయమని కోరితే లాఠీలతో కొట్టించారు. నిరుద్యోగులు ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఘోరీ కడతారన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నిరుద్యోగుల తరఫున ఉద్యమాన్ని ఆపలేరు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్నారు.
బీజేఎల్పీ నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..
రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన బీజేవైఎం చేస్తున్న పోరాటం అభినందనీయం. తెలంగాణ రాష్ట్రంలో అరాచక, అవినీతి పాలనకు వ్యతిరేకంగా బీజేవైఎం ఆధ్వర్యంలో పోరాటం చేస్తోంది. మన నీళ్లు, నిధులు, ఉద్యోగాలు మనకు వస్తాయని యువత తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి పోరాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో యువతను పూర్తిగా విస్మరించి, తీవ్ర అన్యాయం చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో యువతకు మరింత అన్యాయం చేస్తున్నారు. యువత డిక్లరేషన్ పేరుతో 2 లక్షల ఉద్యోగాల కల్పన, రూ. 4 వేల చొప్పున నిరుద్యోగ భృతి, స్వయం ఉపాధి కోసం రూ. 10 లక్షల ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మాట మార్చి అన్యాయం చేసింది. డిమాండ్ల సాధన కోసం నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై లాఠీచార్జ్ లతో, కేసులు, నిర్బంధాలతో అణచివేస్తున్నారన్నారు.
నిరుద్యోగులకు అండగా బీజేపీ నిలుస్తుంది. నిరుద్యోగ యువతకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడుతాం. రేవంత్ బాబా 11 దొంగలుగా మంత్రులు ఎక్కడికక్కడ కౌంటర్లు ఏర్పాటు చేసుకుని పాలన నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.