ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసేందుకు…జగన్ రెడ్డి కుట్ర

– అభివృద్ధి, సంక్షేమం దిశగా చంద్రబాబు అడుగులు
– పరిశ్రమలు, పెట్టుబడుల కోసం పరితపిస్తున్న బాబు
– శాంతి భద్రతల విచ్ఛిన్నమంటూ జగన్ దుష్ప్రచారం
– ఆగని నీలి మీడియా ఆగడాలు
– తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్,బోళ్ళ సతీష్ బాబు  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది మొదలు రాష్ట్రంలో పాలనను ఎలా గాడిలో పెట్టాలి.. అర్ధాంతరంగా నిలిచిపోయిన అమరావతి నిర్మాణం ఎలా పూర్తి చేయాలి? విధ్వంసానికి గురయిన పోలవరం పనులు ఎలా పున:ప్రారంభించాలి? రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా సాధించాలి? యువతకు ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలి?… ఇది నారా చంద్రబాబు నాయుడి తపన. కుప్పకూలిన ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే కేంద్రం సహకారం అనివార్యం.

అందుకే ఈ నెల రోజులలో రెండుసార్లు ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి సాయం చేయండని చంద్రబాబు మొరపెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సభ్యులకు పాలన ఎలా ఉండాలో దిశా నిర్ధేశం చేస్తున్న చంద్రబాబు పార్లమెంట్ సభ్యులు కేంద్రంతో ఎలా వ్యవహరించాలో నొక్కి నొక్కి చెబుతున్నారు. కేంద్రంలోని ఎన్డీయే సంకీర్ణ సర్కారులో టిడిపి భాగస్వామ్యం కీలకమైన ఈ తరుణంలో కోరిన పదవులు వచ్చి పడతాయి. కానీ పదవుల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా చంద్రబాబు పని చేస్తున్నారు.

ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసానికి విరిగి వేసారిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడడానికి ఎంత ఆవేశంగా.. ఎంత ఆలోచనతో.. ఓటు వేశారో.. మనం కళ్ళారా చూశాం. తెలుగుదేశం- జనసేన- బిజెపి కూటమికి 164 సీట్లు కట్టబెట్టిన జనం.. జగన్ రెడ్డి పార్టీని 11 సీట్లకు పరిమితం చేశారంటే వారి ఆకాంక్ష ఏమిటో మనందరికీ స్పష్టమవుతోంది.

కానీ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? వైసీపీ దుష్పరిపాలన పరిణామాలు ఇంకా పూర్తిగా అంతం కాలేదు. జగన్ రెడ్డి అనుచర (అసుర) గణం అరాచకాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఆనాడు ప్రతిపక్ష టిడిపి శ్రేణులపై దాడులు చేసి దొంగే.. బాధితులపై దొంగ.. దొంగ.. అని ముద్ర వేశాడో.. ఇప్పుడూ అదే పరిస్థితి రాష్ట్రం నలుమూలలా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా టిడిపి శ్రేణులది బాధితుల పాత్రే అవుతోంది. వైసీపీ అరాచకాలకు ఏదో ఒక మూల టిడిపి కేడర్ బలవుతూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ కాలకూటం విషం కక్కుతోంది. నీలి మీడియా చంద్రబాబు పాలనపై తప్పుడు రాతలు రాస్తూ.. విద్వేషపు కూతలు కూస్తూ.. ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ పెయిడ్, పేటిఎం సోషల్ మీడియా రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందంటూ గగ్గోలు పెడుతూనే ఉంది. ఎందుకిలా జరుగుతోందంటే.. దానికి ఒకటే జవాబు… చంద్రబాబు పుణ్యమాని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంటే.. చూసి ఓర్వలేక దానిని దెబ్బ తీసే కుట్ర ఇది.

జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు అంతంత ప్రగల్భాలు పలికి ఇంత దారుణంగా ఓడిపోయిన తర్వాత ఏ మొహం పెట్టుకొని ప్రజల మధ్యకు రాగలడు? అసలు రాష్ట్రంలో ఉంటాడా.. విదేశాలకు పారిపోతాడా? అని అనుకున్న వారందరూ జగన్ గురించి చాలా తక్కువ అంచనా వేశారనే చెప్పవచ్చు. తాడేపల్లి, బెంగళూరు ప్యాలస్ లలో నెలరోజులు మేథోమధనం చేసిన తర్వాత ఇకపై ఏ విధంగా ముందుకు సాగాలో జగన్ మార్గం కనిపెట్టిన్నట్లే ఉన్నాడు. చేతిలో ఉన్న బలమైన మీడియా, సోషల్ మీడియా ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని గట్టిగా దుష్ప్రచారం చేస్తూ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ తప్పటడుగులు వేసేలా చేయడమే వ్యూహామని జగన్ తాజా ట్వీట్ స్పష్టం చేస్తోంది.

ఇప్పటికే వినుకొండ బురదని చంద్రబాబుకి పూసేందుకు నానా ప్రయత్నాలు చేశాడు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ మీడియా సంస్థలని ట్యాగ్ చేస్తూ జగన్ ఓ ట్వీట్ వేశారు. దాని సారాంశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. శాంతి భద్రతలు క్షీణించాయి. రాష్ట్రంలో వైసీపిని అణగద్రొక్కేందుకు టిడిపి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి.

చంద్రబాబు నెలన్నర రోజుల పాలనలోనే రాష్ట్రంలో ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు, భౌతిక దాడులు, విధ్వంసం, రాజకీయ కక్ష సాధింపులే కనిపిస్తున్నాయి. వినుకొండలో జరిగిన హత్య ఇందుకు తాజా నిదర్శనం. ఏపీ సిఎం మరియు కొందరు అధికారులే ఈ హింసను ప్రేరేపిస్తున్నారు. అందువల్ల రాష్ట్రంలో గూండాలు, హంతకులు యధేచ్చగా తిరుగుతున్నారు. కనుక ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఈ అరాచకాలపై సీబీఐ దర్యాప్తు అవసరం. రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులపై ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు దృష్టి పెట్టాలని నేను కోరుతున్నాను.

వినుకొండలో టిడిపి గూండా దాడిలో చనిపోయిన షేక్ రషీద్ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నాను. జాతీయ మీడియా సంస్థలకు కూడా జగన్ ఈ సందేశం పంపించారు. దీనిని గమనిస్తే జగన్ ఏదో యధాలాపంగా శాంతి భద్రతలు క్షీణించాయని మాట్లాడటం లేదని, ఇది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసే వ్యూహమని అర్దమవుతుంది. నేడు కాకపోతే రేపైనా చంద్రబాబు ప్రభుత్వం తనపై రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటుందని జగన్ రెడ్డికి ముందే తెలుసు. కనుక జగన్ రాష్ట్రం విడిచి పారిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ టిడిపి కంటే ముందే, చాలా వేగంగా ఈ వ్యూహంతో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసి ఎదురుదాడి చేస్తూ తన జోలికి రాకుండా చేయాలని జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.

చంద్రబాబు పట్ల ఉన్న నమ్మకంతో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి మొదటి నుండీ చంద్రబాబు చెబుతున్న మాదిరిగా ‘సంపద సృష్టి’ జరిగితే.. ఆ సంపదను చంద్రబాబు ప్రజలకు పంచి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తే.. జగన్ రెడ్డికి ‘మరో ఛాన్స్’ అనే మాట మరిచిపోవలసిందే. ‘ఒక్క ఛాన్స్’ అని అడిగి రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి నెట్టిన జగన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుని అరాచకం సృష్టించాలని కుట్రలు పన్నుతున్నాడు. వినుకొండలో వైసీపీ కార్యకర్తలు ఇద్దరు కొట్టుకుని అందులో ఒకరు మరణిస్తే ఏదో మారణహోమం జరిగినట్లు గగ్గోలు పెట్టిన జగన్ ఢిల్లీ వేదికగా రచ్చ చేయాలని చూస్తున్నాడు. కానీ ఐదేళ్లలో జగన్ రెడ్డి, అతని అనుచర (అసుర) గణం అకృత్యాలపై చర్యలు తీసుకుంటే మాత్రం ‘కక్ష సాధింపు’ అని గగ్గోలు పెడతాడేమోనని కూటమి నేతలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వైసీపీ దుర్మార్గాలపై చర్యలు తీసుకునే విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోవాలి.

రఘురామకృష్ణంరాజుపై గత ప్రభుత్వ అధికార దాడిపై ఎలా కేసు నమోదు చేశారో… మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకల దాడిపై దర్యాప్తు ఏవిధంగా ముందుకు వెళుతుందో.. కృష్ణా జిల్లా గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసు ఏ విధంగా రీ ఓపెన్ అయిందో.. అదే విధంగా రంపచోడవరంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలి. కరోనా సమయంలో మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ పై పిచ్చోడని ముద్ర వేసి మరీ ఆయన మరణానికి కారణమైన ప్రతీ ఒక్కరి పైనా చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి. తన అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించిన పాపానికి అమరనాథ్ గౌడ్ అనే బాలుడిని పెట్రోల్ పోసి కిరాతంగా సజీవ దహనం చేసిన నేరస్థులకు శిక్ష పడేలా చూడాలి.

జగన్ రెడ్డికి జిందాబాద్ చెప్పాలని పీక మీద కత్తి పెట్టినా చలించకుండా జై తెలుగుదేశమంటూ బలైపోయిన చంద్రయ్య ఆత్పార్పణకు సమాధానం చెప్పాలి. ఇలా.. ఒకటా.. రెండా… రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు కోకొల్లలు. వాటన్నింటి పైనా చర్యలు తీసుకోవాలి. ఇది కక్ష సాధింపు కాదు.. ధర్మ పరిరక్షణ..
అసలు ఇవన్నీ కాదు.. 32 సిబిఐ, ఇడి కేసులు ఉన్న జగన్ రెడ్డిపై చర్యలు ఏవి? ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని శుక్రవారం విచారణలు ఎగ్గొట్టిన జగన్ రెడ్డి మాజీ అయ్యాక కూడా కోర్టు మెట్లు ఎందుకు ఎక్కడం లేదు? కేంద్రంతో మాట్లాడండి.. ఆ కేసుల దర్యాప్తు వేగం పుంజుకునేలా చూడండి.. చంద్రబాబు నాయుడు గారూ.. మీరు మారానని నిరూపించండి… అని టిడిపి సోషల్ మీడియా కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు.