గురు స్థానం విశిష్టమైంది 

గురుపౌర్ణమి మహోత్సవంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి 

చిలకలూరిపేట, మహానాడు :  సమాజంలో గురుస్థానం అత్యంత విశిష్ఠం, దానిని ఎవరూ భర్తీ చేయలేనిదన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. అజ్ఞానపు చీకట్ల నుంచి విజ్ఞానపు వెలుగుల్లోకి నడిపించే మహోన్నత వ్యక్తి గురువు అని కొనియాడారు. అలాంటి గొప్పవ్యక్తి  గురువుకి దైవత్వాన్ని ఆపాదించి, అత్యున్నత పీఠంపై నిలిపి పూజించే ఘనమైన సంస్కృతి భారతదేశానిది అన్నారు.

చిలకలూరిపేట పురుషోత్తపట్నంలోని శ్రీ షిర్డీ సాయి మందిరం, పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న శ్రీ సత్యసాయి ధ్యాన మందిరంలో గురుపౌర్ణమి మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అర్చకుల నుంచి వేదాశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటిని ఆలయాల నిర్వాహకులు శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు గురుపార్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సరైన గురువు లేకుంటే సమాజమే దారి తప్పుతుందని, ఏది మంచి, ఏది చెడు అని ఎంచి చెప్పగలిగేది గురువు ఒక్కడే అన్నారు. అలాంటి మంచి గురువు మార్గనిర్దేశం లేని వ్యక్తులు ఎలా మారతారో, పొరపాటు అలాంటి వాళ్లు నాయకులైతే ఎలాంటి విపరిణామాలు ఉంటాయో రాష్ట్రంలో పరిస్థితులే ఉదాహరణ అన్నారు.

ప్రతిఒక్కరు గురువులు ఉపదేశించిన మార్గాలను పాటించాలని, వారి పట్ల, సమాజం పట్ల గౌరవంతో మెలగాలన్నారు. ఏ విద్య నేర్పే వారైనా గురువే అని… పూజ్యనీయులే అని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల తర్వాత అంత సమున్నత స్థానం కలిగిన గురువు నుంచి శ్రద్ధాసక్తులతో మంచిని నేర్చుకునే విద్యార్థులందరి భవిష్యత్ బంగారుమయం అవుతుందని ఆయన తెలిపారు.