జగన్మోహన్ రెడ్డి.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉంది

-హవ్వ… రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని ఢిల్లీలో ధర్నానా?
-మీరు, మీరు పొడుచుకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలా? ఇదెక్కడి విడ్డూరం?
-తెదేపాలో కొట్టించుకున్న వారే కానీ కొట్టిన వారు లేరు… ఎందుకంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాడులను అంగీకరించరు
-మనసులో కష్టంగా ఉన్న నాయకుని మాట జవదాటని వ్యక్తులుగా కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారు
-ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు

హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఢిల్లీలో ధర్నా చేస్తామని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు వికటించాయని ఢిల్లీలో ధర్నాకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటన్నారు.

మీరు, మీరు పొ డుచుకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని అంటారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్మోహన్ రెడ్డి కోరడం కంటే సిగ్గుమాలిన చర్య మరొకటి ఉంటుందా? అని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. ఆదివారం నాడు ఉండి నియోజకవర్గ కేంద్రంలో మీడియా ప్రతినిధులతో ఆయన పలు అంశాలపై మాట్లాడారు.

ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చిన జగన్మోహన్ రెడ్డి, గతంలో నన్ను హింసించినప్పుడు నేను ప్రతిపక్షాలకు నాయకులకు ఉన్న నిజాన్ని చెబితే, ఇదే జగన్మోహన్ రెడ్డి వారికి ఫోన్ చేసి అదంతా అబద్ధం… నమ్మవద్దని కోరిన మాట నిజం కాదా అంటూ నిలదీశారు. అంత ధైర్యంగా కొట్టించి, వీడియోను తిలకించి, ఆనందించిన జగన్మోహన్ రెడ్డి నలుగురు ప్రశ్నించి, నాలుగు ట్విట్లు పెట్టేసరికి భయపడిపోయి, అబద్దాన్ని అలవోకగా చెప్పాడని రఘురామ కృష్ణంరాజు విరుచుకుపడ్డారు.

ఇంకా తగ్గని ప్రజాభిమానం అంటూ బయల్దేరనున్న ఎర్నలిస్టులు
డబ్బులు ఇచ్చి కొంతమందిని పోగు చేసి వారు రోడ్డుకి రాగానే జగన్మోహన్ రెడ్డికి ఇంకా తగ్గని ప్రజాభిమానం అంటూ పత్రికల్లో రాయించుకుంటారు. ఇక కొంతమంది ఎర్నలిస్టులు బయలుదేరి జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఇంకా ప్రజాభిమానం తగ్గలేదని భజన చేస్తారని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు . ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైకాపాకు 40% ఓట్లు వచ్చాయి. అందులో మిమ్మల్ని ప్రేమించే అభి’మతం’ ఉన్నవారు ఉంటారు.

వారితో పాటు మరో రెండు వేల మందిని డబ్బులు ఇచ్చి పోగేసుకుని కొత్తగా ప్రజాభిమానం పుట్టుకొచ్చినట్లు కలర్ ఇవ్వడం ఇప్పుడు అవసరమా?. ఐదేళ్ల వరకు ఎంత చేసినా ఉపయోగం ఏమిటి??. కనీసం మంచి పనులు చేయండి. అసెంబ్లీలో నిర్మాణాత్మక ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించండి. అబద్దాలను కాకుండా నిజాలను చెప్పండి. మీరు, మీరు చంపేసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటే నమ్మడానికి ప్రజలేమీ అమాయకులు కాదు.

గతంలో కనీసం నా ఫ్లెక్సీ ని కూడా కట్టనిచ్చారా?. మా వాళ్లు అభిమానంతో ఫ్లెక్సీ కడితే వారిపై ఎన్ని కేసులు పెట్టారో తెలియదా??. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడడం సిగ్గుచేటు. తెలుగుదేశం పార్టీలో కొట్టించుకున్న వారిని మాత్రమే చూశాను. కొట్టిన వాళ్లను నేను చూడలేదు. తిరిగి కొడదామంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒప్పుకోరు. చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని, ధర్మం ప్రకారం వారికి శిక్ష పడాలని మాత్రమే మార్గ నిర్దేశం చేస్తారు.

చట్టాన్ని చేతిలోకి తీసుకోవడాన్ని ఆయన అసలు క్షమించరు. మనసులో కష్టంగా ఉన్నప్పటికీ నాయకుని మాట జవదాటని వ్యక్తులుగా మా పార్టీ కార్యకర్తలు ఎంతో సమయమనం పాటిస్తున్నారు. మా పార్టీ వారు ఎటువంటి గొడవలకు ముందుకు రాకపోవడంతో, వైకాపాలోని నాయకులే కొట్టుకొని, కొట్టిన వాడికి టిడిపి రంగు పులిమి, దెబ్బలు తిన్న వాడికి వైకాపా కార్యకర్తగా ప్రచారం చేసుకుంటున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని , జగన్మోహన్ రెడ్డి ఎన్ని అబద్ధాలు… నాటకాలు ఆడిన ప్రజలకు వాస్తవాలు ఏమిటో తెలుసునని పేర్కొన్నారు.

మీ అబద్ధాల గురించి ఢిల్లీకి వచ్చి చెప్పేవాడిని… అయినా మా పార్టీకి 16 మంది ఎంపీలు ఉన్నారు వారు చెబుతారు
అసెంబ్లీ సమావేశాలు లేకపోతే ఢిల్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అబద్దాల గురించి చెప్పి ఉండే వాడినని రఘురామకృష్ణం రాజు తెలిపారు. అయినా, మా పార్టీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. వారు జగన్మోహన్ రెడ్డి చెబుతున్న అబద్దాలను తిప్పి కొడుతారు. గతంలో సొంత బాబాయిని లేపేసి ఇతరులపై బురద చల్లారని, వీళ్ళ మాటలు నమ్మొద్దు అంటూ నేను అందరికీ లేఖలు రాస్తాను. వైకాపా ప్రచారం చేస్తున్న అసత్యాలను, వల్లె వేస్తున్న అబద్దాలను ప్రతి ఒక్కరూ తీవ్రంగా నిరసించాలి.

గతంలో మెరిట్ ఆధారంగా ఇద్దరు, ముగ్గురు కమ్మ అధికారులకు తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రమోషన్ ఇచ్చారు. కానీ దాన్ని వైకాపా నాయకత్వం వక్రీకరించి 30 మందికి పదోన్నతి కల్పించారని తప్పుడు ప్రచారాన్ని చేసింది. అయినా తెదేపా నాయకత్వం తాము తప్పు చేయలేదని, అటువంటప్పుడు వైకాపా చేసే దుష్ప్రచారాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదని మిన్నకుండిపోయింది. అయితే ప్రజలు వైకాపా అతిగా చేసిన అబద్ధపు ప్రచారాన్నే నమ్మారు.

ఈ విషయం ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టం అయింది. ఇప్పుడు వైకాపా చేసే ప్రతి అబద్ధపు ప్రచారాన్ని తెదేపా పార్టీ కార్యకర్తలు తమ వంతు బాధ్యతగా ఖండించడమే కాకుండా పదిమందికి వారు చేసే అబద్ధపు ప్రచారం గురించి వివరించాలి. లేకపోతే వైకాపా చేసే అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు నిజం అనుకునే ప్రమాదం లేకపోలేదు.

మనమంతా పొడిచిన వాడు, పొడిపించుకున్నవాడు ఒకే పార్టీ కి చెందినవారని, ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. నిజంగా తప్పు జరిగితే జగన్మోహన్ రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడితే అతని గౌరవం పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి నిజాలను చెబితే ప్రజలు ఆయన్ని గౌరవిస్తారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.. పదేపదే అబద్దాలను చెబితే , ప్రజలు మళ్లీ, మళ్లీ ఓడిస్తారని హెచ్చరించారు.

జగన్మోహన్ రెడ్డి తీరు దొంగే దొంగ… దొంగ అన్నట్లుగా ఉంది
జగన్మోహన్ రెడ్డి తీరు దొంగే దొంగ… దొంగ అన్నట్టుగా ఉందని రఘురామకృష్ణంరాజు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం పరిశీలిస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు. వినుకొండ పట్టణంలో గంజాయి మత్తులో ఇద్దరు అసాంఘిక శక్తుల మధ్య జరిగిన స్ట్రీట్ ఫైట్ లో భాగంగా ఒకరిని మరొకరు పొడుచుకున్నారు.

వీరిద్దరూ వైకాపాలోనే కొనసాగే వారు. ఒకప్పుడు ఒకటే గ్యాంగ్. ఎందుకో ఇద్దరి మధ్య దెబ్బలాటలు వచ్చాయి. వ్యాపార లావాదేవీలలో తగాదాలు, పంపకాలలో తేడా వల్లో , దందాలోనో తగాదా వచ్చి ఒకరిని మరొకరు పొడుచుకున్నారు. ఇప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి, ఒక సమస్యగా చిత్రీకరించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై మాటల దాడి చేయడం నీతి మాలిన చర్య. దాన్ని ఎవరు హర్షించరని రఘురామ కృష్ణంరాజు అన్నారు . దీన్ని కూడా కొంతమంది రాజకీయం చేయాలని చూడడం సిగ్గుచేటు.

తెదేపా నేతృత్వంలోనే కూటమి ప్రభుత్వంలో ఒక మతం వారికి రక్షణ లేదా? అని ప్రశ్నించడం వారి అవివేకానికి నిదర్శనం అని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. ఈ సంఘటనలో పొడిచిన వాడు, పొడిపించుకున్న వాడు ఒకే మతం అని, వేరే మతం కాదని గుర్తించాలన్నారు. కొంతమంది సమాజంలో విద్వేషాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గతంలో సొంత బాబాయిని లేపేసిన వారే, ఇతరుల పైకి నెట్టడానికి నారా సుర రక్త చరిత్ర అని సొంత పేపర్లో వార్తా కథనాన్ని రాయించారన్నారు.

మిథున్ రెడ్డి పై రాళ్లు వేశారని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్న రఘురామకృష్ణం రాజు, నా పుట్టినరోజు నాడునన్ను అరెస్టు చేయించి, బాగా కొట్టించి, వీడియో చూసి ఆనందించిన దానికంటే ఎక్కువ హింస ఇంకా ఏదైనా ఉంటుందా అని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి నీతులు చెబితే, ప్రజలు నమ్మాలా?, ఎవరు ఎన్నెన్ని అరాచకాలు చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.

నీ సి ఐ డి గ్యాంగ్, అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ నేతృత్వంలో అడిగినన్ని డబ్బులు ఇస్తావా?, లేకపోతే నీ కారులో గంజాయి బ్యాగు పెట్టమంటావా? అని బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు . ఎవరితో మాట్లాడారో అన్ని వివరాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు బయటకు వస్తాయి. వినుకొండ ఘటనలో ఒకరికి చెప్పి నువ్వే మరొకరిని పొడిపించావనే ప్రచారం జరుగుతోందంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రఘురామ కృష్ణంరాజు అన్నారు.

మూడు కులాల సుగుణాలు కలిసిన వారు కమ్మవారు… వారంటే నాకెంతో ఇష్టం, గౌరవం
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలలోని సుగుణాలను కలిగిన వారు కమ్మవారని వారంటే నాకు ఎంతో ఇష్టం, గౌరవమని రఘురామకృష్ణం రాజు తెలిపారు. బ్రాహ్మణులలోని జ్ఞానాన్ని, క్షత్రియులలోని పౌరుషాన్ని, వైశ్యులలోని వ్యాపార దక్షతను కమ్మవారు పునికి పుచ్చుకున్నారు. ఏ రంగంలో చూసిన కమ్మవారు, ఆ రంగంలో అగ్రస్థానంలో కొనసాగిన వారు కనిపిస్తారు. హోటల్, సినిమా రంగాలతో పాటు, సాఫ్ట్వేర్ రంగంలోను కమ్మవారు ఉన్నారు.

మైక్రోసాఫ్ట్ విండోస్ పనిచేయకపోతే ప్రపంచంలోనే ప్రతి ఒక్కరూ తలలు పట్టుకున్నారని, ప్రపంచాన్ని శాసించే గ్లోబల్ నాయకులు, మన తెలుగువాడైన వ్యక్తి కమ్మ సామాజిక వర్గమే. సైనిక రంగంలోను జనరల్ స్థాయిలో పనిచేసిన జనరల్ కృష్ణారావు కూడా కమ్మ సామాజిక వర్గమే. అంతేకాకుండా విదేశాలలో స్థిరపడిన వారిలో మెజారిటీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ఉంటారని, సైన్స్, ఫైనాన్స్ రంగాలలో వారు కొనసాగుతున్నారని చెప్పారు.

దేశంలోని ఏ ఇతర ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టు చేపట్టిన, లేకపోతే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో సాగునీటి ప్రాజెక్టును నిర్మించిన తమ వద్ద ఉన్న ఎకరం భూమి అమ్ముకుని అక్కడకు వెళ్లి పది ఎకరాల భూమిని కొనుగోలు చేసి తమ ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అక్కడివారికి వ్యవసాయాన్ని నేర్పించి అద్భుతాలను సృష్టించారని, అది కమ్మవారి కష్టించి పనిచేసే మనస్తత్వాన్ని తెలియజేస్తుందన్నారు. సొంత ఊరును వదిలి ఎక్కడికో వెళ్లి అక్కడి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమన్నది అందరికీ సాధ్యమయ్యే పని కాదన్నారు.

కమ్మవారు వెల్త్ క్రియేటర్స్ అని వారు అద్భుతాలను సృష్టించడమే కాకుండా, ఇతరుల అభివృద్ధికి దోహదపడుతారని చెప్పారు. ప్రతి కులంలోనూ చెడ్డవారు ఉన్నట్లుగానే కమ్మవారిలోనూ ఒకరిద్దరూ చెడ్డవాళ్ళు ఉంటే ఉండవచ్చు. కానీ మంచివాళ్లు, కష్టపడే తత్వం కలిగిన వారు ఎక్కువ. సోంబేరులు, సోమరిపోతులు ఆ కులంలో చాలా తక్కువ. కమ్మవారిని ఇగ్నోర్ చేయడానికి లేదు.

కొంతమంది కమ్మవారిని గౌరవించకపోవచ్చు కానీ కమ్మవారిని విస్మరించడానికి వీలు లేదని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. అటువంటి కులాన్ని గౌరవించడం మానేసి గతంలో ఒక ద్వేష భావంతో అన్యాయం చేశారు. చెప్పలేనంత అన్యాయం చేశారు. ఎందుకయ్యా కమ్మ వారంటే అంత కోపం రెడ్డి… నువ్వు చేసేది తప్పు… ఆ కులంలో పుట్టినంత మాత్రాన శిక్ష వేయాలన్నట్టు వ్యవహరించడం కరెక్ట్ కాదని నేను చెప్పాను. అమరావతి అభివృద్ధి చెందితే కేవలం కమ్మవారి బాగుపడతారన్న దృక్పథం కూడా సరైనది కాదని గణాంకాలతో సహా వివరించాను.

అమరావతిలో అధికంగా భూములు కలిగిన వారు రెడ్డి కులస్తుల తో పాటు, 50% వరకు బీసీలు ఉన్నారని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి కేవలం 14 శాతం మందికి మాత్రమే భూములు ఉన్నాయని వివరించినప్పటికీ పిచ్చి ద్వేషంతో గత ప్రభుత్వంలోని పెద్దలు వ్యవహరించారు. అదే సమయంలో నేను కమ్మవారికి అనుకూలంగా గళం విప్పాను. ఎవరైనా కమ్మ సామాజిక వర్గం నాయకులు మాట్లాడితే వారికి కులం పిచ్చిని అంటగట్టే ప్రమాదం ఉండడంతో వారెవరు ముందుకు రాలేదు .

అటువంటి సమయంలో నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను కొంతమంది నువ్వు కమ్మ కులానికి చెందిన వాడివేనని ఎగతాళిగా మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ వారు నన్ను కమ్మ కులానికి చెందిన వాడివని పేర్కొనడం కూడా నేను ఒక గౌరవంగానే భావించాను. కమ్మవారిలో నేను గ్రాటిట్యూడ్ కూడా చూశాను. నాకు ఏ పార్టీ నుంచి సీటు రానప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే నా వెనుక నిలబడ్డారు. తప్పకుండా రాజు గారికి సీటు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు.

ఏ పార్టీలో చేరనందువల్లే ఆయనకు టికెట్ రాలేదని కొంతమంది అన్నప్పటికీ, ఏ పార్టీలో చివరి వరకు చేరని వారు ఇప్పుడు ఎంపీ లు కూడా అయ్యారని గుర్తు చేశారు . కమ్మవారు నాపట్ల చూపించిన గ్రాటిట్యూడ్ కు జీవితాంతం వారికి హృదయపూర్వకంగా అండగా ఉంటానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈరోజు నేను ఎమ్మెల్యే గా ఉన్నాను అంటే అది కమ్మవారి కృతజ్ఞతా భావమేనని ఆయన తెలిపారు. నేను వారికి చేసింది ఏమీ లేదని, వారి తరఫున వారు మాట్లాడుకో లేని సమయంలో నేను గొంతు విప్పడమేనని తెలిపారు.

తప్పు చేస్తున్నావ్… జగన్మోహన్ రెడ్డి అని ఎవరో మాట్లాడడానికి ధైర్యం చేయని రోజుల్లో నేను ధైర్యంగా మాట్లాడాను
ఒక కులం పై ద్వేషంతో తప్పు చేస్తున్నావ్… జగన్మోహన్ రెడ్డి అని ఎవరు ధైర్యంగా మాట్లాడలేని రోజుల్లో నేను ధైర్యంగా మాట్లాడానని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. ఒక ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీని వేధించడం అనేది రాష్ట్ర ప్రగతికి అవరోధమని హెచ్చరించినట్లు తెలిపారు. కమ్మ వారి గురించి వారు మాట్లాడుకోలేని సమయంలో నేను వారి తరఫున ధైర్యంగా గత ప్రభుత్వ పెద్దలతో మాట్లాడానని చెప్పారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేధింపులను తట్టుకోలేక చాలామంది తెలంగాణకు వెళ్లిపోయారు. గత ఐదేళ్లుగా తెలంగాణ అభివృద్ధిలో వారు మమేకమయ్యారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వేధింపులను తాళ లేక తెలంగాణకు వెళ్లిపోయిన వారిలో కొంతమంది అక్కడ భూములను కొనుగోలు చేసి బాగుపడ్డారన్నారు .

ఆ రాజు గురించి ఎంతమందికి తెలుసు… కమ్మవారే మర్చిపోయారు
ముక్త్యాల మహారాజు రాజా వాసిరెడ్డి రాంగోపాల్ కృష్ణ మహేశ్వర ప్రసాద్ గురించి ఎంతమందికి తెలుసునని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.. కమ్మవారే ఆయన గురించి మర్చిపోయారు. ఇప్పుడు పోలవరం కట్టడానికి ఎంతో కష్టపడుతున్నాం. కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయల నిధులు కావాలని కోరుతున్నాం.. అటువంటిది ఒకప్పుడు రాష్ట్రానికి అన్నం పెట్టిన నాగార్జునసాగర్ నిర్మాణానికి కృషి చేసిన మహానుభావుడు ముక్త్యాల మహారాజు రాజా వాసిరెడ్డి రాంగోపాల్ కృష్ణ మహేశ్వర ప్రసాద్ అని రఘురామ కృష్ణంరాజు కొనియాడారు.

అప్పట్లో మద్రాస్ కంపోజిట్ రాష్ట్రంలో కృష్ణానది జలాలను పెన్నా నది తో కలిపి మద్రాస్ కు తీసుకువెళ్లాలని భావించగా, ఆ నిర్ణయాన్ని ముక్త్యాల మహారాజు తీవ్రంగా వ్యతిరేకించారు. 1954లో ఒక సంఘం కట్టి , నాగార్జునసాగర్ ప్రాంతంలో ఆనకట్టను నిర్మించాలని పట్టుబట్టారు . ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మించిన చోటికి సరైన నడకదారి కూడా లేని కారణంగా, కోస్లా కమిటీ సభ్యులు అక్కడకు వెళ్లడానికి తిరస్కరించారు.

ముక్త్యాల మహారాజు నాలుగు ఐదు నెలల వ్యవధిలో రోడ్లు వేసి, అక్కడకు తీసుకువెళ్లి ప్రాజెక్టు నిర్మాణానికి ఇదే బెస్ట్ లొకేషన్ అని వాళ్లకు చెప్పి ఆ రోజుల్లో 50 లక్షల రూపాయల నగదును ప్రాజెక్టు నిర్మాణానికి విరాళంగా ఇచ్చారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఆ రోజుల్లో 50 లక్షల రూపాయలు అంటే ఈరోజుల్లో కచ్చితంగా వేల, వందల కోట్ల రూపాయలేనని పేర్కొన్నారు. అలాగే తనకు చెందిన 5500 ఎకరాల భూమిని కూడా ప్రాజెక్టు నిర్మాణానికి దానంగా ఇచ్చారన్నారు.

ఒక్క ఎకరం భూమి కూడా ఇవ్వకుండానే తన తాత పేరు, తండ్రి పేరు, లేదంటే పార్కు కనబడితే తన పేరు పెట్టుకుంటున్న ఈ రోజుల్లో, అంత పెద్ద ఎత్తున దానం చేసిన ముక్త్యాల మహారాజు రాజా వాసిరెడ్డి రామ్ గోపాల్ కృష్ణ మహేశ్వర ప్రసాద్, నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు తన పేరు పెట్టమని మాత్రం అడగలేదన్నారు. అది ఆయన గొప్పతనం అని కొనియాడారు. అటువంటి మహానుభావుడు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారేనని, అప్పుడు ఆయన చేసిన త్యాగమే ఎన్నో లక్షల మందికి అన్నం పెట్టిందని, ఇప్పుడు కోట్లాదిమందికి ఆస్తుల విలువను పెంచిందన్నారు.

అటువంటి మహానుభావుడికి గౌరవం ఇవ్వాలని కమ్మ గ్లోబల్ సమావేశంలో చెప్పాలని భావించాను. కానీ అప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకున్న ముందస్తు కార్యక్రమాల కారణంగా ఆలస్యంగా సభకు హాజరు కావడంతో, నేను వరదల కారణంగా ఉండికి బయలుదేరి రావడానికి విమాన సమయం కావడం వల్ల ప్రసంగించకుండానే తిరిగి వచ్చానని రఘురామ కృష్ణంరాజు ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

సాగర్ ఆనకట్ట పై మహారాజు విగ్రహం ఏర్పాటు చేయాలి
నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మాణానికి, నగదు తో పాటు తన భూములను ధారా దత్తం చేసిన రాజా వాసిరెడ్డి రామ్ గోపాల్ కృష్ణ మహేశ్వర ప్రసాద్ విగ్రహాన్ని సాగర్ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేయాలని పాలకులను రఘురామకృష్ణం రాజు కోరారు. రాజా వాసిరెడ్డి పేరిట విశిష్టమైన కార్యక్రమాలను చేపట్టాలని కమ్మ గ్లోబల్ సమావేశంలో సూచించాలని భావించాను. ఆయన గురించి పదిమందికి తెలిసేలా చెప్పండని… ఆయన ఒక్కరే కాదు ఎంతోమంది మహానుభావులున్నారని వారందరినీ గౌరవించుకోవడం మన బాధ్యత అని గుర్తుచేయాలని సంకల్పించాను.

రాజా వాసిరెడ్డిని ఒక్క కమ్మ వారే కాదని, తెలుగు వారందరూ గౌరవించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద వైఎస్ విగ్రహం ఏర్పాటు చేయాలని గత పాలకులు భావించారు… మరి ప్రస్తుత పాలకులు నాగార్జునసాగర్ వద్ద రాజా వాసిరెడ్డి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదన్నారు. ఆయన పేరు పదిమందికి తెలిసే విధంగా కార్యక్రమాలను చేపట్టడానికి తీర్మానం చేయాలని నన్ను కమ్మ గ్లోబల్ సమావేశానికి ఆహ్వానించిన జెట్టి కుసుమ కుమార్ కు సూచిస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య ను కర్ణాటక ప్రజలు ఎంతో గౌరవిస్తారని, సర్ ఆర్థర్ కాటన్ కు ఉభయగోదావరి జిల్లాలలో ఎంతో విశిష్ట స్థానం ఉందని అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతి ఉత్సవాలను గోదావరి జిల్లాలలో ఘనంగా జరుపుకుంటారని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, రాజా వాసిరెడ్డి ని నాగార్జునసాగర్ లెఫ్ట్, రైట్ కెనాల్ ద్వారా లబ్ధి పొందిన రైతాంగం ఎందుకు అంతగా గౌరవించడం లేదో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్ ఆర్థర్ కాటన్ కంటే ఎక్కువగానే రాజా వాసిరెడ్డికి గౌరవం దక్కాలన్నారు. ఎందుకంటే సర్ అర్ధర్ కాటన్ ఒక ఉద్యోగి అని, రాజా వాసిరెడ్డి మాత్రం తన సొంత ఆస్తులను ప్రాజెక్టు నిర్మాణం కోసం ధారా దత్తం చేశారన్నారు .

కమ్మ సామాజిక వర్గం వారు స్త్రీలను అధికంగా గౌరవిస్తారని, స్త్రీలను గౌరవించే ప్రతి వ్యవస్థ బాగు పడిందని, స్త్రీలను అగౌరవపరిచే, చులకనగా చూసేవారు బాగుపడిన దాఖలాలు లేవన్నారు. స్త్రీలకు విశిష్టమైన గౌరవం ఇచ్చే కమ్యూనిటీ గా కమ్మ సామాజిక వర్గం అంటే నాకు ఇష్టమని రఘురామకృష్ణంరాజు తెలిపారు. కమ్మ సామాజిక వర్గంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు లాంటి మహానుభావులతో పాటు మంచి విజన్ ఉన్న గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు లాంటి వారు ఉన్నారన్నారు.

25 రోజుల క్రితం డ్రైన్లు, కెనాల్ లు శుభ్రపరచడం మంచిదయింది
ఉండి నియోజకవర్గ పరిధిలో 25 రోజుల క్రితం నుంచి డ్రైన్లు, వరద నీటి కాలువలో పూడిక తీసి, శుభ్రపరచడం మంచిదైందని రఘురామకృష్ణం రాజు తెలిపారు . దీని వల్ల ఉండి నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం వరద ఉధృతికి ఎక్కువ డ్యామేజీ జరగకుండా పంట పొలాలను కాపాడుకోగలిగామన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రజలే చెబుతున్నారని పేర్కొన్నారు.

ప్రస్తుత వర్ధకారణంగా రాష్ట్రంలో ని ఇతర నియోజకవర్గాలతో పాటు, ఉండి నియోజకవర్గంలోనూ నారుమల్లు దెబ్బ తిన్నాయని తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోనే 11 వేల ఎకరాలలో నారుమల్లు దెబ్బతిన్నాయని, ఈ విషయమై వ్యవసాయ అధికారులతో ఇప్పటికే మాట్లాడాలని తెలిపారు. వరద తగ్గుముఖం పట్టగానే రైతులకు 110 నుంచి 120 రోజులలో పంట చేతికొచ్చే వంగడాలను అందజేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారన్నారు.

గత 20 సంవత్సరాలుగా తెరుచుకొని గేట్లను గుర్తించడం జరిగిందని, వాటిని యుద్ధ ప్రాతిపదికన రాబోయే వర్షాకాలం నాటికి సిద్ధం చేస్తాము. వరద ముంపు పొంచి ఉన్న ప్రాంతంలో సంబంధిత అధికారులతో ఇప్పటికే మాట్లాడాను. గత ఏడు గంటల నుంచి వరద ఉదృతీ స్థిరంగా కొనసాగుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత డ్రైన్లకు సంబంధించి అధికారులు అన్ని చర్యలు తీసుకుంటారు. డ్రైన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి రామానాయుడు కోరారని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు.

ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న డ్రైన్లు, కాలువల అభివృద్ధి పనుల స్ఫూర్తితోనే ఈ నిధుల మంజూరీకి ప్రతిపాదించడం జరిగిందన్నారు. డిసెంబర్లో మళ్లీ తుఫాన్లు వచ్చే అవకాశాలు ఉండడంతో డ్రైన్లు, వరద నీటి కాలువల ప్రక్షాళనను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇక ఉండి నియోజకవర్గంలో క్రీడా ప్రాంగణాల అభివృద్ధి యధావిధిగా కొనసాగుతుందని, ఆగస్టు 15వ తేదీ నాటికి ప్రభుత్వ పాఠశాలలను క్రీడా ప్రాంగణాలు కొత్త రూపును సంతరించుకుంటాయని తెలిపారు.

అలాగే సాంఘిక సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో ఏవైతే విద్యార్థులకు వసతులు కల్పిస్తున్నారో, వాటికి ఏమాత్రం తీసిపోకుండా బెడ్లు, డైనింగ్ టేబుళ్ల ఏర్పాటు కు స్థానిక దాతలతో పాటు, నేను అడగగానే మన్నించి కొంతమంది సహాయ సహకారాలను అందించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లోని విద్యార్థులకు మెరుగైన వసతులను కల్పించడానికిఅన్ని చర్యలను తీసుకుంటున్నట్లు వివరించారు