మాజీ సీఎంపై చర్యలు తీసుకుంటాం

36 రాజకీయ హత్యలు జరిగాయని తప్పుడు ఆరోపణలు
ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తే చర్యలు తీసుకుంటాం: హోం మంత్రి అనిత

అమరావతి, మహానాడు :  తప్పుడు ప్రచారం చేస్తోన్న మాజీ సీఎం జగన్‌ మీద చర్యలు తీసుకుంటామని హోం మంత్రి వంగలపుడి అనిత అన్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్‌ తప్పుడు ఆరోపణలు చేశారు. 36 హత్యల వివరాలు జగన్ ఇవ్వగలరా..? అని ప్రశ్నించారు. రాజకీయ హత్యల వివరాలను ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

సమాచారం ఇవ్వకుంటే.. జగన్‌ మీద చర్యలు తీసుకునే అధికారం చట్టానికి ఉంటుందన్నారు. ప్రభుత్వం మీద ఎవరైనా టార్గెట్‌గా ఆరోపణలు చేస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చిన నెంబర్‌ చెప్పేస్తే చూస్తూ ఊరుకోవాలా.. మైకు ఉందని ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే చట్టం ఎందుకు ఊరుకుంటుంది అని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

రాష్ట్ర అసెంబ్లీకి రాకుండా తప్పించుకునేందుకే వైఎస్ జగన్‌ ఢిల్లీకి వెళ్తున్నారు అని మంత్రి అనిత అన్నారు. దమ్ముంటే జగన్‌ అసెంబ్లీకి రావాలి.. అసెంబ్లీలో శాంతి భద్రతలపై మేం ప్రవేశపెట్టే శ్వేత పత్రంపై జగన్‌ చర్చించగలరా?.. తప్పుడు ప్రచారం చేయడం జగన్ కి అలవాటుగా మారింది.. ప్రజలు ఇంకా తన మాట నమ్ముతారని జగన్‌ భ్రమిస్తున్నారు అని ఆమె మండిపడ్డారు.

చంద్రబాబు మీద ఇంటి మీద జోగి రమేష్‌ దాడి చేశారు.. జై జగన్‌ అని అనలేదని చంద్రయ్య అనే టీడీపీ కార్యకర్తను పీక కోసి చంపేశారు.. రోడ్‌ మీద పరదాలు కట్టడానికి.. చెట్లు నరకడానికి.. టీడీపీ నేతలను వేధించడం కోసమే జగన్‌ పోలీసులను వాడుకున్నారు అని ఆరోపించారు. నెల రోజుల కాలంలో మేం ఎక్కడైనా.. వైసీపీ నేతలను హౌస్‌ అరెస్టులు చేశామా అని హోం మంత్రి ప్రశ్నించారు.

పోలీస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేశారు

దిశా పోలీస్‌ స్టేషన్‌ ఓపెన్‌ చేసిన సాయంత్రమే గ్యాంగ్ రేప్‌ జరిగింది.. వైసీపీ హయాంలో జరిగిన నేరాలు, హత్యలు, అత్యాచారాల మీద సీఎంగా ఉన్నప్పుడు ఒక్కసారైనా స్పందించారా.. లా అండ్‌ ఆర్డర్‌ మీద.. గంజాయి గురించి ఒక్కసారైనా సమీక్షించారా.. వినుకొండలో పరామర్శకు వెళ్లి.. రాజకీయాలు మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వినుకొండలో బాధిత కుటుంబానికి జగన్‌ ఒక్క రూపాయైనా ఇచ్చారా.. అక్రమ ఆస్తి కూడబెట్టిన దాంట్లోంచి కొంత మేరైనా బాధిత కుటుంబానికి ఇవ్వలేకపోయిన జగన్‌కు ఆ కుటుంబం మీద ప్రేమ ఉందంటే ఎవరు నమ్ముతారని అన్నారు.

పోలీస్‌ వ్యవస్థను జగన్‌ నిర్వీర్యం చేశారు.. అమరావతిలో ఉన్న పాపానికి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిర్మాణానికి గత ప్రభుత్వం డబ్బులు కూడా ఇవ్వలేదు.. చంద్రబాబుపై రాళ్లేస్తే భావ స్వేచ్ఛ ప్రకటన అని కామెంట్లు చేసిన వైసీపీ ప్రభుత్వమా.. మమ్మల్ని విమర్శిస్తోంది అని హోంమంత్రి అనిత మండిపడ్డారు.