– డీజీపీ ద్వారకా తిరుమలరావు
మదనపల్లె, మహానాడు : మదనపల్లె ఘటన ప్రమాదం కాదు అని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కార్యాలయ రికార్డులు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన గురించి మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ..
మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో గత రాత్రి 11:30 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదు షార్ట్ సర్క్యూట్‌కు అవకాశమే లేదు. ఇంకా సమగ్ర విచారణ జరగాల్సి ఉంది. రాత్రి ప్రమాదం జరిగితే వెంటనే కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదు. ఆర్డీవో ఆఫీస్‌లో కీలక ఫైల్స్ ఉన్న విభాగంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాద ఘటనపై ప్రభుత్వం, పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. ఆర్డీవో కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి. జరిగిన ఘటన యాక్సిడెంట్ కాదు.. ఇన్సిడెంట్‌గా భావిస్తున్నామని అన్నారు.
దర్యాప్తు కోసం 10 బృందాలను ఏర్పాటు చేశాం. వోల్టేజ్ తేడాలు లేవు, షార్ట్ సర్క్యూట్‌కు అవకాశమే లేదు. ఆర్డీవో ఆఫీస్‌లో కొన్ని సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు. ఘటనలో రెవెన్యూ, పోలీస్ అధికారుల అలసత్వం కనిపిస్తోంది. త్వరలో అన్ని వివరాలు బయటికొస్తాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు.