(వి. ఎల్. ప్రసాద్)
భారత్ లో 70 % పైగా ప్రజలు వ్యవసాయం ఆధారంగా జీవిస్తుంటే , రాను రాను వ్యవ సాయం ఎందుకు కుంటు బడుతోంది ? ప్రభుత్వం రాను రాను వ్యవసాయంపై నిధులు తగ్గిస్తోంది ? సంక్షేమ పథకాలకు ఎందుకు ప్రాముఖ్యత పెరుగుతోంది ? విద్యా, ఆరోగ్య రంగాలను ఎందుకు పడుకో బెడుతున్నారు.
డబ్బంతా ఎటుపోతోందని పరిశీలన చేస్తే , మనిషి ఎప్పుడైతే వ్యక్తిగత స్వార్థం చూసుకోవడం మొదలుపెట్టాడో , రాజకీయ నాయకులకు అదొక ఆయుధంగా మారింది. సంక్షేమ పథకాల పేరుజెప్పి అంతులేని దోపిడీకి తెరదీస్తున్నారు. దానితో దేశమే కొద్ది కొద్దిగా సంక్షోభం లోకి నెట్టివేయ బడుతుంది. కొద్దిగా వెనక్కు వెళితే ఎక్కడ సంక్షేమ బాట మొదలైనదో తెలుస్తుంది .
2004 సం.లో అప్పటి భారత ప్రధాని మన్ మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. కేవలం వ్యవసాయ సమీక్ష కోసం. ఇలాంటి ప్రత్యేక సమీక్షలు స్వాతంత్ర్యం వచ్చాక మూడు సార్లు మాత్రమే చేయడం జరిగింది. 1950 లో నెహ్రూ, 1970 ఆరంభంలో ఇందిర , 1980 చివర్లో రాజీవ్ గాంధీలు ప్రధాని హోదాలో మన రాష్ట్రానికి వచ్చి సమీక్షలు నిర్వహించారు. 29 మే 2007 న జాతీయ అభివృద్ధి మండలి ( ఎన్.డి.సి ) సమావేశమై , 11 వ ప్రణాళిక కాలంలో ఏటా కనీసం 4 % వృద్ధి సాధించాలని , 53 వ తీర్మానాన్ని ఆమోదించింది.
ప్రత్యేక పధకాలు, ఇతర కార్య క్రమాల ద్వారా , వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెంచి, ప్రోత్సహించేందుకు రాగల ఐదు సం.లలో రాష్ట్రాలకు అదనంగా 25 వేల కోట్లు కేంద్ర సాయంగా అందిస్తామని , ప్రధాని మాన్ మోహన్ సింగ్ ఎన్.డి.సి సమావేశంలో ప్రకటించారు. మన్ మోహన్ ప్రధాని హోదాలో ఎ.పి ని సందర్శించి నప్పుడు రైతుల వెతలు స్వయంగా చూసి , సహాయక చర్యలు ప్రకటించారు.
దానికొక కారణం వుంది. అంతకు ముందు 3,4 సం.లు ఎ.పి లో కరువు తాండ వించి రైతులు అష్ట కష్టాలు పడ్డారు. అప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నాడు. అదే బాబు ఓటమికి కారణ మయ్యింది. వై.ఎస్.ఆర్ పాద యాత్ర పేరున రాష్ట్రమంతా తిరగడంతో ప్రజల్లో ఒక రకమైన భావావేశం ఏర్పడి విజయం సాధించాడు. తరువాత వర్షాలు పడడంతో ఆత్మహత్యలు కొంత మేర తగ్గాయి. ఢిల్లీ లోని కృషి భవన్ యంత్రాంగం అంతా ప్రధాని మాన్ మోహన్ సింగ్ టో పాటు వచ్చింది. సమస్యల తోరణాలు రైతులు ప్రధానికి అందించారు. వాటిలో కొన్ని.
1. వ్యవసాయ వృద్ధి మందగించడం : భారత్ లో మూడింట రెండు వంతుల ప్రజల ఆర్థిక అవసరాలు తీర్చేది వ్యవసాయం. వ్యవసాయం వృద్ధి చెందిందే అంటే రైతు ఆదాయం పెరిగినట్లే. ఈ వ్యవసాయ రంగ అభివృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. 1970,80 దశకాల్లో వ్యవసాయ వ్యవసాయ వృద్ధి వల్ల గ్రామీణ వ్యవసాయేతర రంగాలు అభివృద్ధి చెందాయి.
ఒక విధంగా అది స్వర్ణ యుగం అని చెప్పవచ్చు. 1990 నుండి ఈ రంగం సమస్యల వలయంలో చిక్కుకుంది. 7 వ ప్రణాళిక కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం 5 % వృద్ధి రేటును సాధించింది. 8,9 ప్రాణాలికలకు 4 % కు పడి పోయింది. మరో ప్రణాళికకు 3 % కు వచ్చింది. 5-10 ప్రణాళిక మధ్య ఎ.పి వ్యవసాయ వృద్ధి తేటు జాతీయ వృద్ధి రేటు కంటే 1 % హెచ్చుకానే ఉంటూ వచ్చింది.
10 వ ప్రణాళిక నాటికి వ్యవసాయ రంగం దెబ్బతిని , తోటలు, పశుపోషణ, చేపల పెంపకంలో గణనీయ వృద్ధిని సాధించింది. 9,10 ప్రణాళికల మధ్య ( 1997- 2006 ) పశు పోషణ 8 % , చేపల పెంపకం 7 % , తోటలు 4 % వృద్ధి సాధించగా , వ్యవసాయ వృద్ధి మాత్రం 1.8 % వద్దే ఆగిపోయింది. ప్రధాన పంటల దిగుబడి విలువ 15 వేల కోట్ల గానే ఉన్నది.
2. ఆహార భద్రతకు ప్రమాదం : జాతీయ భద్రతకు , మానవాభి వృద్ధికి, ఆహార భద్రత అత్యంత కీలకం. ఆహార లోగు నుండి నికర నిల్వల స్థాయికి భారత్ గణనీయ వృద్ధి సాధించింది. ఆహార భద్రత ఉత్పత్తి, సుస్థిరత, పంపిణీ అనే మూడు విధాలుగా పరిశీలన చెయ్యాలి. తృణ ధాన్యాలు , పప్పు ధాన్యాలు కూడా కీలకమే.
జాతీయ , రాష్ట్ర స్థాయిలో ఉత్పత్తి తగ్గుతుంటే ఆహార భద్రత చిక్కులో పడుతున్నట్లే లెక్క. 1997- 2007 మధ్య ఆహార ధాన్యాల అందుబాటు 12 % తగ్గింది. నేటికి ఇంకా తగ్గుతూనే వుంది. ఉమ్మడి ఎ.పి లో తృణ ధాన్యాల ఉత్పత్తి 2001 – 07 మధ్య 1 కోటి 50 లక్షల టన్నులు ఉంది. అది నానాటికి తగ్గిపోతూ నేడు లోటులో ఉంది. కొంత భూమి తోటలు , చేపల చెరువులకు వినియోగించడంతో వాటి ఉత్పత్తి పెరిగి ధాన్యాల ఉత్పత్తి ఇంకా తగ్గుతోంది.
3. సహజ వనరుల తరుగుదల : సహజ వనరులు తరిగిపోవడంతో భూమి , నీరు అందుబాటు తగ్గడం వ్యవసాయ రంగానికి సంకటంగా మారాయి. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, గనులు తవ్వకం వల్ల ఈ రెండు కీలక వనరులైన భూమి , నీరు అవసరం వాటికి ఎక్కువ పెరుగుతోంది. దరిమిలా వ్యవసాయ రంగానికి నీరు , భూమి తగ్గిపోతూ వస్తోంది.
ఉమ్మడి ఏ.పి లో 1990 – 2007 మధ్య అంటే దాదాపు 20 సం.లలో 20 లక్షల హెక్టార్ల పంట భూమిని కోల్పోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఇంకా ఇంకా కోల్పోతూ వస్తూనే వుంది. చాలా భాగం సాగునీటి వసతి ఉన్న ప్రాంతమే కోల్పోవల్సి వచ్చింది.
రోజు రోజుకూ క్షారత్వం పెరగడంతో ఇంకో 12 లక్షల హెక్టార్ల సాగు యోగ్యతా భూమి పనికి రాకుండా పోయింది. నేటికీ క్షారత్వం రోజు రోజుకు పెరుగుతూనే వుంది. కావున ఆ సాగు భూమిని పురుద్ధరించు కోవాలి. నీటిని వడిసి పట్టు కోవడానికి తగిన వ్యూహాన్ని అనుసరించాలి.
4. సాగునీటి వ్యవస్థ స్థిరీకరణ : సాగునీటి సదుపాయం ఉన్న నికర భూమి 45 లక్షల హెక్టార్లు. 15 లక్షల ఎకరాల్లో మాత్రమే ఏటా 2 పంటలు పండుతున్నాయి. మిగతా 30 లక్షల ఎకరాల భూమి బీడుగా వుండడమో లేక కొంత భాగంలో రెండో సీజన్ లో మెట్ట పంటలు పండుతాయి. రెండవ పంటకు నీరు అందక పోవడంతో , నీటి సదుపాయం ఉన్న భూముల్లో సైతం తరువాతి సీజన్ లో పంట సరిగా పండడం లేదు.
నదులు, చెరువులు , బావులు మొదలైన సాగునీటి వనరులకు వర్షమే ఆధారం. సగం భూమి బావుల కింద వుంటే , మూడో వంతు కాలువల ద్వారా సేద్యం చేస్తున్నారు. అన్నిటికీ వర్షాలే ఆధారం అవ్వడంతో ఏటేటా సాగు విస్తీర్ణంలో కూడా హెచ్చు తగ్గులు ఉంటున్నాయి. వరి పంట దెబ్బతింటోంది. కాల్వల నీటి స్థిరీకరణ , మరమ్మత్తులు అవసరం. ఈపాటి ఎ.పి లో అయితే గత ఐదు సం.లుగా కనీసం మరమ్మత్తులు లేక నీరు సముద్రం పాలయ్యింది.
5. ఇంధన సంక్షోభం : ప్రైవేటీ కరణ వల్ల విస్తృత పట్టణీకరణ , పారిశ్రామికీకరణ జరిగి ఇంధన వనరుల అవసరం నానాటికీ పెరుగుతోంది. దీనివల్ల వ్యవ సాయ రంగం దెబ్బతింటోంది. వ్యవసాయ పంపుసెట్లకు అవసరమైన విద్యుత్తు లభ్యత తగ్గిపోవడంతో బావుల కింద చేస్తున్న వ్యవసాయం దెబ్బతిని ఉత్పత్తి పడిపోతోంది. పంట భూముల్లో జీవ ఇంధనాలకు సంబంధించిన పంటలు వేస్తుండడంతో భవిష్యత్తులో ఆహార ధాన్యాలు తగ్గిపోయే అవకాశం హెచ్చుగా ఉంది.
6. రైతుల ఆదాయం తగ్గుదల : గత ఇరవై ఏళ్లుగా వ్యవసాయ వృద్ధి , వ్యవసాయేతర రంగాల్లో కన్నా తక్కువుగా ఉంది. సేవా , తయారీ రంగాల్లో ఏటా 10 % పైగా వృద్ధిని నమోదు చేస్తూ ఉంటే వ్యవసాయం 3 % దాటడం లేదు. దానివల్ల ఇతర రంగాల్లో పనిచేసే వారి కన్నా రైతుల ఆదాయం తగ్గిపోతోంది. దానితో గ్రామీణ – పట్టణ ప్రాంతాల మధ్య అగాధం పెరిగి సామాజిక , ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
ఎన్.ఎస్.ఎస్ ( జాతీయ శాంపిల్ సర్వే ) నివేదిక ప్రకారం రైతులు పొందే వార్షిక ఆదాయం 2003 నాటి లెక్కల ప్రకారం 12 వేలు వుంటే , ఆ తరువాత 9 వేలకు పడిపోయింది. రైతు కుటుంబం అన్ని వనరుల నుండి పొందే వార్షిక లభ్యత 19,800 ఉంటే , వార్షిక వ్యయం ( విద్య, ఆరోగ్యం, వ్యవసాయం ) 28,600 గా ఉంది. ఆదాయంకన్నా ఖర్చు ఎక్కువ అవుతోంది.
వ్యవసాయం నుండే వచ్చే ఆదాయం తగ్గిపోవడం, వ్యవ సాయేతర రంగాల నుండి రైతుకు ఆదాయం లేకపోవడం వల్ల కుటుంబ ఖర్చులు పెరిగి , రుణాలపై ఆధారపడవల్సి వస్తోంది. దానితో ఏటేటా రుణాల ఊబిలో కూరుకు పోతున్నాడు. ఎన్.ఎస్.ఎస్ సర్వే ప్రకారం ఎ.పి లో 82 % రైతులు రుణాల ఊబిలో చిక్కుకుని ఉన్నారని తెలియ జేసింది. దానివల్లే ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. రుణ బకాయి రైతుల్లో 70 % మంది రెండు ఎకరాల లోపు వారని తేలింది.
7. ఇతర ఆదాయాలు లేకపోవడం : ఎ.పి లో మొత్తం మానవ శక్తిలో 62 % వ్యవసాయ , వాటికి సంబంధించిన రంగాల్లోనే ఉంది. 80 % రైతుల ప్రధాన వృత్తి వ్యవసాయం. క్రమేపీ వ్యవసాయం పై ఆదాయం తగ్గుతుండడంతో ఇతర రంగా లలోకి కొంతమంది మరలాలి. ఇతర ఆదాయం కూడా కొంతమేర తోడయితే రైతు దేశానికి తిండిని అందించ గల్గుతాడు. సరైన విధానాలు, వనరులు లేక కాదు. పాలన లోపం వల్ల , అవినీతి వల్ల నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేక పోతున్నారు.
రైతులంటే చులకన భావం. పరిశ్రమల వల్లే దేశం అభివృద్ధి చెందుతుందనే ఒక రకమైన భావ దారిద్ర్యం. అసలు తిండి లేకపోతే ఏమి చేస్తారు ? కార్పొరేట్లకు , సాధారణ మానవులకు , రాజకీయ వేత్తలకు , ఉద్యోగులకు అందరికీ తిండి లేకపోతే ఒక్క పూట గడవదు. డబ్బు కట్టలు, కార్లు , విమానాలు కడుపు నింపలేవు. ఆహారమే మన శరీరానికి డిజైన్ చేయబడింది. ముందు రైతును గౌరవించడం నేర్చుకోవాలి.
ప్రభుత్వాలు అనేక ప్రొజెక్టులకు రూపకల్పన చేస్తున్నా , వాటిని సకాలంలో పూర్తి చేయలేక పోతున్నాయి. అప్పటి సమస్యలే ఇప్పటికీ ఉన్నాయి. ఏటా లక్షల ఎకరాల భూమి పరిశ్రరమల పేర ధారాదత్తం చేస్తున్నారు. పదుల ఎకరాలు సరిపోయే పరిశ్రమలకు వందల ఎకరాలు, వందల ఎకరాలు సరిపోయే పరిశ్రమకు వేల ఎకరాల భూమి ధారాదత్తం చేస్తున్నారు. గత పదేళ్లుగా రైతులు ఇంకా తీవ్ర నిర్బంధానికి గురవుతున్నారు. ఆందోళనలతో ఢిల్లీ బాట పడుతూనే ఉన్నారు. అటు కేంద్రం లోనూ , ఇటు రాష్ట్రాలలోనూ బడ్జెట్ లో వ్యవసాయానికి నిధులు పెంచినప్పుడే రైతులు నిలదొక్కుకుని ప్రజలకు ఆహారాన్ని అందించగలరు.