పంచాయతీరాజ్ వ్యవస్థను గాడిలో పెట్టండి
– రాష్ట్ర ఉపాధి హామీ మాజీ కౌన్సిల్ సభ్యులు
అమరావతి, మహానాడు: గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పంచాయతీలో చేసిన పనులకు, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులను జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష పూరితంగా నిలిపివేయడంతో 50 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర ఉపాధి హామీ మండలి మాజీ సభ్యులు వీరంకి వెంకట గురుమూర్తి, మొవ్వ లక్ష్మి, సుభాషిని, పోతుగంటి పేరయ్య అన్నారు. ఈ మేరకు జగన్ పాలనలో గాడి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టాలని కోరుతూ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నూతన కమిషనర్ కృష్ణ తేజను కలిసి వినతి పత్రం అందించారు.
ఆనాడు అప్పులు చేసి పనులు చేసిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, చిన్నచిన్న కాంట్రాక్టులకు, గత వైసీపీ ప్రభుత్వం కక్షతో బిల్లులు చెల్లించకపోవడంతో, కోర్టును ఆశ్రయించారన్నారు. కోర్టు తక్షణమే పెండింగ్ లో ఉన్న ఉపాధి బిల్లులు చెల్లించాలని చీఫ్ జస్టిస్ ఉత్తర్వులు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. విచారణ పేరుతో ఉపాధిహామీ చట్టానికి వ్యతిరేకంగా ఒకే పనికి మూడు పర్యాయాలు ఎంక్వయిరీ వేసి చట్టానికి తూట్లు పొడిచారన్నారు.
కేవలం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పనులు చేశారని కక్షతో చట్టానికి వ్యతిరేకంగా విచారణల పేరుతో వారిని నానా ఇబ్బందులు పెట్టారని తెలియజేశారు. ఇప్పటికే దాదాపు రూ.530 కోట్లు పెండింగ్ లో ఉంచారని కమిషనర్ కృష్ణ తేజకు విన్నవించారు. ఉపాధి హామీ పనులు చేసిన వారు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని గుత్తేదారులకు త్వరగా నిధులు విడుదల చేసి న్యాయం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తప్పక న్యాయం చేస్తానని కమిషనర్ హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.