‘రెడ్డి’గారి.. ‘కమ్మ’టి ప్రవచనం

– కమ్మవారికే కీలక పదవులిస్తున్నారట
– టీటీడీ అడిషనల్ ఈఓ పోస్టు కమ్మవారికిచ్చారట
– విజయసాయిరెడ్డి ‘కులో’పాఖ్యానం
– జగన్ జమానా మొత్తం ‘రెడి’్డ కార్పెట్టేకదా తాతయ్య?
– ముందు మీ అ‘శాంతి’ సంగతి చూడండి
– వైవి, భూమన, ధర్మారెడ్డి, జవహర్‌రెడ్డి దళితులా?
– పార్టీ సమన్వయకర్తలంతా రెడ్లేకదా దొరా?
– ఎన్నికల ముందు 32 మంది కమ్మ డీఎస్పీలకు ప్రమోషన్లంటూ గత్తర
– తర్వాత అసెంబ్లీలో అలాంటిదేమీ లేదన్న సుచరిత
– విజయసాయి కులోపాఖ్యానం వెనుక మతలబేమిటి?
– జగన్ వ్యూహాన్ని విజయసాయి ముందే హెచ్చరిస్తున్నారా?
– కులప్రభావంలో పడవద్దని సంకేతాలిస్తున్నారా?
– సోషల్‌మీడియాలో విమర్శలవానలో తడిసిముద్దవుతున్న విజయసాయి రెడ్డి
( మార్తి సుబ్రహ్మణ్యం)

దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయన్న సామెత విన్నాం. ఇప్పుడు అదే దయ్యాలు ఉపనిషత్తులు, ఇతిహాసాలు కూడా చెబుతున్నాయంటే నమ్ముతారా? చెబుతున్నాయి. నమ్మి తీరాలి మరి! కుల పక్షపాతం గురించి వైసీపీ నేతలు మాట్లాడటమే రోత. కులాభిమానం గురించి.. వైకాపా నేత వేణుంబాక విజయసాయిరెడ్డి మాట్లాడటం కూడా, అంతే రోతగా ఉందన్నది సోషల్‌మీడియాలో తమ్ముళ్ల వ్యంగ్యాస్త్రం. పార్టీ స్కోరు పదకొండుకు పడిపోయినా, ఇంకా వైసీపీకి సిగ్గురాకపోగా.. సిగ్గుమాలిన విమర్శలతో ఇంకా దిగజారుతున్నారన్నది సొంతపార్టీ అభిమానుల ఆవేదన.

టీటీడీ అడిషనల్ జేఈఓగా వెంకయ్య చౌదరిని నియమించడంపై విజయసాయిరెడ్డి బాగా ఫీలయ్యారట. అది ఆయన హృదయాన్ని బాగా గాయపరిచిందట. అసలు కులపచ్చపాతం తెలియని రెడ్డిగారు దానితో ఉడుక్కుని.. కమ్మ వారికే అన్ని కీలకపోస్టులూ ఇస్తున్నారని ఎక్స్‌లో ట్వీటారు. టీ డీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ కమ్మోరికే ఇస్తున్నారన్న విషయాన్ని జనాలకు చెప్పడం ద్వారా.. అప్పటిలా మిగిలిన కులాలను, కమ్మోరికి వ్యతిరేకం చేయాలన్నదే నెల్లూరు రెడ్డి గారి కవిహృదయం. ఆ విషయం బుర్ర బుద్ధి ఉన్న ఎవరికైనా వీజీగా అర్థమవుతుంది. అయితే ఈ ట్వీట్‌ను విజయసాయి బదులు ఏ గుడివాడ నానినో, గన్నవరం వంశీతో చేయించకుండా..రొటీన్‌కు భిన్నంగా నెల్లూరు రెడ్డి గారు ట్వీటడం వెనుక మతలబు ఏమైనా ఉందా? ఇప్పుడు ఫ్యాను పార్టీలో అదో చర్చ.

అధికార వియోగం అనుభవిస్తున్న పంఖా పార్టీకి.. టీడీపీ సర్కారుపై బురదచల్లేందుకు ఎవరెడీగా ఉండే అంశం కులం మాత్రమే. ఈ కార్డుతోనే ఫ్యాను పార్టీ అధికారంలోకి వచ్చింది. 32 మంది కమ్మ డీఎస్పీలకు ప్రమోషన్ ఇచ్చారంటూ నానా గత్తర చేసి, మిగిలిన కులాల్లో కమ్మవ్యతిరేక పుట్టించి, అధకారంలోకి వచ్చిన అనుభవాన్ని మళ్లీ ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. విజయసాయిరెడ్డి ట్వీట్ చూస్తే జగన్‌రెడ్డి భవిష్యత్తు వ్యూహమేమిటో తెలిసిపోతుంది. అంటే నియామకాల విషయంలో టీడీపీ అప్రమత్తంగా ఉండాలన్నమాట.

విచిత్రంగా జగన్‌రెడ్డి సీఎం అయిన తర్వాత, ఆ 32 మంది కమ్మ డీఎస్పీల ప్రమోషన్లపై ఇప్పటి ఇరిగేషన్‌మంత్రి నిమ్మల రామానాయుడు అప్పుడు అసెంబ్లీలో ప్రశ్నిస్తే.. ‘అబ్బెబ్బే అలాంటిదేమీలేదు. ప్రభుత్వం అంతా శాస్త్రప్రకారమే చేసింద’ని, అప్పటి హోంమంత్రి సుచరిత నిండుసభలో సెలివచ్చారనుకోండి. అది వేరే విషయం! అంటే కమ్మోరి భుజంపై తుపాకి పెట్టి, ఎన్నికల్లో టీడీపీని పేల్చి, మిగిలిన కులాల ఓట్లు కొల్లగొట్టారన్నమాట.

ఇప్పుడు కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన వెంకయ్యచౌదరి అనే అధికారికి టీటీడీ అడిషనల్ ఈఓ పోస్టు ఇవ్వడమేంటి? కీలక పదవులన్నీ కమ్మోరికే ఇస్తే ఎలా అన్నది నెల్లూరు రెడ్డిగారి బాధ. తన బాధ ప్రపంచం బాధ కావాలన్నది ఆయన ఆశ. కానీ ఆశ-నిరాశలకు అతీతంగా ఉండే సోషల్‌మీడియా, ఎవరినీ ఊరకనే విడిచిపెట్టదు కదా? పైగా.. టీడీపీ సోషల్‌మీడియా సైనికులు అస్సలు గమ్మున ఉండరు కదా? చిన్నప్పుడు తిన్నది కూడా కక్కించడమే సోషల్‌మీడియా ప్రాధమిక లక్షణం కదా? ఇప్పుడు విజయసాయిరెడ్డి విషయంలోనూ అదే జరిగింది. కాబట్టి వాంతులు కాకతప్పవు మరి!

కీలకపదవులన్నీ కమ్మోరికే ఇస్తే ఎలా అన్న విజయసాయిరెడ్డి ‘కుల విలాపాన్ని’ సోషల్‌మీడియా.. సర్ఫు, డెట్టాల్‌తో శానిటైజేషన్ చేసి మరీ కడిగేస్తోంది. జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో వేసిన ‘రెడ్డికార్పెట్’ను గుర్తు చేసి.. వారి పేర్లతో సహా మళ్లీ రచ్చ చేయడం ద్వారా, జగన్‌రెడ్డి జమానా నాటి ‘రెడ్డాభిషేకం’ సినిమా క్లిప్పింగును డిస్‌ప్లే చేస్తోంది. పడుకున్న వాడిని లేపి తన్నించుకోవడమంటే ఇదే మరి!

జగన్ రెడ్డి జమానాలో వైసీపీ సమన్వయకర్తలంతా రెడ్లే. జగన్‌రెడ్డికి సలహాలిచ్చేది సజ్జల రామకృష్ణారెడ్డి. ఉద్యోగులను ఎగేసేది మరో సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి. జే బ్రాండ్లు అమ్మించేది వాసుదేవరెడ్డి. ఫైబర్‌నెట్ చూసేది బె జవాడ గౌతం రెడ్డి. డిజిటల్ కార్పొరేషన్ పెత్తనం ఇంకో ఐడ్రీమ్ వాసుదేవ రెడ్డి. సీఎంఓ పెత్తనమంతా కడప ధనుంజయరెడ్డిది. గనుల శాఖపై గుత్తాధిపత్యం వెంకటరెడ్డిది. ఇక లిక్కర్ లెక్కలు చూసేది అనిల్-మిథున్‌రెడ్డి. కలెక్టర్లు, కమిషనర్లలో సింహభాగం రెడ్డిగార్లే దర్శనమిస్తారు. ఇలా ఎక్కడ చూసినా రెడ్లే కనిపించేవారు.

పోనీ ఢిల్లీలో చూస్తే లోక్‌సభలో పార్టీ నేత మిథున్‌రెడ్డి, రాజ్యసభలో విజయసాయిరెడ్డి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి. ఇంతమందికి ‘రెడ్డికార్పెట్’ వేసిన వైసీపీ.. ఇప్పుడు టీటీడీ అడిషనల్ ఈఓగా వెంకయ్యచౌదరిని నియమిస్తే.. కులం గురించి మాట్లాడమే రోత అన్నది సోషల్‌మీడియా సైనికుల కన్నెర్ర. వెంకయ్యచౌదరి ఐఆర్‌ఎస్ అధికారి. డిఫెన్స్ సర్వీసుకు చెందిన అధర్మారెడ్డిని ఎలా డెప్యుటేషన్‌పై జగన్‌రెడ్డి ఎలా తెచ్చుకున్నారో, అదే పద్ధతిలో వెంకయ్యచౌదరిని తెచ్చారు. మరి రెడ్డిగారిని తీసుకువస్తే లేని తప్పు, చౌదరిగారిని తీసుకువస్తే ఎలా తప్పవుతుంది చెప్మా?! ఇంకా ఈ చౌదరి గారికి.. మునుపటి ధర్మారెడ్డి గారిలా, తిరుమల ప్రసాదాలతో ఢిల్లీ లైజనింగ్ ఆర్టు లేదు.

పోనీ విజయసాయిరెడ్డి చెప్పినట్లు.. టీటీడీనే తీసుకుంటే, టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్టి, అడిషనల్ ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డి, ఈఓగా పనిచేసిన జవహర్‌రెడ్డి.. చెన్నై శేఖర్‌రెడ్డి ఏమైనా దళితులా అన్నది సోషల్‌మీడియా వెటకారం. ‘ముందు మీ అ‘అశాంతి’ సంగతి చూసుకోండి తాతయ్య’.. జగన్ జమానా మొత్తం రెడ్డి కార్పెట్టే కదా తాతా.. మీరు కులపిచ్చి గురించి మాట్లాడితే సిగ్గుకే సిగ్గేసుంది రెడ్డి గారూ.. వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ధర్మారెడ్డి, జవహర్‌రెడ్డి, సీఎంఓ ధనుంజరెడ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైనా మాల లేదా మాదిగ కులం వాళ్లా ఏంటి? అని ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.

అయితే.. విజయసాయిరెడ్డి అంటే గిట్టని వైసీపేయుల వాదన మరోలా ఉంది. ఈ మధ్య జగన్‌రెడ్డితో కాస్తంత దూరంగా ఉంటున్న విజయసాయిరెడ్డి.. సీఎం చంద్రబాబునాయుడుకు మేలు చేయడానికే, ఈ ట్వీట్ చేశారన్నది ఇప్పుడు ఫ్యానుపార్టీలో జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ. అసలు చంద్రబాబు అప్రమత్తం చేయడమే విజయసాయిరెడ్డి ట్వీట్ సారాంశమన్నది వారి అనుమానం.

అంటే భవిష్యత్తులో.. మునుపటి లెక్క, జగన్ కమ్మోరి భుజంపై తుపాకి పెట్టి బాబుపై గురిపెడతారు కాబట్టి.. నియామకాల విషయంలో బాబు జాగ్రత్తగా ఉండాలని, హింట్ ఇవ్వడమే విజయసాయిరెడ్డి కవి హృదయమన్నది ఫ్యానుపార్టీ నేతల డౌటనుమానం. . ఆ ప్రకారంగా టీడీపీలో సొంత పార్టీ నేతలు చేయని సాహసాన్ని, పరాయిపార్టీ రెడ్డిగారు చేశారన్న మాట.

పోనీలే.. అదీ మంచిదేగా! గతంలో మాదిరిగా పొలిట్‌బ్యూరో, సీనియర్ల ఏకాభిప్రాయ సేకరణ సంప్రదాయానికి తెరదించి.. కొత్తగా జగన్ దారి పడుతున్న తెలుగదేశాధినేతకు, ఇదో హెచ్చరిక సందేశమన్నమాట!! చెడు చెవిలో చెప్పి, మంచి మందిలో చెప్పాలన్న సూత్రానికి ఇది కొంచెం భిన్నం. అంతే!!!