ఆదర్శనీయుల పేర్లతో ప్రభుత్వ పథకాలు అభినందనీయం

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

భావితరాలకు ఆదర్శనీయులైన, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం సర్వదా అభినందనీయం అని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ , అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను.

దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ… పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక ద్వారా యూనిఫాం, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్ లాంటివి ఇస్తున్నారు. ఈ పథకానికి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో అమలు చేయడం మంచి సాంప్రదాయం. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగా, భారత తొలి ఉపరాష్ట్రపతిగా, 2వ రాష్ట్రపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం రేపటి పౌరులకు మార్గ నిర్దేశనం చేస్తుంది.

మధ్యాహ్న భోజన పథకానికి- ఒక నాటి అన్నదాత డొక్కా సీతమ్మ పేరును ఈ పథకానికి పెట్టడాన్ని ప్రతి ఒక్కరం స్వాగతించాలి. ఏ వేళలో అయినా కడుపు నిండా అన్నంపెట్టి ఆకలి తీర్చిన దానశీలి డొక్కా సీతమ్మ . వారి దయాగుణం, సేవాభావం విద్యార్థులకు తెలియచేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు మార్గనిర్దేశమే.

భారతదేశపు మిస్సైల్ మ్యాన్, గత ఎన్ డి ఎ కాలంలో రాష్ట్రపతిగా చేసిన డా.అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం ద్వారా యువతలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది. పేద కుటుంబంలో పుట్టిన కలాం జీవన ప్రస్థానం నేటి తరానికి స్ఫూర్తిని కలిగిస్తుంది.

మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకొంటారు. ఆ మహనీయుల దివ్యాశ్సీసులు ఎన్డీయే ప్రభుత్వానికి ఉంటాయని ఆశీస్తున్నానని అన్నారు.