-యువకుల మధ్య ఘర్షణ
-నివారించబోయిన వ్యక్తిపై కాల్పులు
-లైసెన్సు లేని తుపాకీ స్వాధీనం
మదనపల్లి, మహానాడు : సొంత బామ్మర్ది పై ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మదనపల్లె రూరల్ మండలం వలసపల్లి పంచాయతీ నవోదయ కాలనీలో అర్ధరాత్రి మద్యం సేవించి ఓ బ్యాచ్ వీరంగం సృష్టించింది.
కొందరు యువకులు గొడవ పడుతుంటే స్థానికుడు రెడ్డి ప్రవీణ్ వెళ్లి సముదాయించే యత్నం చేశారు. గొడవ వద్దనే అడ్డుకునే క్రమంలో రెడ్డి ప్రవీణ్ తన మామ దివాకర్ ను ప్రక్కకు నెట్టాడు. అగ్రహించిన దివాకర్ ఇంట్లోకి వెళ్లి లైసెన్స్ లేని తుపాకీ తీసుకొచ్చి రవ్వలను లోడు చేసి బామ్మర్ది రెడ్డి ప్రవీణ్ ను కాల్చాడు. శరీరంలోకి రవ్వలు చొచ్చు కెళ్లాయి.
తుపాకీ శబ్దంతో ఉలిక్కిపడిన కాలనీ వాసులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. తాలూకా సీఐ శేఖర్, ఎస్ఐలు రవికుమార్, వెంకటేశ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రుడిని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. ఘర్షణకు కారకులైన దివాకర్, ఆనంద్, సురేశ్, అన్సర్ అనే యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఆ తుపాకీ ఎక్కడిది? అతని చేతికి ఎలా వచ్చింది? అనే ప్రశ్నలు తలెత్తుకున్నాయి. దీనిపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.