డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరేది?

అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య ప్రశ్న

రాష్ట్రంలో గత వైకాపా ప్రభుత్వం పలు పథకాలకు పెట్టిన పేర్లను మార్చి, కొత్త ప్రభుత్వం కొత్త పేర్లు పెట్టటాన్ని స్వాగతిస్తున్నామని, ఐతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు ఎక్కడా లేదని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు.

సోమవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని పథకాలకు తన పేరు, తన తండ్రి పేరు మాత్రమే పెట్టారని, అన్ని పత్రాలపై తన బొమ్మను ముద్రించుకున్నారని, వీటిపై కూడా ప్రజల్లో వ్యతిరేక వచ్చిందని తెలిపారు.

జగన్నన్న అమ్మ ఒడిని తల్లికి వందనం గానూ, జగన్నన్న విద్యా కానుకను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర గాను, జగన్నన్న గోరు ముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం గాను, జగన్నన్న ఆణిముత్యాలు పథకానికి అబ్ధుల్ కలాం ప్రతిభ పురస్కారం గాను మార్పు చేశారని, కొత్త పేర్ల లో ఎక్కడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు లేకపోవడం నన్ను భాధించిందని తెలిపారు.

అంబేద్కర్ విదేశీ విద్యకు కూడా జగన్నన్న విదేశీ విద్య పేరు పెట్టారని, దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అప్పట్లో తీవ్రంగా తప్పు పట్టారని గుర్తు చేశారు. అదే విధంగా జగన్నన్న విదేశీ విద్య పేరును కూడా తక్షణం మార్చి అంబేద్కర్ పేరు పెట్టాలని కోరారు. రాష్ట్రంలో దళిత సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి గా పని చేసిన ఒకే ఒక్కరు దామోదర సంజీవయ్య పేరును కూడా సంక్షేమ పథకాలకో, అభివృద్ధి పథకాలకో పెట్టాలని, తద్వారా వారి సేవలు ఆయా సామాజిక వర్గాలలో స్పూర్తిని నింపుతాయని బాలకోటయ్య అభిప్రాయపడ్డారు