‘సూపర్‌సిక్స్‌’పై చంద్రబాబు యూ టర్న్‌

-పథకాల అమలుపై నోరెత్తని పవన్‌కళ్యాణ్‌
-సంపద సృష్టించడం అంటే, అప్పులు చేయడమా?
-మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు

తాడేపల్లి: ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన ‘సూపర్‌సిక్స్‌’పై చంద్రబాబు యథావిథిగా యూటర్న్‌ తీసుకున్నారని, అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే, భయం వేస్తోందంటూ డ్రామాలు ఆడుతున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఆ మాట అన్నా.. కూటమి పథకాల గురించి, నాడు గొప్పగా చెప్పిన జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌.. కనీసం నోరు మెదపలేదని ఆయన ఆక్షేపించారు.

టీడీపీ కూటమి ప్రకటించిన పథకాలు అమలు సాధ్యం కాదని, ఎన్నికల ముందు తాము పేర్కొన్నా.. తనకు సంపద సృష్టించడం తెలుసంటూ.. చంద్రబాబు గొప్పలు చెప్పి, ఇప్పుడు కాడి ఎత్తేశారని దుయ్యబట్టారు. సంపద సృష్టించడం అంటే, అప్పులు చేయడమేనా అని నిలదీశారు.

తల్లికి వందనం పథకాన్ని ఈ ఏడాది అమలు చేయడం లేదని, రైతులు ఖరీఫ్‌ సాగు ప్రారంభించినా, వారికి ఇప్పటి వరకు పెట్టుబడి సాయం చేయలేదని, పిల్లలకు ఫీజులు చెల్లించలేదని, చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయం ఇంకా ఇవ్వలేదని.. .. ఇలా అన్ని వర్గాలను టీడీపీ కూటమి ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు.

మరోవైపు శ్వేతపత్రాల పేరుతో పచ్చి అబద్ధాలు చెప్పడం, అన్నింటికీ గత ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తూ నిందించడం, జగన్‌ని వ్యక్తిగత హననం చేయడమే సీఎం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని అన్నారు. చంద్రగిరిలో తమ పార్టీ నాయకుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని భయ భ్రాంతులకు గురిచేసి, ఇబ్బంది పెట్టారని మాజీ ఎమ్మెల్యే చెప్పారు. అసలు ఆయన ఏ నేరం చేశారని, ఎయిర్‌పోర్టులో అదుపులోని తీసుకుని, నానా హంగామా చేసి, ఆ తరవాత నోటీసు ఇచ్చి వదిలారని నిలదీశారు.