విజయవాడ: పెద్దరావురు గ్రామంలోని జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు మరియు గృహ నిర్మాణాలపై తలెత్తిన సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.
కాలనీ వాసులతో నిర్వహించిన అవగాహన సదస్సులో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణంపై ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇళ్ల పట్టాలు ఇచ్చినా ఇళ్ల స్థలాలు చూపించలేదు, పట్టాల్లో పేర్లు మార్చడం, కాంట్రాక్టర్లు పనులు మధ్యలో ఆపేయడం వంటి సమస్యలను లబ్ధిదారులు వివరించారు. కాంట్రాక్టర్ డబ్బులు తీసుకొని ఇళ్లు సగంలో ఆపేసి నిర్మాణం పూర్తి చేయకపోవడం వంటివి ఎక్కువ శాతం లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్బంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ, ఇళ్ల లబ్ధిదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఆదివారం అయితే అందరూ ఉంటారని, మీ సమస్యలు తెలుసుకోవటానికి ఈరోజు ఏర్పాటు చేశామని తెలిపారు. మీ సమస్యలు ఏమి ఉన్నా సభలో తన దృష్టికి తీసుకురావాలని, వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
గతంలో అధికార యంత్రాంగం నుంచి లబ్ధిదారులకు సరైన స్పందన లేదని, కొన్ని సమస్యలు చూస్తే అర్థమవుతుందని పేర్కొన్నారు. అతి కొద్ది మంది మాత్రమే ఇళ్లు కట్టుకున్నట్టు కనపడుతుందని, ఇళ్ల పట్టాలు ఇచ్చినా, ఇళ్ల స్థలాలు చూపించకపోవడం దారుణమని, కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకొని సగంలో అపేసి లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు.
నెల తరువాత మళ్ళీ కలిసి ఇంకా ఏమి సమస్యలు ఉన్నా చర్చిద్దామని, తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అధికారులతో పరిష్కరిస్తానని మంత్రి తెలిపారు.
ఎక్కువ శాతం నిజమైన పేదలకు కాకుండా అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని, నిజమైన పేదలను గుర్తించి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. ఇళ్ల స్థలాలు ఇచ్చి కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇళ్ల నిర్మాణం ఎలా జరుగుతాయి అని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం అక్రమాలపై విచారణ జరిపిస్తామని, నివేదిక ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఉగాది కల్ల పేదలు ఇళ్ల గృహ ప్రవేశం చేసే విధంగా చూస్తామని, అసాంఘిక శక్తులు వల్ల ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్టీల పరంగా ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వడం దుర్మార్గమని, ఈ ప్రభుత్వం పేదల కోసమే పనిచేస్తుందని, శాంతి భద్రతలు పై పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.