ఎన్డీయే కూటమి రాకతో రోడ్లకు మహర్దశ

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాకతో స్వర్ణయుగం ప్రారంభమైందని, ప్రతి నియోజకవర్గంలోని రోడ్లకు మహర్దశ పట్టనుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. ఈ మేరకు ఆమె సోమవారం నియోజకవర్గంలోని కలెక్టరేట్ (కంకరగుంట ఆర్.ఓ.బి) నుండి మూడు బొమ్మల సెంటర్ వరకు 700 మీటర్ల హాట్ మిక్స్ బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రూ. కోటి రూపాయలు అంచనాలతో ఈ పనులు జరగనున్నాయని, వైసీపీ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధిని తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని దుమ్మెత్తిపోశారు. వైసీపీ చర్యలు ఫలితంగా రోడ్డు ప్రమాదాలు జరిగాయని, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి కూడా పనులు ఒక నెలలో పూర్తి అవ్వాలని పత్రికా ప్రకటనలు ఇవ్వటమే తప్ప ఆచరణలో అమలకు శ్రద్ధ వహించలేదని విమర్శించారు. అవినీతికి పాల్పడాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక రోడ్డు నిర్మాణం చూపి నాణ్యతాప్రమాణాలు పాటించకుండా నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఫలితంగా ఆరు నెలలకే రోడ్లు శిథిలమయ్యేవని చెప్పారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్టు, అలాగే క్వాలిటీ కంట్రోల్ విషయంలో సమీక్ష చేయబోతున్నట్టు ఎమ్మెల్యే మాధవి తెలిపారు.