– ఎమ్మెల్యే అరవింద బాబు
నరసరావుపేట, మహానాడు: ఐదేళ్ల పాటు పడకేసిన పారిశుద్ధ్యంపై నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు యుద్ధం ప్రకటించారు. పొద్దున్న లేచినప్పటి నుండి నిద్రపోయే ముందు వరకు ప్రజల్లోనే ఉంటూ సమస్య అనే మాట లేకుండా చేసేందుకు తపిస్తున్నారు. స్వయంగా ఫాగింగ్ యంత్రాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నారు. కాలువల్లో పిచ్చి మొక్కలు తొలగింపజేశారు.
డీవార్మింగ్ స్ప్రే చేశారు. వర్షంలోనూ 8, 11, 21, 29,30 వార్డుల్లో తిరుగుతూ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఐదేళ్లుగా జగన్ రెడ్డి, స్థానిక మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రజల అవస్థల్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. కాలువల్లో చెత్త తొలగించకుండా, డీ సిల్టింగ్ చేయకపోవడంతో మురుగు నీరు రోడ్ల పైకి చేరి రోగాలు వ్యాపించాయని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు గతంలో దోమల పై దండయాత్ర అంటే నవ్వుకున్న జగన్ రెడ్డి..ఇప్పుడు రాష్ట్రంలో వ్యాపిస్తున్న వ్యాధులకు కారణం ఎవరో ఆలోచించాలన్నారు.
నాడు చంద్రబాబు నాయుడు స్పూర్తితో నేడు కూడా వ్యాధుల పై పోరాటానికి శ్రీకారం చుట్టానన్నారు. త్వరలోనే రోగ రహిత నియోజకవర్గంగా నరసరావుపేట నియోజకవర్గాన్ని తీర్చి దిద్దుతానని అరవిందబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషన్, పారిశుద్ధ్య కార్మికులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.