ఆగస్టు 9 క్విట్ కార్పొరేట్స్ డే
పూర్వకాలంలో 18వ శతాబ్దం వరకు ప్రపంచం మొత్తం మీద భారతదేశం అత్యధిక వస్తూత్పత్తి (GDP) కల్గివుండేది. దరిమిలా చైనా మొదటి స్థానంలోకి చేరింది. బ్రిటన్కు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో వ్యాపారం కోసం ప్రవేశించి, అధికారాన్ని కైవసం చేసుకొన్న దరిమిలా మనదేశ ప్రజల కష్టార్జితాన్ని దారుణంగా లూఠీచేసింది.
మన ప్రజలు ఉత్పత్తి చేసే బట్టలు, ఇతర వస్తువుల పైన పన్నులు విధిస్తూ మన దేశం నుండి ఇంగ్లండ్కు పన్ను లేకుండా పత్తిని తీసుకు వెళ్ళి, అక్కడ బట్టల మిల్లులలో తయారైన వస్త్రాలను పన్నులు లేకుండా మనదేశంలో అమ్మడం వల్ల క్రమేపీ దేశీయ వస్త్ర పరిశ్రమ, చేనేత కార్మికుల స్థితిగతులు దారుణంగా దెబ్బతిన్నా యి. ఇతర చేతి వృత్తుల ఉత్పత్తులు దెబ్బ తిన్నాయి. ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత వాటా 24.4% వున్నదల్లా 1950 నాటికి 4.2%కి తగ్గిపోయింది. స్వాతంత్య్రానంతరం పంచవర్ష ప్రణాళికలు, ప్రభుత్వ రంగంలో భారీ పరిశ్రమలు, లైసెన్స్-పర్మిట్ విధానాల ద్వారా నియంత్రణ కొనసాగుతూ వచ్చాయి.
1990 నాటికి విదేశీ మారకద్రవ్య చెల్లింపులలో సమస్య తలెత్తి, అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (I.M.F) వద్ద నుండి రుణసేకరణ, దానితోపాటు ఆర్థిక వ్యవస్థలో నియం త్రణను తొలగించడం, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం మున్నగు ఆర్థిక సంస్కరణలు చేపట్టబడ్డాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటూ వుండగా తీవ్రమైన ఆర్థిక వ్యత్యాసాలు చోటు చేసుకొంటూ వచ్చాయి.
2000లో కేవలం 9 మంది బిలియ నీర్లు (రూ.100 కోట్ల డాలర్లపైన సంపద కల్గినవారు) వుండగా 2017 నాటికి 101, 2022 నాటికి 1665 పెరిగింది. నరేంద్ర మోదీ ప్రధానిగా కేంద్రంలో బి.జె.పి. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గౌతమ్ అదాని, అంబాని సోదరులు, వేదాంత అనిల్ అగర్వాల్ మున్నగు ఆశ్రిత పెట్టు బడిదారులకు వివిధ రూపాలలో వారికి లబ్ధి చేకూర్చే విధా నాలు అమలు చేయబడుతున్నాయి.
సామాన్య ప్రజలపైన పన్ను ల భారాన్ని పెంచివేస్తూ, కార్పోరేట్లపైన సంపద పన్ను రద్దు చేయటమేకాక, కార్పోరేట్ ట్యాక్స్ను 30% నుండి 20%కు తగ్గించడం వల్ల కేంద్రానికి ఏటా రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం తగ్గుతుంది. భారత రాజ్యాంగంలో దేశంలోని సహజ వనరులు కొద్దిమంది వద్ద కేంద్రీకృతం కారాదని, మొత్తం ప్రజాబాహుళ్యానికి మేలు చేకూర్చేందుకు, అభివృద్ధిని సాధించేందుకు వినియోగించబడాలి అని స్పష్టంగా ఆదేశిక సూత్రాలలో పేర్కొనబడినప్పటికీ, అందుకు భిన్నంగా మోదీ దత్త పుత్రుడు గౌతమ్ అదానీకి 12 నౌకాశ్రయాలను, 7 విమా నాశ్రయాలను, కోట్లాది టన్నుల బొగ్గు నిల్వ వున్న గనులను కట్టబెట్టింది. “మానిటైజేషన్” పేరు మీద వేలాది కి.మీ. జాతీయ రహదారులను, విద్యుత్ ట్రాన్స్ మిషన్ లైన్లను పవర్ గ్రిడ్తో సహా కార్పోరేట్లకు కారుచౌకగా అందచేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.
రైతులు, పేదలు, కుటీర, చిన్న పరిశ్రమల రుణపరిమితి విస్తరించేందుకు 1970లో బ్యాంకుల జాతీయీకరణ జరిగి, అంతకు మునుపుకన్నా ఈ వర్గాలకు కొంత మెరుగైన రీతిలో ఋణాలు అందుతూవున్నా, బ్యాంకులు ఇచ్చు మొత్తం రుణ పరపతిలో సింహభాగం కొద్దిమంది కార్పోరేట్ సంస్థలకే వెళుతూ వుంది. కోట్లాది మంది మధ్య తరగతి ప్రజలు, సీనియర్ సిటిజన్లు, మహిళలు బ్యాంకులో వేసుకున్న డిపాజిట్లు ధనంతో బ్యాంకులు రుణాలు ఇస్తూ వుంటాయి. ప్రభుత్వరంగ బ్యాంకులలో రూ.1.20,88,599 కోట్లు మరియు గ్రామీణ బ్యాంకు (ఆర్.ఆర్.బి) వద్ద రూ.6,41,599 కోట్లు మరియు ప్రైవేటు బ్యాంకుల వద్ద రూ.72,95,392 కోట్లు డిపాజిట్లు వున్నాయి.
బ్యాంకులలో ప్రజలు దాచుకున్న ధనంపైన అతి తక్కువ వడ్డీ ఇవ్వబడుతూ వుంది. వ్యక్తులు, ట్రస్టులు, ధార్మిక సంస్థలు, కరెంటు అకౌంటులో వుంచిన ధనంపైన వడ్డీ వుండదు. సేవింగ్స్ బ్యాంక్ అకౌంటులో దాచుకున్న ధనం పైన గతంలో 5%గా వున్న వడ్డీని ఇప్పుడు 2.5-3%కు పరిమితమై డిపాజిటర్లకు ద్రవ్వోల్పణాన్ని పరిగణలోకి తీసుకుంటే ఏమాత్రం లాభించని పరిస్థితి. రైతులు, చిరు వ్యాపారులకు చెందిన 29,53,93,001 ఖాతాలకు 13,44,984 రుణాలు ఇవ్వగా ఒక్కొక్క ఖాతాకు 100 కోట్లకు పైన ఋణాలు పొందిన 16,892 ఖాతాలకు రూ.46,55,618 కోట్ల రుణం ఇవ్వబడింది.
సామాన్య, మధ్య తరగతి ప్రజానీకం బ్యాంకులలో దాచు కున్న ధనం తిరిగి సామాన్య ప్రజల ఆర్థిక అవసరాలకు కాకుండా కార్పోరేట్ సంస్థలకు తరలిపోతుందని స్పష్టంగా తెలుస్తూ వుంది. ప్రకృతి వైపరీత్యాల వలన, చీడపీడల వలన పంట నష్టాలు సంభవించి రైతాంగానికి ఒక్క పర్యాయం పంట రుణాలు మాఫీ చేయమని విజ్ఞప్తిచేసినా స్పందించని మోదీ ప్రభుత్వం పదేళ్లలో బడా బాబులకు రూ.14.56 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేసింది. కట్టకల్గిన స్థోమత వుండి ఉద్దేశ పూర్వకంగా ఎగవేస్తున్నారని బ్యాంకులే పేర్కొన్న వారికి రూ.79,000 కోట్లు రైటాఫ్ చేయబడింది.
2014 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకు సగటున సంవత్సరానికి రూ.7,187 కోట్లు రైటాఫ్ చేస్తూ వుండగా, 2023 నాటికి సగటున రూ.1.27 లక్షల కోట్లు మాఫీచేసాయి. అలాగేప్రైవేట్ బ్యాంకులు సగటున ఏటా చేసిన రైటాఫ్లు రూ.4,115 కోట్ల నుండి రూ.84,000 కోట్లకు అనగా దాదాపు 20 రెట్లు పెరిగింది.
ఈ ఋణమాఫీ పొందిన వారిలో 95% మంది గుజరాతీలు. ఇది చాలదన్నట్లు దివాళా పరిష్కారం (IBC కోడ్) మరియు (NCLT) పరిష్కార పద్దతుల ద్వారా కార్పోరేట్లకు గరిష్ట స్థాయిలో మోడి ప్రభుత్వం లబ్ది చేకూరుస్తూ వుంది. 2016 నుండి 2023 మధ్యకాలంలో దాదాపు రూ.23 లక్షల కోట్ల బకాయిలు వున్న 7,325 కేసులలో దివాళా పరిష్కా రంగా రూ.3.86 లక్షల కోట్లు మాత్రమే రాబట్టబడింది.
ఉదాహరణకు వీడియోకాన్ సంస్థ దాని అనుబంధ 12 సంస్థలు కలిసి మొత్తంగా రూ.71,433 కోట్లు బకాయిని, వేదాంత గ్రూపునకు రూ.2,962 కోట్లకు పరిష్కారం అయినది. అనగా బ్యాంకులకు 96% క్షవరం (Haircut) అయింది. మోడీకి మరొక అత్యంత సన్నిహితుడు అనిల్ అంబానికి చెందిన R.Com సంస్థ రూ.47,124 కోట్లు బకాయి వుండగా ముఖేష్ అంబానీకి రూ.456 కోట్లకే కట్టబెట్టబడింది. ఇంకా పలు కార్పోరేట్ వర్గాలకు లక్షల కోట్ల రూపాయల బాకీలు రద్దు చేయబడుతున్నాయి.
ఈ కారణాల వల్లే సంయుక్త కిసాన్ మోర్చా కార్పోరేట్లను బహిష్కరించాలని పిలుపునిచ్చింది. ఈ విధంగా ప్రజలు దాచుకున్న డిపాజిట్లు చేసిన సొమ్ములో అధికభాగం ఈ కార్పోరేట్లకే వెళుతూ వుండడం వల్ల రైతులు, కౌలు రైతులు, గ్రామీణ పైదలు, బలహీన వర్గాలకు రుణపరపతి సౌకర్యం తగ్గిపోతూ అధిక వడ్డీలకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుండి రుణం పొందాల్సిన దుస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాలలో బ్రాంచీల సంఖ్య సగానికి తగ్గింది. తగ్గటమేకాక 1991 వరకు బ్యాంకు రుణాలలో అత్యధిక భాగం చిన్న ఖాతాదారులకే వెళ్ళుతూ వుండగా ఆర్థిక సంస్కరణల దరిమిలా అధిక స్థాయిలో రుణాలు పొందిన ఖాతాల సంఖ్య బాగా పెరిగింది.
వ్యవసాయం, అనుబంధ రంగాలకు, చిన్న పరిశ్రమలు, మున్నగు ప్రాధాన్యతా రంగాలకు ఋణం పేరుతో ఇవ్వవలసిన 18% లో ప్రత్యక్ష రుణంగా 13.5% మరియు పరోక్ష ఋణం పేరుతో 4.5% వెళుతూ వుంది. మొత్తం వ్యవసాయ రుణంలో 44% రైతులకు వ్యవసాయ ఋణంగా లభించగా, 56% పరోక్షపు రుణంగా వ్యవసాయాధారిత, ఆహార పరిశ్రమ, విత్తన- పురుగు మందులు షాపులకు మున్నగువాటికి ఇవ్వబడింది.
అంతేకాక వ్యవసాయ ఋణంలో 28% వ్యవసాయం చెయ్యకుండా పట్టణాలు మరియు మెట్రో నగరాలలో వుంటూ వున్న ధనిక రైతులకు వెళ్ళిందే తప్ప కౌలు రైతులలో అత్యధిక శాతం మందికి, సన్నకారు, చిన్న రైతులలో 40% మందికి బ్యాంకుల నుండి సహకారం అందటం లేదన్నది అనుభవమే!
అందువలనే కార్పోరేట్లను బహిష్కరించాలని సంయుక్త కిసాన్ మోర్చా యిచ్చిన పిలుపును (ఆగస్టు 9) జయప్రదం చేయవలసిందిగా యావత్ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాము.
(దారి దీపం : ఆగస్టు 2024 సంచిక నుండి)
