నెల్లూరు, మహానాడు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో అపార్ట్మెంట్లో ఇద్దరు మహిళల మధ్య వివాదం హత్యాయత్నానికి దారి తీసింది. పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న ఏరియాలో అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న గాయత్రి అనే మహిళపై అదే అపార్ట్మెంట్లో ఉంటున్న రాజేశ్వరి అనే మహిళ కళ్ళల్లో కారం కొట్టి కత్తితో దాడి చేసింది. ఈ దాడిలో గాయత్రికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి అనంతరం రాజేశ్వరి నిద్ర మాత్రలు మింగి తాను కూడా ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. దాడికి గల కారణం వివాహేతర సంబంధం అని తమ ప్రాథమిక విచారణలో తెలిసినట్టుగా పోలీసులు వెల్లడించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుపుతామని వారు చెబుతున్నారు.