అవనిగడ్డ ప్రధాన డ్రైనేజీ ప్రక్షాళన చేపట్టాం

– ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

అవనిగడ్డ, మహానాడు: అవనిగడ్డ పట్టణ ప్రధాన డ్రైనేజీ ప్రక్షాళన చేపట్టినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం అవనిగడ్డ బస్టాండ్ వద్ద అవనిగడ్డ రోడ్ సైడ్ డ్రైన్ నెంబర్-1 నోటిఫైడ్ డ్రైనేజీ పూడికతీత, ముళ్ళకంప, పిచ్చి మొక్కల తొలగింపు పనులను ఆయన పరిశీలించారు.

అవనిగడ్డ పట్టణం నుంచి బందలాయి చెరువు మీదుగా రత్నకోడు మేజర్ డ్రైనేజీ వరకు మూడు కిలోమీటర్ల పొడవైన ఈ ప్రధాన డ్రైనేజీ పూర్తిగా పిచ్చి మొక్కలు దట్టంగా పెరిగిపోయి పూడిపోవడంతో నెలకొన్న సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అటు రైతులకు ఇటు అవనిగడ్డ ప్రజలకు ఉపయోగపడే ఈ డ్రైనేజీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే చొరవతో చేపట్టిన ఈ పనులను అవనిగడ్డ సబ్ డివిజన్ డ్రైనేజ్ శాఖ ఇంచార్జి డీఈఈ పులిగడ్డ వెంకటేశ్వరరావు, ఏఈఈ చిరంజీవి పర్యవేక్షించారు.