సూపర్ 6 పథకాల అమలు ఎప్పుడు?

తల్లికి వందనం పథకానికి మళ్ళీ వెన్నుపోటు.
– డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి, షేక్ సైదా.

దర్శి, మహానాడు: సూపర్ 6 పథకాలను ఎప్పటినుండి అమలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి,షేక్ సైధాలు ప్రశ్నించారు. ఈ మేరకు వారు శనివారం దర్శి లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో టిడిపి కూటమి అధికారం లోకి వచ్చేటందుకు సూపర్ 6 పథకాలు ప్రధాన కారణం అన్నారు. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చి2నెలలు కావచ్చింది.ఈ 6 పథకాలలో ఒక్క సామాజిక పథకం మాత్రమే అమలు అయింది.మిగతా 5 పథకాలు అమలు కాలేదు.

నిరుద్యోగ యువతకు నెలకు రు 3వేల నిరుద్యోగ భృతి. తల్లికి వందనం పథకం క్రింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ 15,000లు. ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా 20,000 ఆర్థిక సాయం.

ప్రతి మహిళకు నెలకురూ1500(19సంవత్సరాల నుంచి 59 సంవత్సరం వరకు). ప్రతి ఇంటికీ ఏడాదికిఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. బిసి,ఎస్సీ,ఎస్టీ,ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే ఫించన్. ఈ 5 పథకాలు అమలు కాలేదు.

తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం పదేపదే మాట తప్పుతోంది.స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి అని మ్యానిఫెస్టోలో పేర్కొంది.9-7-2024 న విడుదల చేసిన జీవో29 లో విద్యార్థి బదులు తల్లి అని పేర్కొంది..దీనిపై విమర్శలు రాగానే పొరపాటు జరిగింది.ప్రతి విద్యార్థికి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది.ఇప్పుడేమో వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు చేస్తామని చెబుతోంది.ఇది మోసం. మాట తప్పడం అని తులసి రెడ్డి, సైథా మండిపడ్డారు.

తల్లికి వందనం పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుండే అమలు చెయ్యాలని,మిగతా పథకాలను ఎప్పటినుండి అమలు చేస్తారో స్పష్టత ఇవ్వాలని తులసి రెడ్డి, సైద డిమాండ్ చేశారు. మీడియా సమావేశం లో కాంగ్రెస్ నేతలు అమర్నాథ్ రెడ్డి, ఉత్తన్న,సుబ్బరాయుడు,వినయ్, తదితరులు పాల్గొన్నారు.