టాప్ 5 రాష్ట్రాలతో పోటీ పడేలా కొత్త పారిశ్రామికాభివృద్ధి విధానం

– పాలసీ రూపకల్పనలో నీతి ఆయోగ్ ఆలోచనలను పరిగణనలోకి తీసుకోవాలి
– 15 శాతం ఓవర్ ఆల్ గ్రోత్ రేట్ సాధన లక్ష్యంగా నూతన పాలసీని తయారు చేయాలి
– పరిశ్రమల స్థాపనలో ఎపి కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను తిరిగి తీసుకురావాలి
– 100 రోజుల్లోగా పారిశ్రామికాభివృద్ధికి చెందిన ముఖ్య పాలసీలు తీసుకురావాలి
– ఈనెల 16న పారిశ్రామిక వేత్తలతో సమావేశం
– పారిశ్రామికాభివృద్ధి విధానం 2024-29పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష

అమరావతి : పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి దేశంలో టాప్-5 రాష్ట్రాలతో పోటీ పడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం ఉండాలని, ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనలో నీతి ఆయోగ్ ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

15 శాతానికి పైగా వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా నూతన పాలసీ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. త్వరలో అమల్లోకి తేనున్న నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం 2024-29పై రూపొందించిన ముసాయిదా విధానాన్ని పరిశ్రమల శాఖ మంత్రి టిజి.భరత్, అధికారులు సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పరిశ్రమలకు సంబంధించి గతంలో ఎపికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను తిరిగి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ఆదేశించారు. 2014-19 కాలంలో ఎపిలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం కల్పించే వివిధ రాయితీలు, మౌలిక సదుపాయాల కల్పన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాల్లో దేశంలో మొదటి స్థానంలో ఉండేవారిమని మళ్ళీ అలాంటి పరిస్థితులు కల్పించి పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వంపై ఒక నమ్మకం కలిగే రీతిలో నూతన పారిశ్రామిక విధానం రూపకల్పన చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

ప్రస్తుతం 53శాతం రామెటీరియల్ కింద రాష్ట్రం నుండి వెళుతున్నాయని వాటికి ఏవిధంగా వాల్యూ ఎడిషన్ ఇవ్వాలో చూడాలని అన్నారు. పిపిపి, పి-4 విధానాలను నూతన విధానంలో పొందుపర్చాలని చెప్పారు. పరిశ్రమలు ఏర్పాటుకు అవసమరైన అనుమతులు వేగవంతంగా ఇవ్వగలిగితే పరిశ్రమలు త్వరగా ఏర్పాటు అవుతాయని సీయం అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రానికి లేని రీతిలో 10 ఓడరేవులు,10 విమానాశ్రయాలు, మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు, లాజిస్టిక్ సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని కావున పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి ఇవి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయని సీయం చంద్రబాబు పేర్కొన్నారు.

అంతేగాక దేశ పశ్చిమ తీరం కంటే తూర్పుతీర ప్రాంతం రోడ్డు, రైలు, విమానయాన మార్గాలతో మెరుగైన రీతిలో అనుసంధానించబడి ఉందని, నదుల అనుసంధానం కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయగోరే వారికి అన్ని విధాలా అనుకూలమైన అంశాలని పేర్కొన్నారు. వేగవంతంగా, కాస్ట్ ఎఫెక్టివ్ నెస్ ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

భారతదేశానికి కొత్తగా ఏ పరిశ్రమ వచ్చినా దానిని ఏపికి తీసుకువచ్చే విధంగా మనందరం పనిచేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. గతంలో కర్నాటకకు వెళ్ళి పోయిన హీరో మోటార్స్, తెలంగాణాకు వెళ్ళిపోయిన అపోలో టైర్స్ వంటి సంస్థలను ఎపికి తీసుకువచ్చామని సియం చంద్రబాబు గుర్తు చేశారు.

గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఆక్వా, ఆహారశుద్ధి వంటి రంగాల్లో పెద్దఎత్తున పరిశ్రమల స్థాపన జరిగేలా నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం రూపకల్పన జరగాలని చెప్పారు. ఈనెల 16న పారిశ్రామక వేత్తలతో సమావేశం కానున్నామని, అదే విధంగా ఈనెల 23న మళ్లీ నూతన పారిశ్రామికాభివృద్ధి విధానంపై మరొకసారి సమావేశమై చర్చిద్దామని సీయం చంద్రబాబు అధికారులకు చెప్పారు.

అంతకు ముందు రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ కార్యదర్శి డా.యువరాజ్ ప్రతిపాదిత 2024-29 ఎపి పారిశ్రామికాభివృద్ధి పారిశ్రామిక విధానం ముసాయిదాలో పొందుపర్చిన అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింయకు వివరించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టిజి.భరత్, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్, సియం అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కమిషనర్ సిహెచ్.శ్రీధర్, ఏపిఐఐసి ఎండి అభిషిక్త్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.