ఎన్నికలు వచ్చాయంటే చాలు…., నాయకులు ఎక్కడలేని వినయం ఒలకబోస్తుంటారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి చిరునవ్వులు చిందిస్తూ, వాళ్ళ గుడిసెల్లోకి సైతం దూరుతుంటారు. వాళ్లిళ్ళల్లో చంటి పిల్లలుంటే, స్నానాలు చేయిస్తారు . వంటింట్లో చేరి దోసెలు వేస్తుంటారు.
‘అక్కా…. బావా…’ అంటూ అంతులేని ప్రేమానురాగాలు కురిపిస్తుంటారు. ఈ నడమంత్రపు నటనల వల్ల ఓటర్లు కరుణిస్తారా? ఓట్లు వేస్తారా? తటస్థులు అని భావించేవారు ఎవరికి ఓటు వేస్తారు? సంక్షేమ పథకాలు భారీగా అమలు చేసిన వారికా….? లేక, భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వారికా? లేక, తాము బ్రహ్మండంగా పనిచేస్తున్నామంటూ, ప్రొజెక్ట్ చేసుకునేందుకు అదే పనిగా తాపత్రయ పడుతూ… ప్రచారాలలో మునిగి తేలేవారికా?
ఈ టక్కు టమార విద్యలేవీ ఓటర్ల ముందు పనిచేయవని చెప్పడానికి…,మనముం దు రెండు సజీవ తార్కాణాలు ఉన్నాయి.
ఒకటి – 2014 ఎన్నికల ఫలితం . రెండవది – 2019 ఎన్నికల ఫలితం. ఇప్పటి 2024 ఎన్నికల ఫలితాన్ని కూడా మరో ఉదాహరణగా తీసుకోవచ్చు.
2014 లో ఏపీ ని విడగొట్టి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు వారిని బయటకు పొమ్మన్నారు. ఇంత అన్యాయానికి లోనైన తెలుగు రాష్ట్రాన్ని పునర్నిర్మించ డానికి పాలనలో అనుభవజ్ణుడైన చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉంటే బాగుంటుందనే భావం పెద్దఎత్తున వ్యక్తమైంది.
ఈ అభిప్రాయం పేరే…’ పెర్సెప్షన్ ‘.
దీనికి అదనం గా, టీడీపీ కి అనుకూలంగా పవన్ కళ్యాణ్ చేసిన సుడిగాలి పర్యటనలు, బీజేపీ ఇచ్చిన మద్దతు కూడా ఈ ‘పబ్లిక్ పెర్సెప్షన్ ‘ ను మరింత బలోపేతం చేశాయి. ఇలా నాలుగు పక్కలా ఎత్తి పట్టుకుంటేనే… చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో గెలిచి, రాష్ట్రం లో ప్రభుత్వ పాలక పగ్గాలు చేపట్టారు.
మరి, 2014 లో అంతటి ప్రజాభిమానంతో అధికారం లోకి వచ్చిన చంద్రబాబు నాయుడు, 2019 లో ఓడిపోవడానికి ప్రధాన కారణం – ‘పబ్లిక్ పెర్సెప్షన్’.
ఆయన వ్యవహార శైలి పట్ల అది వ్యతిరేకంగా ఉండడమే కారణం. అది ఎందుకు అంత వ్యతిరేకం గా ఉన్నదో…. ఆయనకూ తెలియకుండా ఉండదు. అంతే తప్ప, సంక్షేమ పథకాలు అమలు చేయలేదనో, అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టలేదనో కాదు.
అలాగే, 2019 లో 151 సీట్ల తో అధికారం చేపట్టిన వై ఎస్ జగన్మోహనరెడ్డి; తనకు అనుకూలమైన ‘పబ్లిక్ పెర్సెప్షన్’ లేని కారణంగానే మొన్నటి 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమై పోయారు. ఏదో ఒక పథకం వంకతో ఓటర్లకు నాలుగు చిల్లర డబ్బులు విదిలిస్తే, వారంతా ఆటోమాటిక్ గా తనకు ఓట్లు వేసేస్తారని జగన్ భావించారు. కానీ, ” మీ పాలన పై సదభిప్రాయం కూడా మాకు ముఖ్యమే ” అని ఓటర్లు ఆయనకు తేల్చి చెప్పారు. ఫలితం గా, సుజనా చౌదరి చెప్పినట్టు,జగన్… ” వన్ టైమ్ వండర్” గా మిగిలిపోయారు. ఆయన్ను దింపి, చంద్రబాబుకు ఓటర్లు మళ్ళీ పాలనా పగ్గాలు అప్పగించారు.
సంక్షేమ పథకాలు అమలు చేయడానికి , అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి, ‘పబ్లిక్ పెర్సెప్షన్’ కు సంబంధం లేదనే విషయం పాలక స్థాయి లో ఉన్న నేతలు గమనించాలి.
నిజానికి, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టకపోయినప్పటికీ, లేదా – అభివృద్ధి కార్యక్రమాల సమాచారం తో రాష్ట్రాన్ని ఊర్రూతలూగించక పోయినప్పటికీ “పబ్లిక్ పెర్సెప్షన్ ” కు వచ్చిన నష్టం ఏమీ లేదు.
కానీ, పాలకుల ” ఇంటెలెక్చ్యువల్ ఆనెస్టీ”, వ్యవహార శైలి లో నిజాయతీ మాత్రం ప్రజల భావన ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. వారి మాటలు, చేతలు, వ్యవహార శైలి, నడక, చూపు….. ఇలా, పాలకులకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న, పెద్ద విషయమూ ప్రజల మనోభావాలను, అభిప్రాయాలను…. అనుకూలం గానో, వ్యతిరేకం గానో తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అయితే,దానిని వారు రోజువారీ చెప్పరు. అందుకని, పాలకులూ గమనించరు. గుంభనం గా ఉంటూనే ప్రతి ఒక్క విషయాన్ని ఓటర్లు మనసుకు ఎక్కించుకుంటారు. తమ అభిప్రాయాన్ని నోటితో చెప్పరు. పోలింగ్ బూత్ లో…. చేతితో చెబుతారు.
అందుకే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిపై 2019 లో ఓటర్లు తమ అభిప్రాయం ఆవిధంగా చెబితే, 2024 ఎన్నికల్లో జగన్ వ్యవహార శైలిపై ఓటర్లు తమ అభిప్రాయాన్ని ఈ విధంగా తేల్చి మరీ చెప్పారు.
ఇక, ఇప్పుడు చంద్రబాబు పాలన నాలుగో విడత ప్రారంభమైంది. జగన్ పై తీవ్రాతి తీవ్రమైన వ్యతిరేకత తో ప్రజలు తనకు ఇచ్చిన అవకాశం గా దీనిని చంద్రబాబు నాయుడు పరిగణిస్తున్నారో, లేక…. తన గత పాలన నచ్చి, మెచ్చిన ప్రజలు ఇచ్చిన అవకాశంగా పరిగణిస్తున్నారో తెలియదు. అలాగే, మూడు పార్టీల భాగస్వామ్యం తో ఏర్పాటైన “కూటమి” కి తాను నాయకత్వం వహిస్తున్నాను తప్ప, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లో మిగిలిన రెండు పార్టీలు – జనసేన, బీజేపీ కూడా చేరాయి… అవి నిమిత్త మాత్రమే అని చంద్రబాబు భావిస్తున్నారేమో కూడా తెలియదు.
ఎందుకంటె – 2014 నుంచి 2019 మధ్యలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నేతృత్వం లో ” జన్మ భూమి ” అనే కార్యక్రమాన్ని అమలు చేశారు. ఇదొక రాజ్యాంగేతర ఏర్పాటు. దీనివల్ల, తెలుగుదేశం ప్రభుత్వానికి ఎంత అపకీర్తి వచ్చిందో చెప్పలేము. ఈ కమిటీలు…. గ్రామాలలో “రాజ్యాంగేతరశక్తులు ” గా తయారయ్యాయనే విమర్శలను ఎదుర్కొన్నాయి.
ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులు నిర్వహించాల్సిన విధులను, జన్మభూమి కమిటీల లోని ఒకరిద్దరు సభ్యులే నిర్వహించేవారన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఫలితంగా 2019 లో టీడీపీ ఘోర పరాజయం లో ఈ జన్మభూమి కమిటీలు గణనీయమైన పాత్రనే పోషించాయి. టీడీపీ ప్రభుత్వం పై ప్రజలలో ఆగ్రహవేశాలు పెల్లుబుకడానికి ఈ జన్మభూమి కమిటీలు ఒక ముఖ్య కారణం.
ఇప్పుడు మళ్ళీ “జన్మ భూమి ” కి పునఃప్రాణ ప్రతిష్ట పోశారు. దీనిని మళ్ళీ ఉనికి లోకి తీసుకు రావడం అంటే, ” పబ్లిక్ పెర్సెప్షన్ ” ను పరిగణలోకి తీసుకోకపోవడమే. వీటి ఏర్పాటు వల్ల,ప్రభుత్వం పై ప్రజలలో వ్యతిరేకత ఏర్పడడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు.
ఇది టీడీపీ ఆలోచనో, కూటమి ఆలోచనో చెప్పలేదు. తెలుగుదేశం కార్యకర్తలను దొడ్డిదారిన ప్రభుత్వ నిర్వహణ లోనికి జొప్పించే ఈ జన్మభూమి కమిటీ సభ్యులలో నోరున్న వారు…. ప్రతి ప్రభుత్వ శాఖ పనిలోనూ వేలు పెడతారు. అందినంత “సేవ” చేస్తారు. గతం లో చేశారు. ఈ “సేవ ” లో జనసేన, బీజేపీ వారికీ ” వాటా ” పెడితే పెట్టవచ్చు.
జగన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో జరిగిన నేరాలు, ఘోరాలు చూసి విసుగెత్తిన ప్రజలు, అప్పటి సకల నేరస్తులపై చంద్రబాబు మెరుపు వేగం తో చర్యలు తీసుకుని, వారిని జైళ్లకు పంపిస్తారని ఆశించారు. కానీ, జరుగుతున్నది చూస్తూ జనం తీవ్ర అసహనికి లోనవుతున్నారు. జగన్ పాలనలో సర్వ అక్రమాలకు పాల్పడిన వారు ఇప్పటికీ దర్జాగా సమాజం లో తిరగడాన్ని జనం జీర్ణించుకోలేక పోతున్నారు. చట్టం ప్రకారం వెడదాము అని చంద్రబాబు అంటున్నారు. అయితే, ఆ చట్టం అనేది మెరుపు వేగంతో స్పందించాలనే ప్రజలు కోరుకుంటున్నారు.
జగన్ గానీ, ఆయన మీడియా గానీ రేయింబవళ్ళు అసత్యాలు, ఆరోపణల తో ప్రభుత్వం పై, వ్యక్తిగత స్థాయిలో చంద్రబాబు వ్యక్తిత్వం పై చెలరేగిపోతుంటే ; తెలుగుదేశం వైపు నుంచి తగిన స్పందన లేకపోవడం పట్ల జనం ఆశ్చర్య పోతున్నారు.
గత పాలకుల చేతుల్లో అవమానాలు ఎదుర్కొంటూ…. తమ జీవితపు విలువైన కాలాన్ని కూడా కోల్పోయిన వారిని సైతం, తగిన రీతిలో గుర్తించడం పట్ల చంద్రబాబు నాయుడు ఆసక్తి చూపడం లేదన్న భావం పౌర సమాజం లో విస్తృతంగా వ్యాపించింది. ఈ భావన ఆయన ఇమేజ్ ను తీవ్రం గా దెబ్బ తీస్తున్నది. 18-20 ఏళ్ళవయస్సు లో పెళ్లి చేయాల్సిన అమ్మాయికి – 45…50 ఏళ్ళు వచ్చాక చేద్దాము లో అని అనుకుంటే ఎలా ఉంటుందో ; నామినేటెడ్ పదవులు నియామకం లో చేసే జాప్యం అలా ఉంటుంది.
గత పాలనలో జగన్ పై ఢిల్లీ నుంచి వీరోచిత పోరాటం చేసిన రఘురామ కృష్ణంరాజును తగిన విధం గా గుర్తించక పోవడం అన్యాయమన్న భావన జనం లోకి వెళ్ళిపోయింది. రఘురామ కృష్ణంరాజు, ఐపీయస్ లో చివరి అయిదు సంవత్సరాలు జగనార్పణం అయిపోతున్నదని తెలుస్తున్నప్పటికీ జగన్ పై అనితర పోరాటం చేసిన ఏ బీ వెంకటేశ్వర రావు, నిమ్మగడ్డ రమేష్, రిటైర్డ్ ఐఏఎస్ అయిన పీ వీ రమేష్ వంటి వారు చేసిన త్యాగాలు …. జగన్ పై ” పబ్లిక్ పెర్సెప్షన్” అనేది వ్యతిరేకంగా ఏర్పడడం లో కీలకం గా వ్యవహరించాయి. చంద్రబాబు కృషికి వీరిపోరాటాలు అదనపు బలాన్ని సమకూర్చాయి.
ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గమనం లోకి తీసుకో దలుచుకున్నారో … లేదో తెలియదు. జగన్ పోకడలకు వ్యతిరేకం గా వందమంది పోరాడితే, వారి పోరాట ఫలితమే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి తోడ్పడ్డాయి.
నామినేటెడ్ పదవుల భర్తీ పట్ల ఎక్కడా కదలిక కనపడడం లేదు. ఈ పదవుల నియామకం పట్ల ఆయనకు అంత ఆసక్తి లేదన్న ప్రచారం మెల్లగా ఊపందుకుంటున్న విషయం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లిందో… లేదో తెలియదు.
జగన్ హయాం లో చక్రం తిప్పిన అధికారులలో కొందరికి ఇప్పుడూ మంచి మంచి పోస్టింగ్ లు దొరుకుతున్నాయనే వార్తలు మీడియా లో చూస్తున్న జనం షాక్ లకు గురవుతున్నారు. ఇవన్నీ, ఇప్పటి ప్రభుత్వ పాలకులపై ప్రతికూల పెర్సెప్షన్ ఏర్పడడానికి దోహదం చేస్తాయి.
చంద్రబాబు…. పాత చంద్రబాబే అన్న ప్రచారం జనం లోకి వెడితే ; తన ప్రతిష్టకు భంగం కలుగుతుందనే అభిప్రాయాన్ని ఆయన పరిగణన లోకి తీసుకోవాలి. ఆయన మాటలో, చేతలో, చూపులో, నడకలో, వ్యవహార శైలిలో, నిర్ణయం లో, ఆలోచనా రీతుల్లో …. జనానికి నిజాయతీ కనిపించాలి.
లేకపోతే, నష్టపోయేది ఆయన మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా. ఏక మొత్తం గా ఆధః పాతాళానికి దిగజారిపోతుంది. “ప్రస్తుత” పరిస్థితుల్లో ఆయన నాయకత్వానికి ప్రత్యామ్నాయం లేదు. అందుకే, ప్రజల పట్ల ఆయన కనికరం చూపించాలి. పాలన లో….మానసికమైన నిజాయతీ ఆణువణువునా ప్రజలకు కనిపించాలి. అప్పుడు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పధకాల కంటే,” పబ్లిక్ పెర్సెప్షన్” దే పై చేయి అవుతుంది.
ప్రజల్లో ఎప్పటికప్పుడు వ్యక్తమయ్యే ఈ పెర్సెప్షన్ ను ఒడిసి పట్టుకుని, ప్రభుత్వ పెద్దలకు నివేదించడానికి ప్రతేకం గా ఒక విభాగం ఉండాల్సిన అవసరం ఉంది.
ఇంటలిజెన్స్ విభాగం లో విడిగా ఉన్న “మీడియా ట్యాంక్ ” ను వినియోగించుకోవచ్చు. ఏ బీ వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ విభాగాధిపతి గా ఉన్న సమయం లో దీనిని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తం గా జరిగే వివిధ పరిణామాలను ఒక డీ ఎస్పీ పర్యవేక్షణలో ఈ విభాగం నిశితం గా గమనిస్తుంటుంది. దీనిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
తమ ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే.. తన ఆశలు, ఆకాంక్షలకు అనుగుణం గా ప్రజలను మానసికంగా సన్నద్ధం చేసే పనిలో చంద్రబాబు ఉన్నారా అనే సందేహాలు మొదలయ్యాయి.