ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడాలి

• వాడవాడలా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు నిర్వహించాలి
• స్వాతంత్య్ర దిన వేడుకల్లో సమరయోధులను సత్కరించండి
– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ 

అమరావతి, మహానాడు:  దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ప్రతి ఇంటిపై మువ్వన్నెల జాతీయ పతాకను ఎగురవేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పిలుపు నిచ్చారు. హర్ ఘర్ తిరంగ కార్యక్రమంపై బుధవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదే విధంగా ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు, జాతీయ జెండా ప్రాముఖ్యతను ప్రజలందరికీ తెలియజేసి వారిలో చైతన్యాన్ని కలిగించేందుకు ఊరూ వాడా హర్ ఘర్ తిరంగా ర్యాలీలను నిర్వహించడంలో కలెక్టర్లు కీలక భూమిక పోషించాలని సిఎస్ ఆదేశించారు.

15వ తేదీన జరిగే స్వాతంత్య్ర దిన వేడుకల్లో స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించాలని సిఎస్   కలక్టర్లను ఆదేశించారు. అలాగే   వేడుకల్లోను, ఎట్ హోం కార్యక్రమంలోను ప్రజల్లో దేశభక్తి భావాలను పొందించే రీతిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అదే విధంగా జాతీయ జెండాతో ఉన్న సెల్ఫీ ఫొటోలను, వీడియోలను గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా https://hargartiranga.comలో అప్ లోడ్ చేయాలని చెప్పారు.

అనంతంరం హర్ ఘర్ తిరంగా కాన్వాస్ పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంతకం చేశారు. ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి వినయ్ చంద్, వివిధ జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.